tropical storms
-
ఫిలిప్పీన్స్‌లో వరదలు.. 23 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్ ఈశాన్య ప్రాంతాన్ని ట్రామి తుపాను అతలాకుతలం చేస్తోంది. బికోల్ ప్రాంతంతోపాటు క్వెజాన్ ప్రావిన్స్‌లో నీట మునిగిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగా నగరంలోనే ఏడుగురు చనిపోయారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే నమోదైందని అధికారులు తెలిపారు. ఆల్బే ప్రావిన్స్‌లో మయోన్ అగ్ని పర్వతం నుంచి వెల్లువెత్తుతున్న బురద ప్రవాహం అనేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది. ఇళ్లపైకి చేరిన వారిని, వరదలో చిక్కుకున్న వారిని యంత్రాంగం మోటారు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ట్రామి తుపానుతో 75,400 మంది నిరాశ్రయులయ్యారని మొత్తం 20 లక్షల మందిపై ప్రభావం చూపిందని ప్రభుత్వం తెలిపింది. బుధ, గురు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. చాలా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సాయం అందించడం కూడా కష్టంగా మారిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం పేర్కొంది. -
బంగ్లాదేశ్ ను వణికిస్తున్న వరదలు...
ఢాకా: బంగ్లాదేశ్ లో తలెత్తిన వరదల వల్ల దాదాపు 33 మందికి పైగా మృతిచెందారని అధికారులు తెలిపారు. గురువారం సంభవించిన ఈ వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. దీంతో బంగ్లా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రారంభించారు. వాయవ్య బంగ్లాదేశ్ లో ఈ వరదల ప్రభావం ఎక్కువగా కనిపించింది. పబ్నా, రాజ్ సాహి, సిర్జ్ గంజ్, బ్రాహ్మణ్ బారియా జిల్లాల్లో కనీసం 19 మంది చనిపోయి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. రాజధాని ఢాకాలో వర్షంలో ఫుట్ బాల్ ఆడుతున్న ముగ్గురు విద్యార్థులపై పిడుగు పడగా ఆస్పత్రికి తరలించామని స్టేషన్ ఆఫీసర్ కాసీర్ అహ్మద్ చెప్పారు. చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వరదల వల్ల సంభవించిన నష్టం కంటే పిడుగు పాటు వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని అహ్మద్ వివరించారు. ప్రతి ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాలకు ముందుగా బంగ్లాదేశ్ లో వరదలు సంభవిస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే.