సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ అధినేత కోదండరాంను కరివేపాకులా వాడుకుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీట్ల పంపకంలో కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ చెయ్యిచ్చిందన్నారు. మహాకూటమికి ఓటేస్తే.. తెలంగాణ వనరులు పరాయి వాళ్ల పరమవుతాయని హెచ్చరించారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వి.తిరుమలరావు (ఎమ్మార్పీఎస్), తిరుపతిరెడ్డి (బీజేపీ) మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వివిధ పార్టీల నేతల చేరికలతో టీఆర్‌ఎస్ భవన్ కళకళలాడుతుంటే.. దీక్షలతో గాంధీభవన్, గాంధీ ఆస్పత్రిలా మారిందని ఎద్దేవా చేశారు. మహాకూటమికి ఓటేస్తే అది ఢిల్లీకి లేదా అమరావతికి చేరుతుందని చెప్పారు. సీట్లను సరిగా పంచుకోలేని వారు, రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎంలున్నారని, అధికారంలోకి వస్తే కుర్చీ కోసం కుమ్ములాటలేనని విమర్శించారు.
చొప్పదండి అల్లుడ్ని బాగా చూసుకోవాలి..
టీఆర్‌ఎస్ పార్టీకి కరీంనగర్ జన్మతో పాటు పునర్జన్మనిచ్చిందని కేటీఆర్ అన్నారు. చొప్పదండి అల్లుడైన కేసీఆర్‌ను బాగా చూసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో చొప్పదండి అభ్యర్థినిని మార్చామని.. ఓపిక లేకే ఆమె (బి.శోభ) మరో పార్టీలో చేరారని విమర్శించారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా టీఆర్‌ఎస్ అభ్యర్థి రవిశంకర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అసలు రేవూరిది.. ఏ ఊరు?
రేవూరి ప్రకాశ్‌రెడ్డి వరంగల్ వెస్ట్‌లో పోటీ చేసే హక్కు ఉందా.. అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరంగల్ వెస్ట్‌కు చెందిన సీపీఐ, ఎమ్మార్పీఎస్ నేతలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అసలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఏ ఊరి ప్రకాశ్‌రెడ్డి.. ఆయన అమరావతి ప్రకాశ్‌రెడ్డే. తెలంగాణ రాకుండా అడ్డుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతినిధి రేవూరి..’అని విమర్శిం చారు. వచ్చే నాలుగు సీట్ల కోసం కూటమి నాయకులంతా కుమ్ములాడుకుంటున్నారని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుకు మద్దతిచ్చే కూటమికి ఓటేస్తారో లేక తెలంగాణను పథకాలతో సస్యశ్యామలం చేస్తోన్న కేసీఆర్‌కు ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. 70 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి కేవలం కేసీఆర్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారన్నారు. అందుకే కేసీఆర్‌ను గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment