ఇచ్చోడ(బోథ్): అన్ని రంగాల్లో వెనుకబడ్డ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తానని ప్రజాకూటమి, కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపూరావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: నియోజకవర్గన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు
సోయం : నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తాను. మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత అంశాలను బేరీజు వేసుకుని సమస్య త్రీవతను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాను.
సాక్షి: మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు
సోయం : ముందుగా విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. జలయజ్ఞంలో నిర్మించిన చెరువులకు 13 సంవత్సరాల నుంచి కాల్వల నిర్మాణం కాలేదు. మొదటి ప్రాధాన్యతగా గుర్తించి కాల్వలు లేని చెరువులన్నింటికీ కాలువలు నిర్మించి రైతులకు సాగునీరు అందించే దిశగా కృషి చేస్తా. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తా. నియోజకవర్గంలో ఇప్పటివరకు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. 30 పడకల ఆస్పత్రి నిర్మించి 24 గంటలపాటు వైద్యసేవలతోపాటు అత్యవసర సేవలు అందించేలా చూస్తాను.
సాక్షి : నియోజకవర్గంలో ప్రధానంగా పరిష్కరించే సమస్యలు ఏంటి?
సోయం : నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం లేదు. పలు గ్రామల కు వెళ్లే దారుల్లో వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో అక్కడి గ్రామల ప్రజలు బాహ్య ప్రంపచానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి గ్రామాలను గుర్తించి వెంటనే రోడ్ల సౌకర్యంతోపాటు వంతెనల నిర్మాణనికి ప్రత్యేక కృషి చేస్తా. బోథ్ మండల కేంద్రంలో అగ్నిమాపక ఏర్పాటు చేస్తా. దన్నూర్ మీదుగా అడెల్లి వరకు రోడ్డు పనులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటా. గుడిహత్నూర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి బస్టాండ్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తా. బోథ్ మండలంలో మర్లపెల్లి నుంచి మహారాష్ట్రలోని శివిని వరకు బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటా.
సాక్షి: గిరిజన, గిరిజనేతర సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు
సోయం: నియోజకవర్గంలో గిరిజన, గిరిజనేతర సమస్యలు చాలా ఉన్నాయి. గిరిజనులు చేస్తున్న పోడు భూములకు పట్టాలు లేవు. గిరిజనులు సాగు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పట్టాలు ఇప్పిస్తాను. ఏజెన్సీ ప్రాంతలలో గిరిజనేతర సమస్యలు కూడా ఉన్నాయి. గిరిజనేతరులకు ఆదివాసీలు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. చట్టాలకు అనుగుణంగా గిరిజనేతర సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రత్యేక కృషి చేస్తా. గిరిజనులైన, గిరిజనేతరులైన ప్రతీ ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి అందరి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తా. ఎవరికీ హక్కులకు భంగం కలుగకుండా అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తా.
Comments
Please login to add a commentAdd a comment