సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన మహాకూటమికి సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారింది. దాదాపు అన్ని స్థానాల్లో మహాకూటమి తరఫున బరిలో దిగేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. ఎవరికి సీట్లు దక్కుతాయో? ఎవరికి దక్కవోనన్న మీమాంస కనబడుతోంది. అభ్యర్థులకే కాదు.. కూటమిలోని పార్టీల అధినేతలకూ దీనిపై స్పష్టత రాక జుట్టుపీక్కుంటున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి భాగస్వామ్య పక్షాలయిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంలకు.. ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి? అనుకున్న చోట సీటు వస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. వీరు స్థానాలు ఆశించిన చోట ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో.. అసలు వీరు పోటీలో ఉన్నారా.. లేదా.. అన్న సందిగ్ధత నెలకొంది.
అయితే.. జగిత్యాల, లేదంటే!
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల. 2009లో ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీట్ల కేటాయింపు విషయంలో సాధారణంగా సిట్టింగ్‌కే అవకాశాలు ఎక్కువ. దీనికితోడు జగిత్యాలలో కూటమి తరఫున జీవన్‌రెడ్డే సరైన అభ్యర్థి. దీంతో ఈ సీటును కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే అవకాశం లేదు. అటు రమణ కూడా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని అడగడం పొత్తు ధర్మం కాదనే ఆలోచనలో ఉన్నారు. కోరుట్లలో పోటీకి అవకాశం ఇచ్చినా వెళ్లబోనని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే జగిత్యాల లేదంటే పోటీకి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఆయన హైదరాబాద్‌లో టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఒకచోటినుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రమణను బరిలో దించాలని.. ఇందుకు హైదరాబాద్ సరన వేదికని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే.. దీనికి ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమణ అసెంబ్లీ బరిలో నిలుస్తారా? లేక ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా వెళ్తారా అన్నది చర్చనీయాంశమైంది.
హుస్నాబాద్‌లో చాడకు సెగ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 2004లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఇక్కడినుంచి కాంగ్రెస్ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బలమైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇస్కో సంస్థకు డైరెక్టర్ కూడా అయిన ప్రవీణ్ రెడ్డి.. తనే హుస్నాబాద్ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై చాడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తు కుదిరిన తర్వాత కూటమి సీట్లపై ఇంకా స్పష్టత రాకముందే.. కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ప్రచారం చేసుకుంటారని మండిపడుతున్నారు. చాడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దగా స్పందించలేదు. అటు, ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా వదులుకోవద్దని.. ప్రవీణ్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని స్థానిక నాయకత్వం నుంచి టీపీసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హుస్నాబాద్ బరిలో ఎవరుంటారనేది అర్థం కావడం లేదు. కాంగ్రెస్‌కే టికెట్ ఇస్తే.. చాడ పరిస్థితేంటనే దానిపైనా అయోమయం నెలకొంది.
ప్రొఫెసర్ ఎక్కడినుంచి?
టీజేఎస్ చీఫ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేననే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడినుంచి పోటీచేయాలనే అంశంపై మాత్రం కూటమిలో గానీ, టీజేఎస్‌లో కానీ స్పష్టత రాలేదు. మొదట ఆయన జనగామ బరిలో ఉంటారని.. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులే సీట్లు ఆశిస్తున్నారు. జనగామ నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉండగా.. వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో మంచిర్యాల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోదండరాం భావించినప్పటికీ.. అక్కడినుంచి మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేం సాగర్ రావు సీటు ఆశిస్తున్నారు. దీంతో అసలు కోదండరాం బరిలో ఉంటారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.
ముఖ్యనేతలకూ పరేషాన్..
ఈ 3 పార్టీల అధ్యక్షులతో పాటు కీలకనేతల విషయంలోనూ సీట్ల కేటాయింపు పెద్ద సమస్యగానే మారింది. టీజేఎస్‌లో ముఖ్యనేత కపిలవాయి దిలీప్‌కుమార్ మల్కాజ్‌గిరి స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే.. అక్కడ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, గతంలో పోటీచేసిన నందికంటి శ్రీధర్, దిలీప్ సామాజిక వర్గానికే చెందిన బిల్డర్ల సంఘం నాయకుడు శ్రీరంగం సత్యం టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావుకు వారివారి స్థానాల్లో కాంగ్రెస్ నుంచే తీవ్రపోటీ ఎదురవుతోంది. దీంతో కూటమి సీట్ల సర్దుబాటుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment