సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధగా ఉంది : కోదండరాం | Sakshi Exclusive Interview With Kodandaram | Sakshi
Sakshi News home page

కూటమి ఎజెండానే ప్రాతిపదిక

Published Mon, Nov 19 2018 1:36 AM | Last Updated on Mon, Nov 19 2018 8:45 AM

Sakshi Exclusive Interview With Kodandaram

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాసంక్షేమం, సమస్యల పరిష్కారం, ఉద్యమ ఆకాంక్షల సాధనే ప్రజాకూటమిలోని పార్టీల లక్ష్యమని ప్రజాకూటమి కన్వీనర్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకు ప్రత్యేక ఉమ్మడి ఎజెండాను సిద్ధం చేసి దాని అమలుకు ముందుకొచ్చిన పక్షాలతోనే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. పార్టీల సొంత విధానాలకు, ప్రజాకూటమి ఎజెండాకు సంబంధం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు అంశం టీడీపీ వ్యవహారమన్నారు. ఉద్యమ ఆకాంక్షల అమలు ఎజెండాకు టీటీడీపీ నేతలు అంగీకరించారని, అందుకే వారితో పొత్తు పెట్టుకున్నట్లు కోదండరాం చెప్పారు. అయినా తాము చంద్రబాబుతో మాట్లాడటం లేదని, టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నామన్నారు.

పొత్తుల్లో భాగంగా తాము నష్టపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తుకు అంగీకరించామన్నారు. సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధ ఉండటం సహజమని, సీట్లు రాని వారికి అసంతృప్తి ఉంటుందన్నారు. అయితే సీట్లు లభించిన అభ్యర్థులే అసంతృప్తులను సమన్వయం చేసుకోవాలన్నారు. అదే ప్రధానమని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టుకోగలుగుతామని, ఆ దిశగా అభ్యర్థులు, జిల్లా స్థాయి నేతలు కృషి చేయాలన్నారు. తద్వారా కూటమిని అధికారంలోకి తెస్తామని, ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని కోదండరాం స్పష్టం చేశారు. ప్రజాకూటమి కన్వీనర్‌గా ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. 

సాక్షి: 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారుగా.. 
కోదండరాం: అవును నిజమే. 12 స్థానాల్లో పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించాం. వాస్తవానికి రకరకాల సమయాల్లో ఏదో ఒక మేరకు వారు అంగీకరించిన స్థానాలనే మేం ప్రకటించాం. వాటిల్లో కొన్ని పోటీ చేయవచ్చు. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అంటున్నారు. ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ అనేది నష్టం చేస్తుంది. వీలైనంత వరకు అది లేకుండా చూడాలన్నదే తాపత్రయం. ఒకట్రెండు చోట్ల మాకు బాగా పని చేసినవారు ఉన్నారు. వారి పాత్ర వల్ల లేదా వారి సామాజిక నేపథ్యం రీత్యా కొందరికి ఒకట్రెండు చోట్ల సీట్లు ఇవ్వాల్సి రావచ్చు. అది ఎలా పరిష్కరించుకుంటామన్నది విత్‌డ్రా సమయంలో చూస్తం. 

పొత్తుల విషయంలో మీకు రాజీ తప్పడంలేదా? 
చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నాం. రాజకీయాల్లో ఒక అవకాశం కోసం గత ఆరు నెలలుగా మా కార్యకర్తలు చేసిన పని గొప్పది. కానీ వారందరికీ భాగస్వామ్యం కల్పించలేకపోతున్నాం. కొందరైతే మనకు రానప్పుడు పోటీ ఎందుకు అని దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సర్ది చెబుతున్నాం. అయితే ఆయా నియోజకవర్గాల్లో మిత్రపక్షం నుంచి సీట్లు లభించిన అభ్యర్థులు చాలా చోట్ల సీట్లు రాని వారిని కలుపుకొని పోవడానికి సిద్ధంగా లేరు. అది చాలా సమస్యగా ఉంది. 

మీ పార్టీలో టికెట్లు ఆశించిన వారిని ఎలా సంతృప్తి పరుస్తారు? 
పరిస్థితి అంతా చూస్తున్నారు. కాబట్టి ఎవరూ తొందరపడట్లేదు. అయితే ఫ్రంట్‌ తరఫున సీట్లు లభించిన అభ్యర్థులు ఇతర ఆశావహులను తొందరగా కలుపుకొని వెళ్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఆ బాధ్యత వారిపై ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాం. 

ఎజెండాలో ఉన్న ప్రధాన అంశాలేంటి? 
కేసీఆర్‌ నిరంకుశ పాలనను అంతమొందించడం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమనే ప్రధానాంశాలు ఎజెండాలో ఉన్నాయి. వాటిని సాధించడం మరో లక్ష్యం. ప్రజాస్వామిక అభివృద్ధిని తెలంగాణలో సాధించుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం చేశాం. దానికి ప్రత్యేక తెలంగాణ అవసరమని తెలంగాణ సమాజం అంతా అనుకుంది. అందుకే తెలంగాణ సాధించుకున్నాం. కానీ అది ఇప్పుడు లేదు. అందుకే వాటి సాధనకు కృషి చేస్తున్నాం. వృత్తుల పరిరక్షణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, అన్ని వర్గాల భాగస్వామ్యం పెంచడం వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి. 

ఉద్యమ ఆకాంక్షల గురించి ప్రజలకు ఏం చెబుతారు? 
ఈ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, తాగు, సాగునీరు లేకుండా పోయింది. అలాంటి వాటినే మేం చేస్తామని చెబుతాం. 

కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందా? 
అవును.. కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల విషయంలో సంపూర్ణంగా విఫలమైంది. ప్రభుత్వం లక్ష ఉద్యోగాలకు అనుమతిచ్చామని చెప్పి న్యాయ వివాదాలతో నిలిచిపోయాయని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ రద్దు ఆగిందని చెప్పడం కరెక్టు కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని రిక్రూట్‌మెంట్స్‌ చూపించాలి. వారే చెప్పారు కదా లక్ష ఖాళీలున్నాయని. జిల్లాలు, శాఖలు, విభాగాలు ఎక్కువయ్యాయి. ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంది. అయినా భర్తీ చేయట్లేదు మళ్లీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో నడపాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే వారు చెప్పిన దానికి విలువలేదు. 

టీఆర్‌ఎస్‌ను గద్దె దించే లక్ష్యంతోనే మీరు పొత్తు పెట్టుకున్నారా? 
ఏ పొత్తు అయినా ఏదో ఒక దాన్ని వ్యతిరేకించే ఆలోచనతో పుడితే నిలబడదు. అది చేయదలచుకున్న కార్యాచరణే ప్రధానం. ఆ కార్యాచరణ అమలు లక్ష్యంగా ముందుకు సాగితేనే పొత్తు నిలుస్తుంది. మేము చేస్తున్నదీ అదే. 

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనుకుంటున్నారా? 
అందుకోసమే రాష్ట్ర స్థాయిలో నేతలంతా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు, పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగాలి. పొత్తు ధర్మం ప్రకారం వారంతా పని చేయాలి. అదే చాలా ముఖ్యం. మేము అదే చెబుతున్నాం. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. 

ఇంత తక్కువ సమయంలో అన్ని పక్షాలను కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? 
ఇప్పుడు అన్ని స్థానాల్లో ప్రచారం చేయలేం. మాకు ఎక్కడ వెసులుబాటు ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. ఇంకా సమయం ఉంటే మిగతా స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తాం. గట్టిగా తిరిగితే మళ్లించగలిగే ఓట్లను సాధించవచ్చు. కొన్ని చోట్ల అది సులభమవుతుంది. మరికొన్ని చోట్ల కష్టం అవుతుంది. అయినా సమన్వయంతో సాధిస్తాం. కూటమిని అధికారంలోకి తెస్తాం.

కూటమి సీట్ల విషయంలో మీకు అవమానం జరిగిందా? 
సీట్ల పంపిణీ విషయంలో కొంత బాధ కలుగుతోంది. ఉద్యమ శక్తులను కలుపుకోవాల్సిన సమయంలో వారికి ప్రాతినిధ్యం లభించనప్పుడు సహజంగానే బాధ కలుగుతది. మాకు గుర్తింపు ఇవ్వలేదని టీజేఎస్‌ కార్యకర్తలు, నాయకులు బాధ పడుతున్నారు. అయితే మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు కొంత నష్టం జరిగినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తును గట్టిగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం.

తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబుతో మీరు పొత్తు పెట్టుకోవడం ఎందుకు? 
పొత్తు అనేది చంద్రబాబు పార్టీ విధానాలతో కాదు. కేవలం ఎజెండా ప్రాతిపదికనే. వారు ఆ ఎజెండాను అంగీకరిస్తున్నారు కాబట్టే కలసి పనిచేస్తున్నాం. అయినా మేము చంద్రబాబుతో మాట్లాడటం లేదు. ఎజెండాను అంగీకరించిన టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నాం. చంద్రబాబు అంశం వారి పార్టీ వ్యవహారం. కూటమికి ఉద్యమ ఆకాంక్షల అమలే ప్రధానం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement