Bayer
-
భారత్‌లో సాగు ఆధునీకరణ చర్యలు భేష్
పానిపట్: భారత్‌లో సాగు రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జర్మన్ కెమికల్స్ దిగ్గజం బేయర్ దక్షిణాసియా ప్రెసిడెంట్ సైమన్ వీబుష్ ప్రశంసించారు. వెనుకబడిన వ్యవసాయ రంగంతో భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2047 నాటికి అగ్రరాజ్యంగా అవతరించడం సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలు వ్యవసాయాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోందని సైమన్ చెప్పారు. భారత్ వినూత్న ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ, రెగ్యులేటరీ ప్రక్రియలను మరింతగా డిజిటలీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత నెలకొన్న నేపథ్యంలో తాము కలుపు మందులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. క్రిమిసంహారకాల కన్నా అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. వరి, గోధుమలు, చెరకు వంటి కీలక పంటల కోసం కలుపు మందులను అభివృద్ధి చేస్తున్నామని సైమన్ చెప్పారు. అంతర్జాతీయంగా తాము నిర్వహిస్తున్న ’ఫార్వర్డ్ఫామ్స్’ కార్యక్రమం ద్వారా భారత్‌లో కూడా వ్యవసాయ ఉత్పాదకతను, ఆగ్రో–కెమికల్స్‌ను మెరుగుపర్చే కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
ఇక మేనేజర్లు ఉండరు.. ప్రముఖ కంపెనీ వినూత్న ప్లాన్!
జర్మన్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బేయర్ వినూత్న ప్రణాళిక రచించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. బేయర్ కొన్ని నిర్మాణాత్మక మార్పులు చేస్తోంది. కార్పొరేట్ బ్యూరోక్రసీని తగ్గించడం, ఉద్యోగులకు ఎక్కువ స్వయంప్రతిపత్తి కల్పించడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించేలా చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిల్ ఆండర్సన్ దీనికి "డైనమిక్ షేర్డ్ ఓనర్షిప్" అని పేరు పెట్టారు. కంపెనీ నిబంధనలకు సంబంధించి 1,300 జీలకుపైగా ఉన్న లిటరల్ కార్పొరేట్ రూల్‌బుక్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది 'వార్ అండ్ పీస్' పుస్తకం కంటే ఎక్కువగా ఉందని చమత్కరించారు. మిడిల్ మేనేజర్లను తగ్గించి, ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని యోచిస్తున్నట్లు బిల్ ఆండర్సన్ తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ గురించి గురించి న్యూజెర్సీలో కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. నూతన ప్రణాళికలో భాగంగా తొలగించనున్న మేనేజర్ల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. అయితే యూఎస్‌కు చెందిన వేలాది మంది మేనేజర్లకు కంపెనీ ఇతర ఉద్యోగాలు కేటాయించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బేయర్స్ సీఈవో అండర్సన్ ప్రతిపాదన కంపెనీ సంస్థాగత ఖర్చులను సుమారు 2 బిలియన్ యూరోలు తగ్గిస్తుందని జర్మన్ కార్పొరేషన్ మార్చిలో పేర్కొంది. గత సంవత్సరంలో బేయర్ షేర్లు 60.40 యూరోల నుండి 27.64 యూరోలకు 50 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ సుమారు 34 బిలియన్ యూరోల రుణంపై నడుస్తోంది. -
రూ.14వేల కోట్లు చెల్లించండి
శాన్ ఫ్రాన్సిస్కో: బేయర్‌కు చెందిన మోన్శాంటో అగ్రీ కంపెనీకి భారీ దెబ్బ తగిలింది. ఆ కంపెనీకి చెందిన ‘రౌండప్’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా నేపథ్యంలో వారికి సుమారు రూ.14 వేల కోట్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆక్లాండ్‌లోని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. రౌండప్‌కు సంబంధించి మోన్శాంటోకు కోర్టుల్లో వరుసగా ఇది మూడవ ఓటమి. గ్లైఫోసేట్ ఆధారిత తమ ఉత్పత్తికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ చెబుతోంది. కాగా తాజా తీర్పు చరిత్రాత్మకమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈ తీర్పును తాము సవాల్ చేయనున్నట్లు బేయర్ ఒక ప్రకటనలో తెలిపింది. -
మోన్శాంటో కొనుగోలును పూర్తి చేసిన బేయర్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఔషధ, రసాయనాల కంపెనీ బేయర్, విత్తన రంగంలో అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీ అయిన మోన్శాంటో కొనుగోలును పూర్తిచేసినట్టు ప్రకటించింది. 63 బిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన మోన్శాంటోను కొనుగోలు చేసేందుకు 2016 సెప్టెంబర్‌లో బేయర్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా, భారత్ సహా ఈ కంపెనీల కార్యకలాలు నడుస్తున్న దేశాల్లోని అన్ని నియంత్రణ సంస్థల అనుమతులు రావడంతో గురువారం నాడు కొనుగోలు పూర్తయినట్టు బేయర్ ప్రకటన చేసింది. బేయర్, మోన్శాంటో ఈ రెండు మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలే. బేయర్ సస్యరక్షణ ఉత్పత్తులను, ఔషధాలను మన దేశంలో వేర్వేరు విభాగాల ద్వారా మార్కెట్ చేస్తోంది. ఇందులో ఒక కంపెనీ బేయర్ క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థ. మోన్శాంటో బీటీ విత్తనాలను విక్రయిస్తోంది. -
బేయర్–మోన్శాంటో డీల్‌కు సీసీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన మోన్శాంటో కంపెనీని 66 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలన్న జర్మనీ సంస్థ బేయర్ ప్రతిపాదనకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (మార్కెట్లో పారదర్శకమైన పోటీ ఉండేలా చూసే సంస్థ) కొన్ని సవరణలకు లోబడి ఆమోదం తెలియజేసింది. పెట్టుబడుల ఉపసంహరణ తదితర చర్యల్ని బేయర్ తీసుకోవాల్సి ఉంటుందని సీసీఐ వర్గాలు తెలిపాయి. మోన్శాంటోను కొనుగోలు చేయనున్నట్టు 2016 సెప్టెంబర్‌లోనే బేయర్ ప్రకటించింది. చాలా దేశాల్లో మోన్శాంటో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కనుక భారత్ సహా 30 దేశాల్లో ఈ డీల్‌కు పలు నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉంటుంది. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా జన్యుమార్పిడి పంటల సాగు విషయంలో తీవ్ర వ్యతిరేకతను మోన్శాంటో ఎదుర్కొంటుండగా, ఈ డీల్‌కు సీసీఐ ఆమోదం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోన్శాంటోను అంతర్జాతీయంగా సొంతం చేసుకునే క్రమంలో సీసీఐ ఆమోదం ఓ మైలురాయిగా బేయర్ పేర్కొంది. రెండు భిన్నమైన కంపెనీల కలయిక వల్ల పరస్పర ప్రయోజనం ఉంటుందని అభిప్రాయం తెలిపింది. విత్తనాల రంగంలో మోన్శాంటో అంతర్జాతీయ అగ్రగామి కంపెనీగా ఉండగా, పెస్టిసైడ్స్ విభాగంలో బేయర్ దిగ్గజ కంపెనీ. ఈ రెండు కంపెనీలు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేయర్ ఇండియా వార్షిక టర్నోవర్ 2017లో రూ.4,700 కోట్లుగా ఉంది. ఈ రెండింటి విలీనం కారణంగా దేశీయంగా ఈ రంగంలో పోటీకి విఘాతం కలుగుతుందా అన్న దానిపై సీసీఐ ఈ ఏడాది జనవరిలోనే ప్రజాభిప్రాయాల్ని స్వీకరించింది. అంతిమంగా ఆమోదం తెలియజేసింది. -
మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్
ముంబై: జర్మన్ ఫార్మా అండ్ కెమికల్ దిగ్గజం బేయర్ గ్రూప్ మోన్ శాంటోకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.1,100 పైగా కోట్లతో మోన్ శాంటో లోని 26శాతం అదనపు వాటాను కొనుగోలు చేసే మాండేటరీ ఓపెన్ ఆఫర్ ప్రకటనతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. బీటీ విత్తన దిగ్గజం మోన్శాంటో వాటాదారులకు బేయర్ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ ప్రకటించడంతో మోన్ శాంటో ఇండియా షేర్లు ఇంట్రాడేలో 6 శాతం పైగా ర్యాలీ అయ్యాయి. ఈ ఓపెన్ ఆఫర్ కింద, బేయర్ రూ 2,481.60 ధరకు వాటాదారుల నుండి దాదాపు 44.88 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది గత మంగళవారం నాటి మోన్ శాంటో ధరకు దాదాపు 4 శాతం అదనం. భారత నిబంధనల ప్రకారం, ఒక సంస్థ మరో లిస్టెడ్ కంపెనీలోని 15 శాతం వాటావరకు పొందినట్లయితే అది ఓపెన్ ఆఫర్ గా పరిగణించబడుతుంది. కాగా బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ , అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్శాంటో విలీనానికి 66 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. -
ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు
జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో డీల్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. విత్తనాలు, క్రిమిసంహారకాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్న బహుళజాతి దిగ్గజం మోన్సాంటో విలీనానికి అంగీకరించినట్టు బేయర్ తెలిపింది. 66 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.42 లక్షల కోట్లు) ఈ ఒప్పందం జరిగినట్టు తెలిపింది. దీంతో ప్రపంచ ఫర్టిలైజర్స్ పరిశ్రమలో అతిపెద్ద డీల్ కుదిరినట్టయింది. మాన్ శాంటో షేర్ హోల్డర్స్, యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ ఆమోదంతో ఈ విలీన ప్రక్రియ పూర్తికానుంది. అన్ని నగదు పరిశీలనలో తమ వాటాదారుల అత్యధిక నిర్బంధిత విలువ ప్రాతినిధ్యం ఆధారంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టు మోన్ శాంటో కంపెనీ ఛైర్మన్ , సీఈవో హ్యూ గ్రాంట్ ప్రకటించారు. ప్రస్తుత మాన్ శాంటో ఉత్తర అమెరికన్ వ్యాపార ప్రధాన కార్యాలయం సెయింట్ లూయిస్, మిస్సోరి నుంచే తమ వ్యవసాయ ఆధార విత్తనాలు వ్యాపారాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. గతకొంతకాలంగా అమెరికా కేంద్రంగా ఉన్న మోన్సాంటోను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న బేయర్ సంస్థ ఒక్కో మాన్ శాంటో ఈక్విటీ షేరుకు 128 డాలర్లను అందించనుంది. గతంలో 122 డాలర్లను ఆఫర్ చేసిన సంస్థ చివరికి128 డాలర్లకు అంగీకారం తెలపడం విశేషం. ఇది మే 9 నాటి మాన్ శాంటో షేరుకు 44 శాతం ప్రీమియమని బేయర్ వర్గాలు వెల్లడించాయి. మాండేటరీ కన్వర్టిబుల్ బాండ్, అండ్ రైట్స్ ఇష్యూ తో సహా రుణ ఈక్విటీ కింద 19 బిలియన్ డాలర్ల నగదును జారీ చేయనున్నట్టు తెలిపింది. -
బేయర్ కు మోన్ శాంటో ఝలక్
జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్ కు అమెరికా సీడ్స్ కంపెనీ మోన్ శాంటో ఝలక్ ఇచ్చింది. బేయర్ ప్రకటించిన 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను తిరస్కరించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో ప్రకటించింది. అయితే ఈ విలీనంపై మరిన్ని చర్చలు జరుపుతామని మోన్ శాంటో తెలిపింది. గతకొంతకాలంగా జరిపిన చర్చల అనంతరం బేయర్ ఈ ఆఫర్ ను మోన్ శాంటోకు ప్రకటించింది. ఈ ఆఫర్ కంపెనీ విలువలకు చాలా తక్కువగా ఉందని మోన్ శాంటో చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హంగ్ గ్రాంట్ మంగళవారం తెలిపారు. ఈ ఫైనాన్స్ డీల్ పై కానీ, రెగ్యులేటరీ సవాళ్లను ఎదుర్కోవటంపై కానీ సరియైన హామీని బేయర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. బేయర్ ప్రతిపాదన అసంపూర్తిగా, ఆర్థికంగా తగినవిధంగా లేదని మోన్ శాంటో బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన తెలిపారు. కానీ ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగించడానికి మోన్ శాంటో షేర్ ఓనర్స్ ఆసక్తి చూపినట్టు కంపెనీ ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సీడ్స్, వ్యవసాయ పురుగుమందులు, జెనరిక్ గా పంటలను ఎప్పడికప్పుడూ మార్చగల సామర్థ్యం గల కంపెనీగా ఆవిర్భవించడానికి మోన్ శాంటోకు బేయర్ ఈ అతిపెద్ద టేకోవర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను మోన్ శాంటో తిరస్కరించడంతో, బేయర్ ఈ బిడ్ విలువను మరింత పెంచుతుందా అనేది మార్కెట్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే బేయర్ ఈ ఆఫర్ తో మోన్ శాంటో షేర్లు బలపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం అంతర్జాతీయ ట్రేడింగ్ లో మోన్ శాంటో షేర్లు 1.7శాతం పెరిగి, 107.77 డాలర్లుగా నమోదయ్యాయి. కానీ ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి బేయర్ షేర్లు పతనమవుతూ వస్తున్నాయి. మోన్ శాంటో ఆ ఆఫర్ ను తిరస్కరించినట్టు మార్కెట్లోకి వార్త పొక్కడంతోనే బేయర్లు షేర్లు పునఃస్థానానికి వస్తున్నాయి. -
బేయర్ చేతికి మోన్ శాంటో...!
ఫ్ర్యాంక్ఫర్ట్ : జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో కొనుగోలుకు సిద్ధమైంది. ఒక్క షేరుకు 122 డాలర్ల నగదు చొప్పున లేదా మొత్తం 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను మోన్ శాంటోకు బేయర్ ప్రకటించింది. ఈ డీల్ తో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ బేయర్ రూపొందనుంది. ఈ ఆఫర్ మే 9న మోనోశాంటో షేర్ల ముగింపు ధరకు 37 శాతం ప్రీమియమని బేయర్ తెలిపింది. బేయర్ నుంచి ఈ టేకోవర్ ఆఫర్ ను తాము ఊహించలేదని గతవారం మోన్ శాంటో ప్రకటించింది. ఈ టేకోవర్ ఆఫర్ పై గతకొంతకాలంగా బేయర్ కు, మోనోశాంటోకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. పన్నులు, వడ్డీలు, తరుగుదలన్నీ తీసివేయగా ఉన్న మోన్ శాంటో 12 నెలల రాబడులకు 15.8 సార్లు ఎక్కువగా బేయర్ ఈ ఆఫర్ ప్రకటించింది. డెట్, ఈక్విటీ రెండింటిలోనూ ఈ ఫైనాన్సియల్ డీల్ ను కుదుర్చుకోనున్నామని బేయర్ తెలిపింది.