సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఏకపక్షంగా సాగిన జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ టికెట్ల కేటాయింపు తరువాత చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ సీట్లపై కన్నేసి చదరంగం ఆడుతోంది. పొత్తుల లెక్కలు తేలకపోయినా... టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సబ్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఎవరికి వారే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ టికెట్టు ఆశించి భంగపడ్డ రాథోడ్‌రమేష్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులపై గాలం వేసి ఫలితాలు రాబడుతోంది.
పాల్వాయితో మొదలు..
సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి పురుషోత్తంరావు కుమారుడు పాల్వాయి హరీష్‌రావును పార్టీలో చేర్పించడంలో మహేశ్వర్‌రెడ్డి సఫలీకృతులయ్యారు. ఆయన రాకతో సిర్పూరులో కాంగ్రెస్ బలమైన శక్తిగా మారింది. తాజాగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అమురాదుల శ్రీదేవిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె సోమవారం బెల్లంపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్ తీరును విమర్శించారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గతంలో కాంగ్రెస్‌లో రాజకీయంగా ఎదిగి తెలంగాణ ఉద్యమం సమయంలో, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్‌లో చేరిన నాయకులను సమీకరిస్తున్నారు.
చెన్నూరులో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు విరోధిగా ఉన్న జెడ్‌పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనతోపాటు పలువురు జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌ను వీడే అవకాశం ఉంది. కొందరు టీఆర్‌ఎస్ అసంతృప్తి నాయకులు ఆదివారం గోదావరిఖనిలో రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ నుంచి మరికొందరు నాయకులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు బీఎస్‌పీ, ఆప్ పార్టీల వైపు దృష్టి సారించినట్లు తెలిసింది.
మూడు స్థానాలు మినహా... జాబితా సిద్ధం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య నాయకులు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వర్గీయులుగా ఉన్న ముఖ్య నేతలకు టికెట్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే కొందరికి అగ్రనేతలు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నుంచి పోటీ ఖరారైంది. ఆయన ఇప్పటికే నిర్మల్‌లో ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యునిగా, కీలకమైన సింగరేణి, ఆర్టీసీ, కార్మిక, ఉపాధి, గనులు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి చైర్మన్‌గా ప్రేంసాగర్‌రావు నియమితులయ్యారు. పార్టీలో లభిస్తున్న ప్రాధాన్యతకు తోడు ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కకు సన్నిహితుడైన ఆయనకు మంచిర్యాల సీటు ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు ప్రేంసాగర్‌రావు కూడా నియోజకవర్గంలో ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణీతో ఊరూరా తిరుగుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సైతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా టికెట్టు కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. చెన్నూరులో గ్రూపు–1 మాజీ అధికారి బొర్లకుంట వెంకటేష్ నేతకు పీసీసీ నుంచే కాంగ్రెస్ టికెట్టు ఖరారు సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఖానాపూర్‌లో రమేష్‌రాథోడ్, సిర్పూరులో పాల్వాయి హరీష్‌రావు, బోథ్‌లో సోయం బాబూరావు, ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు పోటీ చేయడం ఖాయమే. సమీకరణాల్లో ఏవైనా మార్పులు జరిగితే తప్ప వీరి సీట్లకు ఢోకాలేదని పార్టీ వర్గాల సమాచారం. ఆదిలాబాద్, ముథోల్, బెల్లంపల్లిలలోనే అభ్యర్థులపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. అభ్యర్థులు ఖరారైనా... ఫ్లాష్ సర్వే, స్క్రీనింగ్ కమిటీల ద్వారా అందిన నివేదిక ప్రకారమే ఏఐసీసీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తుంది.
కూటమిలో సీట్లపై వీడని పీటముడి
కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఏర్పాటు చేస్తున్న కూటమిలో తెలుగుదేశం, సీపీఐ, టీజేఎఫ్ పార్టీలు చేరడం ఇప్పటికే ఖరారైంది.ఈ మూడు పార్టీల నుంచి ఉమ్మడి జిల్లా శాఖలు ఏయే సీట్లలో తాము పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నయో జాబితాలను ఆయా రాష్ట్ర శాఖలకు పంపించాయి. ఆ పార్టీల రాష్ట్ర శాఖలు తమకు కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉన్న స్థానాలను ఏరి, తదనుగుణంగా ఒక్కో జాబితాను కాంగ్రెస్‌కు పంపించాయి. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక సీటు తప్ప వదులుకునేది లేదని జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు చెబుతున్నారు.
సీపీఐ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి రెండు సీట్లు కోరింది. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవెన శంకర్ కోసం పట్టు పడుతోంది. టీజేఎఫ్ తరఫున పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తారని భావించినప్పటికీ, ఆయన జనగామ, వరంగల్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోదండరాం పోటీ చేయని పక్షంలో టీజేఎస్ తరఫున గురిజాల రవీందర్‌రావు టికెట్టు ఆశిస్తున్నారు. ఇక బెల్లంపల్లి నుంచి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్‌బాబు, సిర్పూరు నుంచి పార్టీ రాష్ట్ర నేత బుచ్చిలింగం సీట్లు కోరుతున్నారు. ఎవరికి ఏ సీటు లెక్క తేలుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment