సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఎన్నికల్లో చెరో స్థానంలోనైనా గెలుపొంది అసెంబ్లీలో కనీస ప్రాతినిధ్యం సాధిస్తామనే ఆశాభావంతో సీపీఐ, సీపీఎం ఉన్నాయి. గతంలో మాదిరిగానే వామపక్షకూటమి ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు మొదట్లోనే విఫలమైన నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం విడివిడిగానే పోటీచేశాయి. కాంగ్రెస్ ప్రజా ఫ్రంట్ కూటమిలో చేరిన సీపీఐ మూడు సీట్లలో పోటీచేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీచేస్తున్నారు. సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎంపీ వొడితెల సతీశ్‌కుమార్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత తమకు కలసి వస్తుందని సీపీఐ అంచనా వేస్తోంది. సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ బెల్లంపల్లి (ఎస్టీ) స్థానం నుంచి బరిలో ఉన్నారు. వయసు మీద పడటంతో పాటు ఆరోగ్యం సహకరించక ఆయన ప్రచారంలో కూడా చురుకుగా వ్యవహరించలేకపోయారు.దీంతో పాటు మాజీ మంత్రి జి.వినోద్ టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్‌పీ తరఫున ఇదే స్థానం నుంచి పోటీచేయడం సీపీఐకు కలసి రాకపోవచ్చని భావిస్తున్నారు. మూడోస్థానం వైరా(ఎస్టీ)లో డా.విజయకి పార్టీ అవకాశం కల్పించింది.ఇక్కడ పార్టీ బలంగానే ఉన్నా కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి రాములు నాయక్ పోటీచేస్తుండటం, సీపీఎం అభ్యర్థి కూడా బరిలో ఉండటంతో సీపీఐ అభ్యర్థి గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షాల ఓట్లు పూర్తిస్థాయిలో బదిలీ అయితేనే సీపీఐ ఆశలు ఫలించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.
ఓట్లు పెంచుకోవడంపై బీఎల్‌ఎఫ్ దృష్టి...
తొలిసారిగా మెజారిటీ స్థానాల్లో పోటీచేస్తున్నందున ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోయినా ఓట్లశాతం పెరుగుతుందనే ఆశాభావంతో సీపీఎం–బీఎల్‌ఎఫ్ పక్షాలున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 107 సీట్లలో పోటీ చేస్తుండగా... అందులో సీపీఎం 26, బీఎల్‌ఎఫ్ 81 చోట్ల బరిలో తలపడ్డాయి. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ అభ్యర్థులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో కొన్నిస్థానాల్లోనైనా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ గెలుపోటములను ప్రభావితం చేస్తామనే ధీమాతో ఈ ఫ్రంట్ ఉంది. భద్రాచలం(ఎస్టీ) స్థానంతో పాటు పార్టీ గతంలో గెలిచిన మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, వైరా స్థానాల్లో కనీసం ఒక స్థానంలో గెలుస్తామని సీపీఎం ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. బీఎల్‌ఎఫ్ తరఫున నారాయణ్‌పేట్‌లో పోటీచేస్తున్న శివకుమార్‌రెడ్డి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు ఈ సీటుతో పాటు ఆలేరు, కొత్తగూడెం, మహబూబాబాద్, చెన్నూరులలో ఒక్క సీటులోనైనా గెలుస్తామనే ఆశాభావంతో బీఎల్‌ఎఫ్ ఉంది.
వామపక్షాలకు చెరో స్థానమైనా దక్కేనా ?
Published Tue, Dec 11 2018 1:26 AM | Last Updated on Tue, Dec 11 2018 4:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment