సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతివ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కోదండరామ్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు గంటకుపైగా తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరు చర్చించారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కోదండరామ్ పార్టీలో చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్.. జాతీయ పార్టీని లోక్‌సభ ఎన్నికల తర్వాత పెడతారా అని రేవంత్ ఎద్దేవా చేశారు. 16 మంది ఎంపీలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతా అని చెబుతున్నారని, గత ఐదేళ్లుగా ఆయన వద్ద ఉన్న ఎంపీలతో ఏం సాధించారని ప్రశ్నించారు. కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ రెండు లేదా మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు. మిగతాచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment