kondanda ram
-
‘నోరు విప్పితేనే టీఆర్ఎస్ ఓనర్లు అవుతారు’
సాక్షి, హైదరాబాద్ : సీపీఐకి చిత్తశుద్ధి ఉంటే హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించుకొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ నోరు విప్పాలని, వారు నోరు విప్పితేనే టీఆర్ఎస్ ఓనర్లు అవుతారని మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రానికి కేంద్రం కావాల్సిన యూరియాను సరఫరా చేసిందని, స్పీకర్ పోచారం, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సొంత జిల్లాల్లో యారియా కొరతను సృష్టించారని ఆరోపించారు. యూరియా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిపాలన స్తంభించిదని, ఈఎస్ఐ స్కాం, విస్తరిస్తున్న వ్యాధులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభాకర్ విమర్శించారు. -
ధర్నాచౌక్‌లో విద్యార్థుల స్మారకస్థూపం
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో అఖిలపక్షం నిరసన దీక్షలు చేపట్టింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మృతిగా స్మారకస్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ ఎల్.రమణ హాజరై నిరసన తెలిపారు. -
టీజేఎస్ మద్దతు కోరిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతివ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కోదండరామ్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు గంటకుపైగా తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరు చర్చించారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కోదండరామ్ పార్టీలో చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మల్కాజ్గిరి సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్.. జాతీయ పార్టీని లోక్‌సభ ఎన్నికల తర్వాత పెడతారా అని రేవంత్ ఎద్దేవా చేశారు. 16 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతా అని చెబుతున్నారని, గత ఐదేళ్లుగా ఆయన వద్ద ఉన్న ఎంపీలతో ఏం సాధించారని ప్రశ్నించారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ రెండు లేదా మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. మిగతాచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు. -
పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి..
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష పార్టీలు, 112 బీసీ కులసంఘాలు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. ఆదివారం ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ నాయకత్వంలో జరిగిన భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఉన్న పెండింగ్ ఇంటీరియం స్టే ఆర్డర్‌ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, దీనికోసం సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చించాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. బీసీలపై కేసీఆర్‌కు చిన్నచూపు: ఉత్తమ్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడం సీఎం కేసీఆర్‌కు బీసీల పట్ల ఉన్న చిన్నచూపును తెలియజేస్తోంది. బీసీల సంక్షేమం కోసం తామే అన్నీ చేసినట్లు కేసీఆర్ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైంది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు. బీసీల రాజకీయ ఎదుగుదలను అణగదొక్కడానికి అర్ధరాత్రి పంచాయతీరాజ్ రిజర్వేషన్ల చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం సరైంది కాదు. మంత్రి వర్గ నిర్మాణం జరగకముందే, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయకుండా కొత్త ప్రభుత్వం రాకుండా ఆర్డినెన్సు ఎలా జారీ చేస్తారు. ప్రపంచంలోనే అద్భుతంగా జరిగిందని చెప్పుకునే సమగ్ర సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని తేలినా కూడా జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక బీసీలకు రూ.25 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ఐదేళ్లలో 10 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. బీసీలకు అన్యాయం: కోదండరాం సంక్షేమంలేని అభివృద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వాలు రిజర్వేషన్లను రూపకల్పన చేయాలి. కానీ, రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేశారు. బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలి. గత 30 ఏళ్లుగా 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు లేని అవరోధాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి. ఎన్ని త్యాగాలు, పోరాటాలు చేసైనా ఈ రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉంది. దీనికోసం పటిష్టమైన కార్యాచరణను రూపొందించి గ్రామాలవారీగా తమ నిరసనలు తెలియజేస్తాం. ఈ సదస్సులో లేవనెత్తిన అన్ని అంశాలను కరపత్రంగా తయారు చేసి ఊరూరా పంచుతాం. బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకపోతే కేసీఆర్ బీసీల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు. బీసీలపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు: ఆర్.కృష్ణయ్య ప్రభుత్వం బీసీలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. జాతికి అన్యాయం జరిగితే తెగించి పోరాడుతాం. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 56 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం సుప్రీంకోర్టును సాకుగా చూపుతూ తగ్గించడం అన్యాయం. సుప్రీంతీర్పు కొత్తగా వచ్చింది కాదు. 2010లోనే ఆ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత 2013లో గ్రామ పంచాయతీ, 2014లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 34 శాతంతో జరపలేదా? ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై వేసిన అప్పీల్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పడం లేదు. రెండు కోట్ల బీసీల గొంతుకోస్తామంటే ఊరుకునేది లేదు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు అభిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రిమండలితో సమావేశం ఏర్పాటు చేసి ఆర్డినెన్సు జారీ చేయాలి. కానీ, అలా చేయడం లేదు. బీసీలందరూ మేలుకోకపోతే 34 శాతం రిజర్వేషన్లను సాధించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే జీవితకాలంలో రాజకీయంగా ఎదగలేరు. తెలంగాణలోని అన్ని బీసీవర్గాలు కలసికట్టుగా పోరాటం చేసి రిజర్వేషన్లు కాపాడుకోవాలి. -
‘నిరంకుశ పాలనకు గోరికట్టి.. కూటమికి పట్టంకట్టండి’
సాక్షి, వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని ముందే గవర్నర్‌కు చెప్పామని నిరంకుశ పాలనకు గోరికట్టి.. ప్రజాకూటమికి పట్టంకట్టండని తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హన్మకొండలోని టీజెఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించి పైవిధంగా అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. అర్ధరాత్రి తలుపు పగులగొట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాకూటమి అభ్యర్థులపై కావాలనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. అధికార పార్టీకి కొమ్ముకాయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అరెస్ట్చేయడం ఆర్టికల్ 21ను ఉల్లంఘించడేమనన్నారు. రాత్రి జరిగిన అరెస్ట్‌లు టీఆరెఎస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుందన్నారు. గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి విషయంలో కూడా ఇదే తతంగం చేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ వ్యవహారంపై తాము ముందే ఎన్నికల సంఘానికి తెలియజేశామన్నారు. రాష్ట్రంలో బయోత్పాతం ముందే ఊహించామని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపామన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందని తెలిపారు. ఎమెర్జెన్సీలో లేని ఉల్లంఘనలు ఇప్పుడు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధైర్యంగా తిరుగుబాటు చేయాలని, వరంగల్ పశ్చిమ, వర్దన్న పేట ప్రజాకూటమి అభ్యర్థులు రేవూరి ప్రకాష్ రెడ్డి, దేవయ్యలకు మద్ధతుగా ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఉమ్మడి మేనిఫెస్టో తయారుచేశామని తెలిపారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రజల అభివృద్ధి కనపడటం లేదని ఎద్దేవాచేశారు. కౌలు రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిందని.. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రజా కూటమి చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులను సమీక్షిస్తామన్నారు. రాజకీయ నాయకులు చెప్పేవి బోగస్ సర్వేలు అని రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. -
సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధగా ఉంది : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంక్షేమం, సమస్యల పరిష్కారం, ఉద్యమ ఆకాంక్షల సాధనే ప్రజాకూటమిలోని పార్టీల లక్ష్యమని ప్రజాకూటమి కన్వీనర్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఉద్యమ ఆకాంక్షల సాధనకు ప్రత్యేక ఉమ్మడి ఎజెండాను సిద్ధం చేసి దాని అమలుకు ముందుకొచ్చిన పక్షాలతోనే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. పార్టీల సొంత విధానాలకు, ప్రజాకూటమి ఎజెండాకు సంబంధం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు అంశం టీడీపీ వ్యవహారమన్నారు. ఉద్యమ ఆకాంక్షల అమలు ఎజెండాకు టీటీడీపీ నేతలు అంగీకరించారని, అందుకే వారితో పొత్తు పెట్టుకున్నట్లు కోదండరాం చెప్పారు. అయినా తాము చంద్రబాబుతో మాట్లాడటం లేదని, టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నామన్నారు. పొత్తుల్లో భాగంగా తాము నష్టపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తుకు అంగీకరించామన్నారు. సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధ ఉండటం సహజమని, సీట్లు రాని వారికి అసంతృప్తి ఉంటుందన్నారు. అయితే సీట్లు లభించిన అభ్యర్థులే అసంతృప్తులను సమన్వయం చేసుకోవాలన్నారు. అదే ప్రధానమని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టుకోగలుగుతామని, ఆ దిశగా అభ్యర్థులు, జిల్లా స్థాయి నేతలు కృషి చేయాలన్నారు. తద్వారా కూటమిని అధికారంలోకి తెస్తామని, ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని కోదండరాం స్పష్టం చేశారు. ప్రజాకూటమి కన్వీనర్‌గా ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. సాక్షి: 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారుగా.. కోదండరాం: అవును నిజమే. 12 స్థానాల్లో పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించాం. వాస్తవానికి రకరకాల సమయాల్లో ఏదో ఒక మేరకు వారు అంగీకరించిన స్థానాలనే మేం ప్రకటించాం. వాటిల్లో కొన్ని పోటీ చేయవచ్చు. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటున్నారు. ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనేది నష్టం చేస్తుంది. వీలైనంత వరకు అది లేకుండా చూడాలన్నదే తాపత్రయం. ఒకట్రెండు చోట్ల మాకు బాగా పని చేసినవారు ఉన్నారు. వారి పాత్ర వల్ల లేదా వారి సామాజిక నేపథ్యం రీత్యా కొందరికి ఒకట్రెండు చోట్ల సీట్లు ఇవ్వాల్సి రావచ్చు. అది ఎలా పరిష్కరించుకుంటామన్నది విత్‌డ్రా సమయంలో చూస్తం. పొత్తుల విషయంలో మీకు రాజీ తప్పడంలేదా? చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నాం. రాజకీయాల్లో ఒక అవకాశం కోసం గత ఆరు నెలలుగా మా కార్యకర్తలు చేసిన పని గొప్పది. కానీ వారందరికీ భాగస్వామ్యం కల్పించలేకపోతున్నాం. కొందరైతే మనకు రానప్పుడు పోటీ ఎందుకు అని దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సర్ది చెబుతున్నాం. అయితే ఆయా నియోజకవర్గాల్లో మిత్రపక్షం నుంచి సీట్లు లభించిన అభ్యర్థులు చాలా చోట్ల సీట్లు రాని వారిని కలుపుకొని పోవడానికి సిద్ధంగా లేరు. అది చాలా సమస్యగా ఉంది. మీ పార్టీలో టికెట్లు ఆశించిన వారిని ఎలా సంతృప్తి పరుస్తారు? పరిస్థితి అంతా చూస్తున్నారు. కాబట్టి ఎవరూ తొందరపడట్లేదు. అయితే ఫ్రంట్ తరఫున సీట్లు లభించిన అభ్యర్థులు ఇతర ఆశావహులను తొందరగా కలుపుకొని వెళ్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఆ బాధ్యత వారిపై ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాం. ఎజెండాలో ఉన్న ప్రధాన అంశాలేంటి? కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించడం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమనే ప్రధానాంశాలు ఎజెండాలో ఉన్నాయి. వాటిని సాధించడం మరో లక్ష్యం. ప్రజాస్వామిక అభివృద్ధిని తెలంగాణలో సాధించుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం చేశాం. దానికి ప్రత్యేక తెలంగాణ అవసరమని తెలంగాణ సమాజం అంతా అనుకుంది. అందుకే తెలంగాణ సాధించుకున్నాం. కానీ అది ఇప్పుడు లేదు. అందుకే వాటి సాధనకు కృషి చేస్తున్నాం. వృత్తుల పరిరక్షణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, అన్ని వర్గాల భాగస్వామ్యం పెంచడం వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఉద్యమ ఆకాంక్షల గురించి ప్రజలకు ఏం చెబుతారు? ఈ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, తాగు, సాగునీరు లేకుండా పోయింది. అలాంటి వాటినే మేం చేస్తామని చెబుతాం. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందా? అవును.. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల విషయంలో సంపూర్ణంగా విఫలమైంది. ప్రభుత్వం లక్ష ఉద్యోగాలకు అనుమతిచ్చామని చెప్పి న్యాయ వివాదాలతో నిలిచిపోయాయని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ రద్దు ఆగిందని చెప్పడం కరెక్టు కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని రిక్రూట్మెంట్స్ చూపించాలి. వారే చెప్పారు కదా లక్ష ఖాళీలున్నాయని. జిల్లాలు, శాఖలు, విభాగాలు ఎక్కువయ్యాయి. ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంది. అయినా భర్తీ చేయట్లేదు మళ్లీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నడపాలన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే వారు చెప్పిన దానికి విలువలేదు. టీఆర్ఎస్ను గద్దె దించే లక్ష్యంతోనే మీరు పొత్తు పెట్టుకున్నారా? ఏ పొత్తు అయినా ఏదో ఒక దాన్ని వ్యతిరేకించే ఆలోచనతో పుడితే నిలబడదు. అది చేయదలచుకున్న కార్యాచరణే ప్రధానం. ఆ కార్యాచరణ అమలు లక్ష్యంగా ముందుకు సాగితేనే పొత్తు నిలుస్తుంది. మేము చేస్తున్నదీ అదే. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయనుకుంటున్నారా? అందుకోసమే రాష్ట్ర స్థాయిలో నేతలంతా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు, పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగాలి. పొత్తు ధర్మం ప్రకారం వారంతా పని చేయాలి. అదే చాలా ముఖ్యం. మేము అదే చెబుతున్నాం. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ఇంత తక్కువ సమయంలో అన్ని పక్షాలను కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు అన్ని స్థానాల్లో ప్రచారం చేయలేం. మాకు ఎక్కడ వెసులుబాటు ఉంటుందో ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. ఇంకా సమయం ఉంటే మిగతా స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తాం. గట్టిగా తిరిగితే మళ్లించగలిగే ఓట్లను సాధించవచ్చు. కొన్ని చోట్ల అది సులభమవుతుంది. మరికొన్ని చోట్ల కష్టం అవుతుంది. అయినా సమన్వయంతో సాధిస్తాం. కూటమిని అధికారంలోకి తెస్తాం. కూటమి సీట్ల విషయంలో మీకు అవమానం జరిగిందా? సీట్ల పంపిణీ విషయంలో కొంత బాధ కలుగుతోంది. ఉద్యమ శక్తులను కలుపుకోవాల్సిన సమయంలో వారికి ప్రాతినిధ్యం లభించనప్పుడు సహజంగానే బాధ కలుగుతది. మాకు గుర్తింపు ఇవ్వలేదని టీజేఎస్ కార్యకర్తలు, నాయకులు బాధ పడుతున్నారు. అయితే మేము దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు కొంత నష్టం జరిగినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తును గట్టిగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబుతో మీరు పొత్తు పెట్టుకోవడం ఎందుకు? పొత్తు అనేది చంద్రబాబు పార్టీ విధానాలతో కాదు. కేవలం ఎజెండా ప్రాతిపదికనే. వారు ఆ ఎజెండాను అంగీకరిస్తున్నారు కాబట్టే కలసి పనిచేస్తున్నాం. అయినా మేము చంద్రబాబుతో మాట్లాడటం లేదు. ఎజెండాను అంగీకరించిన టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నాం. చంద్రబాబు అంశం వారి పార్టీ వ్యవహారం. కూటమికి ఉద్యమ ఆకాంక్షల అమలే ప్రధానం. -
చొప్పదండి అల్లుడ్ని బాగా చూసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ అధినేత కోదండరాంను కరివేపాకులా వాడుకుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీట్ల పంపకంలో కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ చెయ్యిచ్చిందన్నారు. మహాకూటమికి ఓటేస్తే.. తెలంగాణ వనరులు పరాయి వాళ్ల పరమవుతాయని హెచ్చరించారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వి.తిరుమలరావు (ఎమ్మార్పీఎస్), తిరుపతిరెడ్డి (బీజేపీ) మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వివిధ పార్టీల నేతల చేరికలతో టీఆర్ఎస్ భవన్ కళకళలాడుతుంటే.. దీక్షలతో గాంధీభవన్, గాంధీ ఆస్పత్రిలా మారిందని ఎద్దేవా చేశారు. మహాకూటమికి ఓటేస్తే అది ఢిల్లీకి లేదా అమరావతికి చేరుతుందని చెప్పారు. సీట్లను సరిగా పంచుకోలేని వారు, రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎంలున్నారని, అధికారంలోకి వస్తే కుర్చీ కోసం కుమ్ములాటలేనని విమర్శించారు. చొప్పదండి అల్లుడ్ని బాగా చూసుకోవాలి.. టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ జన్మతో పాటు పునర్జన్మనిచ్చిందని కేటీఆర్ అన్నారు. చొప్పదండి అల్లుడైన కేసీఆర్‌ను బాగా చూసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో చొప్పదండి అభ్యర్థినిని మార్చామని.. ఓపిక లేకే ఆమె (బి.శోభ) మరో పార్టీలో చేరారని విమర్శించారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి రవిశంకర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసలు రేవూరిది.. ఏ ఊరు? రేవూరి ప్రకాశ్‌రెడ్డి వరంగల్ వెస్ట్‌లో పోటీ చేసే హక్కు ఉందా.. అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్ వెస్ట్‌కు చెందిన సీపీఐ, ఎమ్మార్పీఎస్ నేతలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అసలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఏ ఊరి ప్రకాశ్‌రెడ్డి.. ఆయన అమరావతి ప్రకాశ్‌రెడ్డే. తెలంగాణ రాకుండా అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతినిధి రేవూరి..’అని విమర్శిం చారు. వచ్చే నాలుగు సీట్ల కోసం కూటమి నాయకులంతా కుమ్ములాడుకుంటున్నారని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుకు మద్దతిచ్చే కూటమికి ఓటేస్తారో లేక తెలంగాణను పథకాలతో సస్యశ్యామలం చేస్తోన్న కేసీఆర్‌కు ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. 70 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి కేవలం కేసీఆర్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారన్నారు. అందుకే కేసీఆర్‌ను గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
ఆ ముగ్గురికి సీట్లెక్కడ?
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన మహాకూటమికి సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. దాదాపు అన్ని స్థానాల్లో మహాకూటమి తరఫున బరిలో దిగేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. ఎవరికి సీట్లు దక్కుతాయో? ఎవరికి దక్కవోనన్న మీమాంస కనబడుతోంది. అభ్యర్థులకే కాదు.. కూటమిలోని పార్టీల అధినేతలకూ దీనిపై స్పష్టత రాక జుట్టుపీక్కుంటున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి భాగస్వామ్య పక్షాలయిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంలకు.. ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి? అనుకున్న చోట సీటు వస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. వీరు స్థానాలు ఆశించిన చోట ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. అసలు వీరు పోటీలో ఉన్నారా.. లేదా.. అన్న సందిగ్ధత నెలకొంది. అయితే.. జగిత్యాల, లేదంటే! టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల. 2009లో ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో సాధారణంగా సిట్టింగ్‌కే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు జగిత్యాలలో కూటమి తరఫున జీవన్‌రెడ్డే సరైన అభ్యర్థి. దీంతో ఈ సీటును కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే అవకాశం లేదు. అటు రమణ కూడా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని అడగడం పొత్తు ధర్మం కాదనే ఆలోచనలో ఉన్నారు. కోరుట్లలో పోటీకి అవకాశం ఇచ్చినా వెళ్లబోనని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే జగిత్యాల లేదంటే పోటీకి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఆయన హైదరాబాద్‌లో టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఒకచోటినుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రమణను బరిలో దించాలని.. ఇందుకు హైదరాబాద్ సరన వేదికని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే.. దీనికి ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమణ అసెంబ్లీ బరిలో నిలుస్తారా? లేక ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా వెళ్తారా అన్నది చర్చనీయాంశమైంది. హుస్నాబాద్‌లో చాడకు సెగ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 2004లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇక్కడినుంచి కాంగ్రెస్ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇస్కో సంస్థకు డైరెక్టర్ కూడా అయిన ప్రవీణ్ రెడ్డి.. తనే హుస్నాబాద్ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై చాడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తు కుదిరిన తర్వాత కూటమి సీట్లపై ఇంకా స్పష్టత రాకముందే.. కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ప్రచారం చేసుకుంటారని మండిపడుతున్నారు. చాడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దగా స్పందించలేదు. అటు, ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వదులుకోవద్దని.. ప్రవీణ్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని స్థానిక నాయకత్వం నుంచి టీపీసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హుస్నాబాద్ బరిలో ఎవరుంటారనేది అర్థం కావడం లేదు. కాంగ్రెస్‌కే టికెట్ ఇస్తే.. చాడ పరిస్థితేంటనే దానిపైనా అయోమయం నెలకొంది. ప్రొఫెసర్ ఎక్కడినుంచి? టీజేఎస్ చీఫ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేననే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడినుంచి పోటీచేయాలనే అంశంపై మాత్రం కూటమిలో గానీ, టీజేఎస్‌లో కానీ స్పష్టత రాలేదు. మొదట ఆయన జనగామ బరిలో ఉంటారని.. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులే సీట్లు ఆశిస్తున్నారు. జనగామ నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉండగా.. వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోదండరాం భావించినప్పటికీ.. అక్కడినుంచి మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేం సాగర్ రావు సీటు ఆశిస్తున్నారు. దీంతో అసలు కోదండరాం బరిలో ఉంటారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యనేతలకూ పరేషాన్.. ఈ 3 పార్టీల అధ్యక్షులతో పాటు కీలకనేతల విషయంలోనూ సీట్ల కేటాయింపు పెద్ద సమస్యగానే మారింది. టీజేఎస్‌లో ముఖ్యనేత కపిలవాయి దిలీప్‌కుమార్ మల్కాజ్గిరి స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే.. అక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, గతంలో పోటీచేసిన నందికంటి శ్రీధర్, దిలీప్ సామాజిక వర్గానికే చెందిన బిల్డర్ల సంఘం నాయకుడు శ్రీరంగం సత్యం టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుకు వారివారి స్థానాల్లో కాంగ్రెస్ నుంచే తీవ్రపోటీ ఎదురవుతోంది. దీంతో కూటమి సీట్ల సర్దుబాటుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. -
3 సీట్ల కోసం పొర్లుదండాలా?
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ నేతల చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిం చిన అనంతరం బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం అంటూ పార్టీ స్థాపించిన కోదండరాం కాంగ్రెస్‌తో జత కట్టి ఆత్మవంచన చేసుకోవద్దని, ఒకసారి పునరాలోచించుకోవాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా కేసులేసి, అనుమతులు ఇవ్వొద్దని ఉత్తరాలు రాసిన కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకోవాలని ఏ అమరవీరుడు కోరాడంటూ ప్రశ్నించా రు. అధికార దాహంతోనే అమరులు కావడానికి కారణమైన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి కొడతారని ఆ పార్టీకి చెందిన ఏపీ మంత్రులు కేఈ కృష్టమూర్తి, చినరాజప్ప, అయ్యన్నపాత్రులు అంటుంటే.. ఏ కారణంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారో ఇక్కడి టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు మేం మంచోళ్లమా? కొండా దంపతుల వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. పార్టీ వీడి వెళ్లిపోవాలనుకునే వారు అలాగే మాట్లాడతారని చెప్పారు. పార్టీలో ఉన్నన్ని రోజులు తాము మంచివాళ్లుగా.. వెళ్లిపోయేటప్పుడే శత్రువుల్లా కనిపిస్తున్నామని వ్యాఖ్యానించారు. పోయేటప్పుడు రాళ్లేసి పోవడం సహజమేనని పేర్కొన్నారు. -
‘కార్పొరేట్’ విరాళాలు తీసుకోం
సాక్షి, హైదరాబాద్: పెద్ద, పెద్ద కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు తీసుకోమని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, టీజేఎస్ నేతలు అంబటి శ్రీని వాస్, చింత స్వామి, గోపాలశర్మ, భైరి రమేశ్ తదితరులతో కలసి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రజల సొమ్మును పెద్దఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించొ ద్దని నిర్ణయించినట్టు చెప్పారు. సామాన్యులు, స్థానిక కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమల యజమానుల నుంచి మాత్రమే చందాలు వసూ లు చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్త రాజకీయ ఒరవడికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ నెల 29న సరూర్‌నగర్‌లో జరిగే జన సమితి ఆవిర్భావ సభకు అన్ని అనుమతులు లభించాయని, దీని కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సభ నిర్వహణ కోసం 12 కమిటీలు కృషి చేస్తున్నాయన్నారు. సభా నిర్వహణ నిమిత్తం వాలంటీర్లకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. పార్టీపై ప్రత్యేక పాటలు రూపొందించినట్టు తెలిపారు. సభకు వచ్చే ప్రతిరైతు ఒక నాగలి కర్రుముక్క తీసుకురావాలని, దీనితో అమరుల స్మృతి చిహ్నాన్ని నిర్మిస్తామని అన్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అధికారంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదని.. అన్ని వర్గాలు పాలకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే అవకాశం లేకుండా చేయడం చట్ట వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. మీడియాపై అసహనం ప్రదర్శించడం మంచిదికాదన్నారు. సినీ పరిశ్రమపై ఆసక్తితో వచ్చిన మహిళను లోబరుచుకోవడం మంచిపరిణామాలు కాదని, వీటిని ఖండించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 29న మూడు గంటలకు సభ ప్రారంభం అవుతుందని, 3 నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 6.40కి ప్రభుత్వ నిర్బంధం, పాలకుల వైఫల్యాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామన్నారు. -
ఇది రైతు ప్రభుత్వం కాదు : కోదండరాం
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ సాధించుకున్నది ఏ ఒక్కరి కోసమో కాదని రైతులు గౌరవంతో బతికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మంగళవారం డిచ్‌పల్లిలో జరిగిన జేఏసీ రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 500 గ్రామాల రైతులు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం తలచుకుంటే రైతు కష్టాలు తొలగిపోతాయని కోదండరాం పేర్కొన్నారు. రైతు కష్టపడి తన పిల్లలకు చదువు చెప్పించినా.. వారికి ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సమస్యలు మొరపెట్టుకున్నా ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో కూడా మహారాష్ట్రలో మాదిరి రైతు ఉద్యమం రావాలని కోదండరాం ఆకాక్షించారు. ప్రధాని మోదీ కూడా రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలను లేవనెత్తేందుకు జేఏసీ త్వరలోనే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
‘కోదండరామ్ పార్టీ పెడతారనుకోను’
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఎవరు పోరాడినా తాము మద్ధతిస్తామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం నాయకుడు తమ్మినేని పాదయాత్రకు కాంగ్రెస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. నల్గొండలో తమ్మినేనితో కలిసి తానూ పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. యూపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా..విద్యార్థి, యువగర్జనలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు. ఐటీఐఆర్‌పై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఐటీఐఆర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు. -
టీజేఏసీ బంద్ ను విజయవంతం చేయండి: కేసీఆర్
తెలంగాణ పొలిటికల్ జేఏసీ (టీజేఏసీ) ప్రకటించిన బంద్ కు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ 7న జేఏసీ ప్రకటించిన బంద్ ను విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కేసీఆర్ తెలంగాణవాదులకు విజ్క్షప్తి చేశారు. తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే సెప్టెంబర్ 7 తేదిన బంద్ కు పిలుపునిచ్చామని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా బంద్ కాదని, విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామని కోదండ్ స్పష్టం చేశారు.