సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష పార్టీలు, 112 బీసీ కులసంఘాలు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. ఆదివారం ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ నాయకత్వంలో జరిగిన భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఉన్న పెండింగ్ ఇంటీరియం స్టే ఆర్డర్‌ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, దీనికోసం సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చించాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.
బీసీలపై కేసీఆర్‌కు చిన్నచూపు: ఉత్తమ్
పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడం సీఎం కేసీఆర్‌కు బీసీల పట్ల ఉన్న చిన్నచూపును తెలియజేస్తోంది. బీసీల సంక్షేమం కోసం తామే అన్నీ చేసినట్లు కేసీఆర్ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైంది కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు. బీసీల రాజకీయ ఎదుగుదలను అణగదొక్కడానికి అర్ధరాత్రి పంచాయతీరాజ్ రిజర్వేషన్ల చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం సరైంది కాదు. మంత్రి వర్గ నిర్మాణం జరగకముందే, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయకుండా కొత్త ప్రభుత్వం రాకుండా ఆర్డినెన్సు ఎలా జారీ చేస్తారు. ప్రపంచంలోనే అద్భుతంగా జరిగిందని చెప్పుకునే సమగ్ర సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని తేలినా కూడా జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక బీసీలకు రూ.25 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ఐదేళ్లలో 10 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు.
బీసీలకు అన్యాయం: కోదండరాం
సంక్షేమంలేని అభివృద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వాలు రిజర్వేషన్లను రూపకల్పన చేయాలి. కానీ, రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేశారు. బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలి. గత 30 ఏళ్లుగా 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు లేని అవరోధాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి. ఎన్ని త్యాగాలు, పోరాటాలు చేసైనా ఈ రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉంది. దీనికోసం పటిష్టమైన కార్యాచరణను రూపొందించి గ్రామాలవారీగా తమ నిరసనలు తెలియజేస్తాం. ఈ సదస్సులో లేవనెత్తిన అన్ని అంశాలను కరపత్రంగా తయారు చేసి ఊరూరా పంచుతాం. బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకపోతే కేసీఆర్ బీసీల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.
బీసీలపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు: ఆర్.కృష్ణయ్య
ప్రభుత్వం బీసీలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. జాతికి అన్యాయం జరిగితే తెగించి పోరాడుతాం. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 56 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం సుప్రీంకోర్టును సాకుగా చూపుతూ తగ్గించడం అన్యాయం. సుప్రీంతీర్పు కొత్తగా వచ్చింది కాదు. 2010లోనే ఆ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత 2013లో గ్రామ పంచాయతీ, 2014లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 34 శాతంతో జరపలేదా? ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై వేసిన అప్పీల్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పడం లేదు. రెండు కోట్ల బీసీల గొంతుకోస్తామంటే ఊరుకునేది లేదు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు అభిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రిమండలితో సమావేశం ఏర్పాటు చేసి ఆర్డినెన్సు జారీ చేయాలి. కానీ, అలా చేయడం లేదు. బీసీలందరూ మేలుకోకపోతే 34 శాతం రిజర్వేషన్లను సాధించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే జీవితకాలంలో రాజకీయంగా ఎదగలేరు. తెలంగాణలోని అన్ని బీసీవర్గాలు కలసికట్టుగా పోరాటం చేసి రిజర్వేషన్లు కాపాడుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment