‘కూటమి’ తేలాకే మనం | TRS MLA Tickets Distribution Issue, KCR To Finalises 12 Major Seats | Sakshi
Sakshi News home page

‘కూటమి’ తేలాకే మనం

Published Thu, Nov 1 2018 4:37 AM | Last Updated on Thu, Nov 1 2018 3:23 PM

TRS MLA Tickets Distribution Issue, KCR To Finalises 12 Major Seats  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఈ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలుండగా, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సెప్టెంబర్‌ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్‌ 21న మలక్‌పేట, జహీరాబాద్‌ స్థానాల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మరో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటించే విషయంలో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పెండింగ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం పోటీ తీవ్రంగా ఉంది.

వరంగల్‌ తూర్పు, ఖైరతాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, అంబర్‌పేట, చొప్పదండి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు పోటీగా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో సామాజిక లెక్కల పరంగానూ మహాకూటమి కంటే మెరుగ్గా ఉండాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. అందుకే కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో మహాకూటమి బాగా జాప్యం చేస్తే అప్పుడు మరో వ్యూహం అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. వరంగల్‌ తూర్పు, చొప్పదండి, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్‌నగర్, కోదాడ, చార్మినార్‌ అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.


► ఖెరతాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి టికెట్‌పై ధీమాతో ఉన్నారు.  

► గోషామహల్‌ టికెట్‌ను ప్రేంసింగ్‌ రాథోడ్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నందకిశోర్‌ బిలాల్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

► ముషీరాబాద్‌ అభ్యర్థిగా ముఠా గోపాల్‌కు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే తనకుగానీ, తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికిగానీ ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఇవ్వాలని టికెట్‌ ఇవ్వాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు.

► అంబర్‌పేట అభ్యర్థిగా కాలేరు వెంకటేశ్‌ పేరును ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చా ర్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కృష్ణయాదవ్, గడ్డం సాయికిరణ్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

► మేడ్చల్‌ స్థానాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ సీహెచ్‌ మల్లారెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి మరోసారి టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.  

► మల్కాజ్‌గిరి అభ్యర్థిత్వాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు ఇవ్వాలని నిర్ణయించింది.  

► చొప్పదండిలో టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ను అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ప్రచారం చేసుకోవాలని ఆదేశించింది. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సైతం ప్రచారం చేస్తున్నారు.

► వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ పేరును ఖరారు చేసింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

► హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పోటీగా శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలపాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి శంకరమ్మ తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

►  కోదాడలో వేనేపల్లి చందర్‌రావుకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి టికెట్‌పై ఆశతో ఉన్నారు.

► వికారాబాద్‌ టికెట్‌ టి.విజయ్‌కుమార్‌కు దాదాపుగా ఖరారైంది. మరో నేత ఎస్‌.ఆనంద్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఆ పార్టీ నేతలు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో అవకాశం దక్కని నేతను టీఆర్‌ఎస్‌ తరుఫున బరిలో దింపాలని కూడా టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

► చార్మినార్‌లో దీపాంకర్‌పాల్‌కు టికెట్‌ దాదాపుగా ఖరారు చేసింది. ఇలియాస్‌ ఖురేషీ పేరును పరిశీలిస్తోంది. ఎంఐఎం కంచుకోట అయిన ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోటీ నామమాత్రంగానే ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement