దాడులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
టొరంటో: కెనడాలో హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడిని నిరసిస్తూ వేలాది మంది సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. నార్త్ అమెరికా హిందువుల కూటమి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన ర్యాలీలో ఇరు దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించారు. జై శ్రీరామ్, ఖలిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కెనడాలోని హిందువులు ఏళ్లుగా నిరంతర వివక్షకు గురవుతున్నారని వాపోయారు.
కెనడా ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ‘‘హిందూ కెనడియన్లు కెనడాకు ఎంతో విధేయులు. వారిపై ఈ దాడులు సరికాదని రాజకీయ నాయకులంతా గ్రహించాలి. భారత్, కెనడా సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నాం’’ అని వెల్ల డించారు. ర్యాలీ సందర్భంగా హిందువులపై పోలీ సులు వివక్ష చూపారని ఆరోపించారు. దాన్ని కూడా నిరసిస్తూ శాంతియుతంగా ప్రదర్శన జరిపా మన్నారు. హిందూఫోబియాకు కెనడా అడ్డుకట్ట వేయాలని హిందూ న్యాయవాద బృందం కోరింది.
పోలీసుల ఓవరాక్షన్
నిరసనల సందర్భంగా కెనడా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అవి చట్ట విరుద్ధమని ప్రకటించారు. వాటిలో పాల్గొన్న వారి దగ్గర ఆయుధాలు కనిపించాయని ఆరోపించారు. తక్షణం వెళ్లిపోకుంటే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. దీన్ని హిందూ సమాజం తీవ్రంగా నిరసించింది. పోలీసులపై కేసు పెట్టే యోచనలో ఉంది. ఖలిస్తానీ వ్యతిరేక నినాదాలు చేసినందుకు ముగ్గురిని అరెస్టు చేశారని ఆలయ అధికార ప్రతినిధి పురుషోత్తం గోయల్ తెలిపారు. వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆలయ ప్రవేశ ద్వారాన్ని దిగ్బంధించేందుకు, బలప్రయోగానికి పోలీసులకు అధికారం లేదని గోయల్ అన్నారు. వారిని విడుదల చేసేదాకా పోలీసు ప్రధాన కార్యాలయం బయట ఆలయ యాజమాన్యం నిరసనకు దిగింది.
ఉగ్రవాదులకు కెనడా అండ: జై శంకర్
కాన్‌బెర్రా: కెనడాలోని బ్రాంప్టన్ హిందూ ఆలయంలో ఆదివారం ఖలిస్తానీలు దౌర్జన్యానికి పాల్పడటంపై విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులకు రాజకీయంగా అండగా ఉన్న విషయం ఈ ఘటనను బట్టి తెలుసుకోవచ్చని, ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎలాంటి ఆధా రాలు చూపకుండా ఆరోపణలు చేయడమనే వైఖరిని కెనడా అనుసరిస్తోంది.
మా దౌత్యాధికారులపై నిఘా పెట్టింది. ఇది చాలా ఆక్షేపణీయం. ఆందోళనకరం’అని జై శంకర్ అన్నారు. బ్రాంప్టన్ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే చాలు.. ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదులకు రాజకీయంగా ఎలాంటి అవకాశమిచ్చిందీ అవగతమవుతుందన్నారు. భారత కాన్సులేట్, ఆలయ నిర్వాహకులు కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఖిలిస్తాన్ వాదులు అడ్డుకోవడం, హిందువులపై దాడికి పాల్పడటం తెలిసిందే. ఆ ఘటనను విదేశాంగ శాఖతో పాటు మోదీ కూడా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment