మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్
ముంబై: జర్మన్ ఫార్మా అండ్ కెమికల్ దిగ్గజం బేయర్ గ్రూప్ మోన్ శాంటోకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.1,100 పైగా కోట్లతో మోన్ శాంటో లోని 26శాతం అదనపు వాటాను కొనుగోలు చేసే మాండేటరీ ఓపెన్ ఆఫర్ ప్రకటనతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. బీటీ విత్తన దిగ్గజం మోన్‌శాంటో వాటాదారులకు బేయర్ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ ప్రకటించడంతో మోన్ శాంటో ఇండియా షేర్లు ఇంట్రాడేలో 6 శాతం పైగా ర్యాలీ అయ్యాయి.
ఈ ఓపెన్ ఆఫర్ కింద, బేయర్ రూ 2,481.60 ధరకు వాటాదారుల నుండి దాదాపు 44.88 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది గత మంగళవారం నాటి మోన్ శాంటో ధరకు దాదాపు 4 శాతం అదనం. భారత నిబంధనల ప్రకారం, ఒక సంస్థ మరో లిస్టెడ్ కంపెనీలోని 15 శాతం వాటావరకు పొందినట్లయితే అది ఓపెన్ ఆఫర్ గా పరిగణించబడుతుంది.
కాగా బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ , అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్‌శాంటో విలీనానికి 66 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.