trs-congress alliance
-
టీఆర్ఎస్-కాంగ్రెస్కు సీపీఐ మధ్యవర్తిత్వం
హైదరాబాద్: టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదర్చేందుకు సీపీఐ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని కేసీఆర్ పట్టుబడడం, సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. మెజార్టీ అసెంబ్లీ సీట్లు అయినా ఇవ్వాలని టీఆర్ఎస్ కోరుతోంది. అది కూడా సాధ్యం కాదని కాంగ్రెస్ చెబుతున్నట్టు తెలిసింది. రెండు పార్టీలు మెట్టు దిగకపోవడంతో పొత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో టీఆర్ఎస్తో పొత్తు కుదరడం సాధ్యం కాకపోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు అంటున్నారు. అయితే టీఆర్ఎస్తో పొత్తుకు తలుపులు తెరుకునే ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
మమ్మల్నే ఎందుకు అడుగుతారు?
న్యూఢిల్లీ: టీఆర్ఎస్తో పొత్తు విషయాన్ని ఆ పార్టీనే అడగాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ విషయం తమను ఎందుకు అడుగుతారని మీడియాను దిగ్విజయ్ సింగ్ ఎదురు ప్రశ్నించారు. సీపీఐతో పొత్తు ఖరారైందని తెలిపారు. సీమాంధ్రలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. తెలంగాణలో త్వరలోనే ప్రచారం మొదలు పెడతామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. బీజేపీ మతతత్వ పార్టీ అని దిగ్విజయ్ అన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే లౌకికవాదం నుంచి పక్కకు పోయినట్టేనని అన్నారు. తెలంగాణకు మొదట మద్దతు పలికి, ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేశారని తెలిపారు. -
'పొత్తులకున్న దారులన్ని మూసుకుపోయాయి'
మెదక్ : కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. పొత్తులంటూ కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని... ప్రజలను తప్పుదోవ పట్టించడానికే పొత్తులంటోందని ఆయన మండిపడ్డారు. పొత్తులకున్న దారులన్ని మూసుకుపోయాయని హరీష్ రావు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే ఇవ్వటం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమని హరీష్ రావు తెలిపారు. పార్టీ పెట్టి బేరాలు చేసుకోవటం చిరంజీవి కుటుంబానికి కొత్తేమీ కాదని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. కాగా అధిష్టానం ఆదేశం మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి పొత్తులపై టీఆర్ఎస్ తో చర్చలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్ ప్రతిపాదిస్తేనే పొత్తులపై చర్చిస్తామని ఢిల్లీ నుంచి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న పొన్నాల వ్యాఖ్యానించారు.