సాక్షి, హైదరాబాద్: పెద్ద, పెద్ద కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు తీసుకోమని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, టీజేఎస్ నేతలు అంబటి శ్రీని వాస్, చింత స్వామి, గోపాలశర్మ, భైరి రమేశ్ తదితరులతో కలసి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
ప్రజల సొమ్మును పెద్దఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించొ ద్దని నిర్ణయించినట్టు చెప్పారు. సామాన్యులు, స్థానిక కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమల యజమానుల నుంచి మాత్రమే చందాలు వసూ లు చేస్తున్నట్టు వెల్లడించారు. కొత్త రాజకీయ ఒరవడికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 29న సరూర్‌నగర్‌లో జరిగే జన సమితి ఆవిర్భావ సభకు అన్ని అనుమతులు లభించాయని, దీని కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సభ నిర్వహణ కోసం 12 కమిటీలు కృషి చేస్తున్నాయన్నారు. సభా నిర్వహణ నిమిత్తం వాలంటీర్లకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. పార్టీపై ప్రత్యేక పాటలు రూపొందించినట్టు తెలిపారు. సభకు వచ్చే ప్రతిరైతు ఒక నాగలి కర్రుముక్క తీసుకురావాలని, దీనితో అమరుల స్మృతి చిహ్నాన్ని నిర్మిస్తామని అన్నారు.
ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అధికారంలో ఉన్నవారు పట్టించుకోవడం లేదని.. అన్ని వర్గాలు పాలకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే అవకాశం లేకుండా చేయడం చట్ట వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. మీడియాపై అసహనం ప్రదర్శించడం మంచిదికాదన్నారు.
సినీ పరిశ్రమపై ఆసక్తితో వచ్చిన మహిళను లోబరుచుకోవడం మంచిపరిణామాలు కాదని, వీటిని ఖండించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 29న మూడు గంటలకు సభ ప్రారంభం అవుతుందని, 3 నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 6.40కి ప్రభుత్వ నిర్బంధం, పాలకుల వైఫల్యాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment