TRS candidates list
-
‘కూటమి’ తేలాకే మనం
సాక్షి, హైదరాబాద్: మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఈ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలుండగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్‌పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మరో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పెండింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ తూర్పు, ఖైరతాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, అంబర్‌పేట, చొప్పదండి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు పోటీగా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో సామాజిక లెక్కల పరంగానూ మహాకూటమి కంటే మెరుగ్గా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకే కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో మహాకూటమి బాగా జాప్యం చేస్తే అప్పుడు మరో వ్యూహం అమలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వరంగల్ తూర్పు, చొప్పదండి, మల్కాజ్గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్నగర్, కోదాడ, చార్మినార్ అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ► ఖెరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి టికెట్‌పై ధీమాతో ఉన్నారు. ► గోషామహల్ టికెట్‌ను ప్రేంసింగ్ రాథోడ్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నందకిశోర్ బిలాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ► ముషీరాబాద్ అభ్యర్థిగా ముఠా గోపాల్‌కు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తనకుగానీ, తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికిగానీ ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఇవ్వాలని టికెట్ ఇవ్వాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. ► అంబర్‌పేట అభ్యర్థిగా కాలేరు వెంకటేశ్ పేరును ఖరారు చేసింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చా ర్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కృష్ణయాదవ్, గడ్డం సాయికిరణ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ► మేడ్చల్ స్థానాన్ని మల్కాజ్గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి మరోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ► మల్కాజ్గిరి అభ్యర్థిత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు ఇవ్వాలని నిర్ణయించింది. ► చొప్పదండిలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ను అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ప్రచారం చేసుకోవాలని ఆదేశించింది. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సైతం ప్రచారం చేస్తున్నారు. ► వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ పేరును ఖరారు చేసింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ► హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పోటీగా శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలపాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ► కోదాడలో వేనేపల్లి చందర్రావుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి టికెట్‌పై ఆశతో ఉన్నారు. ► వికారాబాద్ టికెట్ టి.విజయ్‌కుమార్‌కు దాదాపుగా ఖరారైంది. మరో నేత ఎస్.ఆనంద్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఆ పార్టీ నేతలు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో అవకాశం దక్కని నేతను టీఆర్ఎస్ తరుఫున బరిలో దింపాలని కూడా టీఆర్ఎస్ భావిస్తోంది. ► చార్మినార్‌లో దీపాంకర్‌పాల్‌కు టికెట్ దాదాపుగా ఖరారు చేసింది. ఇలియాస్ ఖురేషీ పేరును పరిశీలిస్తోంది. ఎంఐఎం కంచుకోట అయిన ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ నామమాత్రంగానే ఉండనుంది. -
కాంగ్రెస్‌లో సమరోత్సాహం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఏకపక్షంగా సాగిన జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు తరువాత చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ సీట్లపై కన్నేసి చదరంగం ఆడుతోంది. పొత్తుల లెక్కలు తేలకపోయినా... టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సబ్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఎవరికి వారే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఖానాపూర్‌లో టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ రాథోడ్‌రమేష్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులపై గాలం వేసి ఫలితాలు రాబడుతోంది. పాల్వాయితో మొదలు.. సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి పురుషోత్తంరావు కుమారుడు పాల్వాయి హరీష్‌రావును పార్టీలో చేర్పించడంలో మహేశ్వర్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. ఆయన రాకతో సిర్పూరులో కాంగ్రెస్ బలమైన శక్తిగా మారింది. తాజాగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అమురాదుల శ్రీదేవిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె సోమవారం బెల్లంపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ తీరును విమర్శించారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గతంలో కాంగ్రెస్‌లో రాజకీయంగా ఎదిగి తెలంగాణ ఉద్యమం సమయంలో, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో చేరిన నాయకులను సమీకరిస్తున్నారు. చెన్నూరులో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు విరోధిగా ఉన్న జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా టీఆర్ఎస్ను వీడే అవకాశం ఉంది. కొందరు టీఆర్ఎస్ అసంతృప్తి నాయకులు ఆదివారం గోదావరిఖనిలో రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి మరికొందరు నాయకులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు బీఎస్పీ, ఆప్ పార్టీల వైపు దృష్టి సారించినట్లు తెలిసింది. మూడు స్థానాలు మినహా... జాబితా సిద్ధం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య నాయకులు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వర్గీయులుగా ఉన్న ముఖ్య నేతలకు టికెట్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే కొందరికి అగ్రనేతలు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నుంచి పోటీ ఖరారైంది. ఆయన ఇప్పటికే నిర్మల్‌లో ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యునిగా, కీలకమైన సింగరేణి, ఆర్టీసీ, కార్మిక, ఉపాధి, గనులు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి చైర్మన్‌గా ప్రేంసాగర్‌రావు నియమితులయ్యారు. పార్టీలో లభిస్తున్న ప్రాధాన్యతకు తోడు ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కకు సన్నిహితుడైన ఆయనకు మంచిర్యాల సీటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రేంసాగర్‌రావు కూడా నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణీతో ఊరూరా తిరుగుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సైతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా టికెట్టు కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. చెన్నూరులో గ్రూపు–1 మాజీ అధికారి బొర్లకుంట వెంకటేష్ నేతకు పీసీసీ నుంచే కాంగ్రెస్ టికెట్టు ఖరారు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఖానాపూర్‌లో రమేష్‌రాథోడ్, సిర్పూరులో పాల్వాయి హరీష్‌రావు, బోథ్‌లో సోయం బాబూరావు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు పోటీ చేయడం ఖాయమే. సమీకరణాల్లో ఏవైనా మార్పులు జరిగితే తప్ప వీరి సీట్లకు ఢోకాలేదని పార్టీ వర్గాల సమాచారం. ఆదిలాబాద్, ముథోల్, బెల్లంపల్లిలలోనే అభ్యర్థులపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. అభ్యర్థులు ఖరారైనా... ఫ్లాష్ సర్వే, స్క్రీనింగ్ కమిటీల ద్వారా అందిన నివేదిక ప్రకారమే ఏఐసీసీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తుంది. కూటమిలో సీట్లపై వీడని పీటముడి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఏర్పాటు చేస్తున్న కూటమిలో తెలుగుదేశం, సీపీఐ, టీజేఎఫ్ పార్టీలు చేరడం ఇప్పటికే ఖరారైంది.ఈ మూడు పార్టీల నుంచి ఉమ్మడి జిల్లా శాఖలు ఏయే సీట్లలో తాము పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నయో జాబితాలను ఆయా రాష్ట్ర శాఖలకు పంపించాయి. ఆ పార్టీల రాష్ట్ర శాఖలు తమకు కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉన్న స్థానాలను ఏరి, తదనుగుణంగా ఒక్కో జాబితాను కాంగ్రెస్‌కు పంపించాయి. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సీటు తప్ప వదులుకునేది లేదని జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు చెబుతున్నారు. సీపీఐ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు సీట్లు కోరింది. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవెన శంకర్ కోసం పట్టు పడుతోంది. టీజేఎఫ్ తరఫున పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తారని భావించినప్పటికీ, ఆయన జనగామ, వరంగల్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోదండరాం పోటీ చేయని పక్షంలో టీజేఎస్ తరఫున గురిజాల రవీందర్రావు టికెట్టు ఆశిస్తున్నారు. ఇక బెల్లంపల్లి నుంచి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్‌బాబు, సిర్పూరు నుంచి పార్టీ రాష్ట్ర నేత బుచ్చిలింగం సీట్లు కోరుతున్నారు. ఎవరికి ఏ సీటు లెక్క తేలుతుందో చూడాలి. -
‘కొత్త’ ఆశలు
సాక్షి, ఆదిలాబాద్: కొత్త ముఖాలు ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం కనబరుస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటికే వీరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో పలువురు వైద్యులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం. కొంత మంది గృహిణులు కూడా రాజకీయాల్లో రాణించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో కొందరు పేరున్న రాజకీయ కుటుంబం నుంచే మళ్లీ తెరపైకి వస్తుండడం గమనార్హం. వారికి అదృష్టం ఎలా కలిసి వస్తుందో ఈ ఎన్నికల్లో తేలనుంది. ముందు నుంచే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలనే ఉద్దేశ్యంతో పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా అధికార పార్టీలో ప్రస్తుతం సిట్టింగ్ నేతలపై వ్యతిరేకత కారణంగా టికెట్ వచ్చే పరిస్థితి ఉంటే టీఆర్ఎస్లోకి వెళ్లాలని ఆది నుంచి భావిస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో పాటు ముందస్తు టికెట్లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. దీంతో ఇతర ప్రధాన పార్టీల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సంసిద్ధులవుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే కొంత మంది ప్రధాన పార్టీలో చేరి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజకీయ కుటుంబం నుంచి.. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో రాజకీయాలను శాసించిన నేతల వారసులు ప్రస్తుతం ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేస్తుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రధానంగా నిర్మల్ నుంచి దివంగత డిప్యూటీ స్పీకర్ అయిండ్ల భీంరెడ్డి కుమార్తె, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణారెడ్డి శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నిర్మల్ ని యోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండాలని ముందునుంచే వ్యూహరచనతో ఆమె ‘గడపగడపకూ స్వర్ణమ్మ’ పేరిట ఆ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆమె ఏ పా ర్టీ నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో మొదటి నుంచి ఉత్కంఠగా ఉండగా, తాజాగా ఆమె బీజేపీలో చేరారు. అయితే ఇప్పటికే ఆ పార్టీ నుంచి మరో డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పాటు ఇతర సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె టికెట్ భరోసాతోనే పార్టీలో చేరారా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ‘పాల్వాయి’ తనయుడు.. సిర్పూర్ నియోజకవర్గంలో డాక్టర్ పాల్వాయి హరీశ్‌రావు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు కుమారుడైన పాల్వాయి హరీశ్‌రావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. గతంలో పురుషోత్తంరావు స్వతంత్య్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన పురుషోత్తంరావు రాజకీయ వారసత్వంగా ఆయన సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినప్పటికీ కిందటి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కుమారుడు హరీశ్‌రావుకు టికెట్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఈ కుటుంబానికి మరోసారి చుక్కెదురైంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హరీశ్‌రావు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది వరకే పార్టీలో ఉన్న రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్ కూడా ఆది నుంచి పార్టీలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుకు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో తేలనుంది. మరికొంత మంది వైద్యులు.. నిర్మల్ నుంచి బీజేపీలో చేరిన స్వర్ణారెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పాల్వాయి హరీష్‌రావు వృత్తి రీత్యా వైద్యులు. ప్రస్తుతం ఎన్నికల్లో తమ నాడిని పరీక్షించుకోనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో పలువురు వైద్యులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ రవికిరణ్ యాదవ్ ప్రధాన పార్టీ నుంచి బరిలో నిలవాలని ఆశిస్తున్నారు. సినీ నిర్మాతగా కూడా ఉన్న ఆయన ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేయాలని ముందు నుంచి ప్రణాళికబద్ధంగా వస్తున్నారు. ప్రధానంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఏ పార్టీ నుంచి ఆయన రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరం. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీల్లో ఇప్పటికే సీనియర్ నాయకులు ఉండడంతో మరి ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయనేది వేచి చూడాల్సిందే. ముథోల్ నియోజకవర్గంలో తెలంగాణ జన సమితి నుంచి డాక్టర్ ముష్కం రామకృష్ణాగౌడ్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా ముథోల్ స్థానం ఎవరికి దక్కుతుందో అనే దానిపై ఆయన పోటీ చేసేది తేలనుంది. ఉద్యోగాలకు రాజీనామా.. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో దిగాలని కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ముందుకు వస్తున్నారు. ప్రధాన పార్టీల్లో తమకు ఉన్న పరిచయాల ద్వారా టికెట్ విషయంలో భరోసా తీసుకొని ముందుకు కదులుతుండడం ఆసక్తి కలిగిస్తుంది. దండేపల్లి మండలానికి చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బొర్లకుంట వెంకటేశ్ నేత చెన్నూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎక్సైజ్ డీసీగా పని చేసిన ఆయన ఇప్పటికే ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నేత కొప్పుల రాజు ఆశీస్సులతో టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన బోడ జనార్ధన్ స్థానికంగా టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందోననేది ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ పరిశ్రమల శాఖ జీఎం రాంకిషన్‌నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ల ద్వారా టిక్కెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖానాపూర్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చారులత టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆమె భర్త నీటి పారుదల శాఖలో ఇంజినీర్‌గా పని చేస్తున్నా రు. గతంలో కేసీఆర్ సేవాదళంలో పని చేసిన ఆమె కొద్ది నెలల కిందట కాంగ్రెస్‌లో చేరారు. ఖానాపూర్ నుంచి పలువురు నేతలు టిక్కెట్ ఆశతో కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా టీఆర్ఎస్ అసంతృప్తి నేత రాథోడ్ రమేశ్ కాంగ్రెస్ వైపు వస్తున్నారనే ప్రచారం జరుగుతుండడం వీరిలో ఆందోళన కలిగిస్తోంది. బెల్లంపల్లి లో హైకోర్టు న్యాయవాది ఉదయ్‌కాంత్ కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బోథ్‌లో డీసీఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్న కుమ్ర కోటేశ్వర్, ఆదిలాబాద్‌లో మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సా జిద్ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పలువురు కొత్త ముఖాలు రాజకీయ భవిష్యత్ కోసం పరితపిస్తున్నారు. -
కారు చిచ్చు
సాక్షి, మెదక్: నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై రోజురోజుకు సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది. మదన్‌రెడ్డికి టికెట్‌ను కేటాయించటంపై పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్న వారిలో జెడ్పీచైర్‌పర్సన్ భర్త, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మురళీయాదవ్ ముందు వరసలో ఉన్నారు. మదన్‌రెడ్డి సొంత పార్టీలో అన్నివర్గాల నాయకులకు సమాన గుర్తింపు ఇవ్వలేదని కొందరు వ్యతిరేకిస్తుండగా, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని పట్టించుకోలేదన్న అసంతృప్తి మరికొందరిలో ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తమను పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వాపోతున్నారు. మదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేసి లబ్ధిపొందిన ఓ ప్రజాప్రతినిధి సైతం ప్రస్తుతం మదన్‌రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మురళీయాదవ్, మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సహకరిస్తానని చెప్పనప్పటికీ నియోజకవర్గంలో మాత్రం మదన్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మురళీయాదవ్ ఇప్పటికీ ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు వదులుకోలేదని తెలుస్తోంది. మదన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని ఏకతాటి మీదికి తీసుకువచ్చి వారి ద్వారా పార్టీ అధినేతను కలిసి నియోజకవర్గంలో మదన్‌రెడ్డికి వ్యతిరేకత ఉందని అభ్యర్థిని మార్చాలని కోరేందుకు సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వరస సమావేశాలు.. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు మండలాల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించటం మదన్‌రెడ్డి వర్గీయులను కలవరానికి గురిచేస్తోంది. రాబోయే రెండు రోజుల్లో కౌడిపల్లి, వెల్దుర్తి మండలాల నేతలు సైతం సమావేశాలు జరపనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి ఇటీవల తన అనుచరులతో సమావేశమై మదన్‌రెడ్డికి మద్దతు ఇవ్వొద్దని సూచించినట్లు తెలుస్తోంది. హత్నూర మండల జెడ్పీటీసీ సభ్యురాలు పల్లె జయశ్రీ సైతం మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి టీఆర్ఎస్ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. అందులో బాగంగా ముదిరాజ్ సంఘం ఏర్పాటు చేస్తున్న పలు సమావేశాలకు ఆమె హాజరవుతున్నారు. జయశ్రీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ తన సొంత మండలంలోని తమ పార్టీ నాయకులందరి మద్దతు కూడగట్టడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్చారం మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకురాలు సోమన్నగారి లక్ష్మి కూడా మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం మద్దతుతో పోటీకి సిద్ధమవుతున్నారు. శివ్వంపేట మండలంలోనూ అసంతృప్తి నేతల సంఖ్య పెరుగుతోంది. మండలంలోని గోమారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ లావణ్య ఆమె భర్త నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాదవరెడ్డిలు మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు సైతం మదన్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుకూలించే అంశం.. అయితే శివ్వంపేట మండలానికి చెందిన మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ ఇటీవల టీఆర్ఎస్లో చేరటం మదన్‌రెడ్డికి అనుకూలించే అంశం. కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాల్లో నాయకులు బాగానే ఉన్నప్పటికీ అనేక గ్రామాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు నిరాశతో ఉన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో తమకు మదన్‌రెడ్డితో మాట్లాడేందుకు సరైన సమయం దొరకేదికాదని, భజన చేసే నాయకులే ఎపుడు ఆయన వెన్నంటి ఉండడంతో తాము తమ సమస్యలు ఆయనతో నేరుగా చెప్పుకోలేని పరిస్థితి ఉండేదని కింది స్థాయి నాయకులు నిరాశతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అసంతృప్తి నేతలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ద్వారా మురళీయాదవ్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు వత్తిడి తీసుకువస్తున్నారు. మురళీయాదవ్ భార్య రాజమణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి, ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కేసీఆర్ ఇచ్చారని, ఒకే కుటుంబంలో ఇద్దరికీ పదవులు కట్టబెట్టిన పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకిస్తే మురళీయాదవ్‌కే నష్టమన్న రీతిలో మదన్‌రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వైపు చూపు.. టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు తమ సొంత పార్టీలో టికెట్ రానిపక్షంలో బీజేపీ నుంచి టికెట్‌ను పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. హత్నూర జెడ్పీటీసీ సభ్యురాలు పల్లె జయశ్రీ, కొల్చారం మండలానికి చెందిన బీసీ నినాదంతో ముందకు వెళ్తున్న లక్ష్మీలు బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన మురళీయాదవ్‌ను తమ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన ఓ యాదవ నేత మురళీయాదవ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మురళీయాదవ్ సహా పల్లె జయశ్రీ, లక్ష్మి పార్టీ వీడితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉంది. -
పొత్తుల చుట్టూ.. విపక్షాల అభ్యర్థిత్వాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ఊరూరా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థును ఖరారు చేయక మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఇన్నాళ్లూ వ్యవహరించిన కాంగ్రెస్‌తో ఆయా పార్టీలు ఎన్నికల పొత్తులకు వెళ్లనుండడంతో అభ్యర్థుల ఖరారు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను టీఆర్ఎస్ పది స్థానాల్లో టికెట్లు ఖరారు చేసింది. కోదాడ, హుజూర్‌నగర్‌లలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలన్నీ తాము పోటీ చేసే స్థానాలు, అక్కడ ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో ఇంకా ఎటూ నిర్ణయించుకోలేదని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాయని ఆ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఎదురు చూస్తున్న సీపీఐ, టీడీపీ, టీజేఎస్, ఇంటి పార్టీలు తాము పోటీ చేయాలనుకుంటన్న స్థానాలపై ఒక అవగాహనతో ఉన్నాయని, కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు అయితే, ఆ స్థానాలు తెలుస్తాయని, ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో.. ఎవరు ఎక్కడ ? గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకుని దేవరకొండ, మునుగోడుల్లో పోటీ చేసింది. దేవరకొండలో గెలిచిన ఆ పార్టీ, మునుగోడులో మాత్రం ఓడిపోయింది. దేవరకొండలో సీపీఐ తరఫున గెలిచిన రవీంద్ర కుమార్ ఆ తర్వాత టీఆర్ఎస్లోకి మారారు. ఎస్టీ రిజర్వుడు స్థానమైన దేవరకొండలో సీపీఐకి నాయకత్వం కొరత ఉందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన ఆ పార్టీ జిల్లాలో కేవలం మునుగోడు మాత్రమే అడిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇక్కడినుంచి కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత ఎన్నికల్లో పార్టీ రెబల్‌గా పోటీచేసి పాల్వాయి స్రవంతి, శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. వీరిద్దరే కాకుండా పున్న కైలాస్, నారబోయిన రవి యువత కోటాలో తమకు టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ, ఇక్కడ సీపీఐతో వ్యవహారం తేలితే కాని అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఉంది. కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్, నల్లగొండలో సిట్టింగులు ఉన్నందున ఇక్కడ సమస్య కాకపోవచ్చని, మిర్యాలగూడలో కొత్తగా అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన భాస్కర్ రావు టీఆర్ఎస్లోకి మారడంతో ఈసారి ఇక్కడ మరొకరిని ఎంచుకోవాల్సి ఉందంటున్నారు. ఆలేరులో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ ఒక్కరే రేసులో ఉన్నారు. భువనగిరి అభ్యర్థిత్వం విషయంలోనూ స్పష్టత లేదు. తుంగతుర్తిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ ఈ సారి టికెట్ ఆశిస్తున్నా, ఆయనను స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోందని, దామోదర్‌రెడ్డి మొగ్గు ఎవరి వైపు ఉంటుందో వారికి టికెట్ దక్కొచ్చన్న సాధారణ అభిప్రాయం ఉంది. సూరాపేటలో గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి ఈసారీ రేసులో ఉన్నారు. టికెట్ హామీపైనే టీడీపీ సూర్యాపేట అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్ రమేష్‌రెడ్డి టికెట్ హామీపైనే రేవంత్‌రెడ్డితో కలిసి పార్టీ మారారు. ఆయనా టికెట్ కోరుతున్నారు. దీంతో ఇక్కడ పీఠముడి పడినట్లే. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆశిస్తూ .. ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే, ఇక్కడ మరో ముగ్గురు టికెట్ రేసులో ఉన్నారు. పొత్తంటూ కుదిరితే ఈ స్థానం తమకు కావాల్సిందేనని టీడీపీ గట్టిగా కోరుతోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కోరే స్థానం కూడా ఇదేనని అంటున్నారు. కోదాడలో సిట్టింగ్ ఉన్నా, టీడీపీ ఈ స్థానాన్నీ కోరుతోంది. పొత్తుల విషయంలో ఏదో ఒకటి తేలితే కానీ ఈ స్థానాల్లో అభ్యర్థులు తేలేలా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒంటరిగా .. బరిలోకి ! వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, బీఎల్ఎఫ్ కూటమితో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనున్నాయి. ఈ పార్టీలూ ఇప్పటి దాకా పోటీ చేసే స్థానాల విషయంలో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. బీజేపీ పన్నెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, ఆ మేరకు కార్యాచరణ సిద్ధం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తులతో కాకుండా, సీపీఎం ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తెలంగాణ జనసమితి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా జిల్లాలో మిర్యాలగూడ స్థానాన్ని కోరనుందని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సైతం హుజూర్నగర్, సూర్యాపేట, నకిరేకల్, మిర్యాలగూడ తదితర స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. టికెట్ల ప్రకటనతో ఆయా నియోజకవర్గాల్లో తలెత్తిన అసమ్మతిని బుజ్జగించి దారికి తెచ్చుకునే పనిలో టీఆర్ఎస్ నాయకత్వం నిమగ్నమైంది. మరోవైపు ఆ పార్టీ అభ్యర్థులు అసమ్మతి వర్గాల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారైతే కానీ, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకోదని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆ ఐదింటిలో ఎవరు..?
-
టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి హైదరాబాద్ రషీద్ షరీఫ్ మెదక్ కె. చంద్రశేఖరరావు జహీరాబాద్ బి.బి. పాటిల్ పెద్దపల్లి బాల్క సుమన్ నిజామాబాద్ కవిత ఆదిలాబాద్ గోదం నగేష్ మహబూబాబాద్ ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఖమ్మం బదాన్ బేగ్ షేక్ (మల్కాజ్గిరి స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది) అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఉప్పల్ బి. సుభాష్‌రెడ్డి చార్మినార్ ఇనాయత్ ఆలీ బఖారి మలక్‌పేట సతీష్‌కుమార్ యాదవ్ చాంద్రాయణగుట్ట ఎం. సేత రాంరెడ్డి ఖైరతాబాద్ మన్నె గోవర్ధన్‌రెడ్డి అంబర్‌పేట ఎడ్ల సుధాకర్‌రెడ్డి కార్వాన్ ఠాకూర్ జీవన్ సింగ్ ఖమ్మం జి. కృష్ణ పినపాక శంకర్ నాయక్ మధిర బొమ్మెర రాంమూర్తి వైరా చంద్రావతి కుత్బుల్లాపూర్ కొల న్ హనుమంతరెడ్డి సనత్‌నగర్ దండే విఠల్ మంచిర్యాల దివాకర్‌రావు నిజామాబాద్ అర్బన్ గణేష్ గుప్త నారాయణఖేడ్ ఎం. భూపాల్‌రెడ్డి కూకట్పల్లి గొట్టుముక్కల పద్మారావు మహేశ్వరం కొత్త మనోహర్‌రెడ్డి యాకుత్‌పుర ఎండీ శబీర్ అహ్మద్ ఎల్బీ నగర్ ఎన్. రామ్మోహన్‌గౌడ్ కొడంగల్ గురునాథ్‌రెడ్డి గోషామహల్ ప్రేమ్‌కుమార్ దూత్ అశ్వారావు పేట జె. ఆదినారాయణ భువనగిరి పైలా శేఖర్‌రెడ్డి నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య పరకాల ఎం. సహోదర్‌రెడ్డి జహీరాబాద్ కె. మాణిక్‌రావు చొప్పదండి బుడిగె శోభ నర్సాపూర్ సి.హెచ్. మదన్‌రెడ్డి మహబూబాబాద్ బి. శంకర్‌నాయక్ ముషీరాబాద్ ముఠా గోపాల్ కంటోన్మెంట్ గజ్జెల నగేష్ నాంపల్లి కె. హనుమంతరావు గంగపుత్ర బహుదూర్‌పల్లి ఎండీ జియాఉద్దీన్ నారాయణపేట కుంబం శివకుమార్‌రెడ్డి భద్రాచలం ఝాన్సీ రాణి అనంద్‌రావు (ఇంకా ప్రకటించాల్సినవి: ఇబ్రహీంపట్నం, దుబ్బాక, మునుగోడు, తుంగతుర్తి, శేర్లింగపల్లి, జూబ్లీహిల్స్, ఇల్లందు, రాజేంద్రనగర్, పాలేరు, నల్లగొండ)