'పొత్తులకున్న దారులన్ని మూసుకుపోయాయి'
మెదక్ : కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. పొత్తులంటూ కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని... ప్రజలను తప్పుదోవ పట్టించడానికే పొత్తులంటోందని ఆయన మండిపడ్డారు. పొత్తులకున్న దారులన్ని మూసుకుపోయాయని హరీష్ రావు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.
జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కోర్టు స్టే ఇవ్వటం దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమని హరీష్ రావు తెలిపారు. పార్టీ పెట్టి బేరాలు చేసుకోవటం చిరంజీవి కుటుంబానికి కొత్తేమీ కాదని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
కాగా అధిష్టానం ఆదేశం మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి పొత్తులపై టీఆర్ఎస్ తో చర్చలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే టీఆర్ఎస్ ప్రతిపాదిస్తేనే పొత్తులపై చర్చిస్తామని ఢిల్లీ నుంచి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న పొన్నాల వ్యాఖ్యానించారు.