నో క్యాష్!
‘‘చేతి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసుకుందామని ఏటీఎంకు వెళితే చాంతాడంత క్యూ ఉంది. సరే అని వరుసలో నిలబడితే నా దగ్గరికి వచ్చే సరికి ఏటీఎం ఖాళీ. ఇక బ్యాంకుకై నా వెళదామని వెళితే అక్కడ ‘నో క్యాష్’ అన్న సమాధానం..’’ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి మంగళవారం ఎదురైన అనుభవం ఇది,,
సాక్షి, కామారెడ్డి : బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. ఏటీఎంలలో డబ్బుల్లేవు.. ఏం చేయాలో తోచక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో గడచిన పన్నెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు నిత్యం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను ఖాతాల్లో జమ చేయడంతో పాటు, మార్పిడి కోసం మంగళవారం కూడా బారులు తీరారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళితే అక్కడ డబ్బులు ఉండడం లేదు. బ్యాంకుల్లోనూ డబ్బులు లేవని తెలిసి మరింత ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో బ్యాంకుకు వచ్చిన వారు ఉత్తి చేతులతో ఉసురోమంటూ ఇంటిముఖం పట్టారు. బ్యాంకుల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఏటీఎంల సంగతి వేరే చెప్పనక్కర్లేదు..
డబ్బులు నింపకముందే బారులు..
ఏటీఎంలలో డబ్బులు నింపుతున్నారని తెలిస్తే చాలు అక్కడికి వందల సంఖ్యలో జనం తరలివచ్చి బారులు తీరుతున్నారు. స్టేట్ బ్యాంకుకు చెందిన పలు ఏటీఎంల వద్ద నిత్యం రద్దీ కనిపిస్తోంది. ఉదయం ఉంచి రాత్రి దాకా ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసుకోవడానికి జనం వస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు లేవని తెలిస్తే వెనక్కు వెళ్లడం, డబ్బులు వస్తాయని తెలిస్తే లైనులో నిలుచోవడం జరుగుతోంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.