TRS Election campaign
-
అరకోటి మందితో ముఖాముఖి!
‘కారు గుర్తుకే ఓటెయ్యాలె.. కేసీఆరూ మళ్లీ రావాలె..’ రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే పాట. ‘అభివృద్ధి ఆగొద్దు.. కారు డ్రైవరు మారొద్దు..’ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల నినాదం ఇది. బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని, అందరూ ఆశీర్వదించాలని ప్రజానీకాన్ని కోరుతున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. రాష్ట్రాన్ని సుడిగాలిలా చుట్టేస్తున్నారు. ఆయన పాల్గొన్న వివిధ సభల ద్వారా దాదాపు 46.40 లక్షల మందిని నేరుగా ఓటడిగినట్టు అంచనా. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 116 సెగ్మెంట్లలో ప్రచారానికి ప్రణాళిక రూపొం దించారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాదసభ’ పేరుతో సెప్టెంబరు 7న ఎన్నికల సమరశంఖం పూరించిన ఆయన అదే జిల్లాలోని సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో డిసెంబరు 5న ప్రచారం ముగించనున్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన ప్రజాఆశీర్వాద బహిరంగసభలో ఒక్కో సెగ్మెంట్ నుంచి సగటున 40 వేల మంది హాజరయ్యారు. ఇలా అన్ని సభలకు కలిపి 46.40 లక్షల మందిని కేసీఆర్ స్వయంగా మద్దతు కోరారు. ఓటింగ్‌లో ఇది ప్రభావం చూపనుంది’ అని టీఆర్ఎస్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ప్రజాఆశీర్వాదసభ కంటే ముందు నిర్వహించిన కొంగరకలాన్సభకు పది లక్షల మంది వచ్చినట్లు టీఆర్ఎస్ అంచనా. ఇలా గులాబీ దళపతి కేసీఆర్ స్వయంగా 56 లక్షల మందికి నేరుగా ప్రభుత్వ పాలనను వివరించి మళ్లీ మద్దతు ఇవ్వాలని కోరారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొంగరకలాన్ నుంచి షురూ గత ఎన్నికల్లో కేసీఆర్ 110 సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సెప్టెంబరు 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. అసెంబ్లీ రద్దుకు నాలుగు రోజులు ముందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభకు పది లక్షల మంది తరలి వచ్చారని టీఆర్ఎస్ అంచనా. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దయ్యింది. ఆ మర్నాడు హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాదసభ’ పేరుతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం అక్టోబరు 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి బహిరంగసభలు నిర్వహించారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబరు 19 నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. అక్టోబరు 24, నవంబరు 1న రెండు రోజులు మినహా రోజూ సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం మరో ఐదు సభల్లో పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగియనున్న బుధవారం సైతం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మొత్తంగా కొంగరకలాన్ ప్రగతి నివేదన బహిరంగసభను మినహాయిస్తే.. 87 బహిరంగసభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నట్టు. జగిత్యాలలో 4 సెగ్మెంట్లకు, వరంగల్‌లో 3 సెగ్మెంట్లకు, ఖమ్మం, కరీంనగర్లో 2 సెగ్మెంట్ల కు ఒకటి చొప్పున సభ నిర్వహించారు. ఇలా ప్రచారగడువు ముగిసే వరకు కేసీఆర్ 116 సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు. నల్లగొండ, వనపర్తిలో రెండేసి మార్లు సభల్లో పాల్గొన్నారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించలేదు. అభివృద్ధికి నుడికారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నాలుగేళ్ల మూడు నెలల పాలనే నినాదంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అన్ని అంశాలపై సాధికారతతో తనదైన యాసభాషలతో ప్రజలను ఆకట్టుకుంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని సామాజిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ప్రసంగం ఉంటోంది. నియోజకవర్గాల్లోని పరిస్థితులను బట్టి భాష తీవ్రత సైతం మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్–టీడీపీ పాలనను, టీఆర్ఎస్ పాలనను పోల్చి చెబుతున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాలను వివరిస్తూనే.. కొత్తగా నెరవేర్చబోయే హామీలను ప్రకటిస్తున్నారు. ఆసరా పెన్షన్ల పెంపు, మళ్లీ రుణమాఫీ, రైతుబంధు సాయం పెంపు, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్ వంటి హామీలను ప్రకటిస్తున్నారు. ముస్లిం, గిరిజన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబడుతున్నారు. 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి అసెంబ్లీ రద్దు వరకు జరిగిన పరిస్థితులను ఆయన వివరిస్తున్నారు. మైనారిటీలు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో ఉర్దూలో ప్రసంగిస్తున్నారు. ఆశీర్వాదం కోరుతూ.. ప్రతి బహిరంగసభలోనూ ఆ నియోజకవర్గం అభ్యర్థిని పరిచయం చేయడంతో సీఎం కేసీఆర్ ప్రసంగం మొదలవుతోంది. కేసీఆర్ ప్రసంగం పూర్తయ్యే వరకు అభ్యర్థి పక్కనే ఉంటున్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ చివరికి మళ్లీ ఆశీర్వదించాలని కోరుతున్నారు. ‘ఎన్నికలు రాగానే చాలా పార్టీలు, జెండాలు మీ ముందుకు వస్తయి. ఆగం కావద్దు. అందరూ చెప్పేది వినాలె. మీ గ్రామాలకు, బస్తీలకు వెళ్లినంక.. ఏంచేస్తే మనకు లాభమనేది చర్చ చేయాలె. ప్రజాస్వామ్యంలో పార్టీలు, నాయకులు గెలుచుడు ముఖ్యంకాదు. ప్రజలు గెలవాలె’ అని నూరిపోస్తున్నారు. అభివృద్ధి ఆగకుండా ఉండేందుకు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. అన్నీ హెలికాప్టర్లోనే.. ప్రచార ప్రయాణంలోనే కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నారు. వాటిని అమలు చేసే బాధ్యతను నేతలకు వివరిస్తున్నారు. ప్రజా ఆశీర్వాదసభల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ముఖ్యనేతలకు, అభ్యర్థులకు ప్రయాణంలోనే ఆదేశాలిస్తున్నారు. గజ్వేల్‌లోని ఇంటి నుంచి ప్రచారానికి వెళ్లి వస్తున్నారు. ఇంట్లోనే ఉదయం అల్పాహారం మినహా అంతా హెలికాప్టర్లోనే పూర్తి చేస్తున్నారు. గడియ తీరిక లేకుండా కేసీఆర్ ఎన్నికల వ్యూహంలో నిమగ్నమవుతున్నారు. -పిన్నింటి గోపాల్ -
‘ఏపీ ప్రజలను గాలికొదిలేసి.. తెలంగాణలో ప్రచారం’
సాక్షి, ఉట్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ మేలు చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే.. టీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. సంక్రాతికి ముందే గంగిరేద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 3400 తాండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారని.. కానీ నేడు 35 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటారని.. తమ బాసులు మాత్రం గల్లీల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
‘గాచారం బాగాలేక చంద్రబాబుతో కలిసి పనిచేశా’
సాక్షి, నాగర్ కర్నూలు/చేవెళ్ల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రజా సమస్యలపై నిబద్ధత లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. తాను కొంత కాలం చంద్రబాబుతో కలిసి పనిచేశానని అన్నారు. గాచారం బాగాలేకపోవడం వల్లే ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌తో జట్టు కట్టిన చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ ఆ పార్టీనే ఓడించమని అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని నాటి సీఎం కిరణ్ చెప్పారని గుర్తుచేశారు. కానీ నేడు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పరిణతి ఉంటే ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని ఆయన అన్నారు. దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజాకూటమి, టీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసనని వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు వాసులపై హామీల వర్షం అంతకు ముందు నాగర్ కర్నూలు సభలో కేసీఆర్ జిల్లా వాసులపై హామీల వర్షం కురిపించారు. నాగర్ కర్నూలులో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే ఏడాదిలోగా వట్టెం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. నాగర్ కర్నూల్ ని బంగారు నాగర్ కర్నూల్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు 5 లక్షల రూపాయల రుణం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుందని.. ఇలా చేయడం అంటే ప్రజలపై మళ్లీ భారం మోపడమేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు పథకం ఓ అద్భుతమైన కార్యక్రమమని తెలిపారు. త్వరలోనే ఈఎన్టీ స్పెషలిస్టులు కూడా గ్రామాలకు వస్తారని హామీ ఇచ్చారు. ఆరోగ్య తెలంగాణ స్పష్టించడమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ హయంలో జరిగిన గృహ నిర్మాణాలు డబ్బా ఇళ్లేనని ఆరోపించారు. కొద్దిగా ఆలస్యమైనా ప్రజలకు మంచి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు రైతులకు వరం అని పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తనేనంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 24 గంటల పాటు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాగా, టీఆర్ఎస్ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగే సభలో కేసీఆర్ విడుదల చేయనున్నారు. -
పోరుబాట మారాలి.. మన జెండా ఎగరాలి
* నేడు పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం * రాష్ట్రం సాధించగానే సరిపోదు.. కొత్త రాష్ట్రాన్ని నిర్మించే సత్తా ఉందని చాటాలి * ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలి సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పోరాట వ్యూహాన్ని మార్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఒక్క తెలంగాణ సాధన అంశంపైనే ఆధారపడితే సరిపోదనే అంచనాకు వచ్చింది. అందుకే ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టి అడుగులు వేయాలని, గెలుపుపై అప్రమత్తంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ద్వారా వారి మనసులను గెలవాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, మొదటిసారి పోటీచేస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. తమ విజయానికి తెలంగాణ సాధనే ప్రధాన ఆయుధం అనే అభిప్రాయం 90 శాతం మంది అభ్యర్థుల్లో ఉంది. అయితే ఈ భావనతోనే ఎన్నికల్లోకి వెళితే ఇబ్బందులు తప్పవని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. కాంగ్రె స్ బీజేపీలు కూడా తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. బీజేపీ వారికి మోడీ ఆసరా కూడా ఉంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే.. తెలంగాణ అంశంతో పాటు ప్రజల ప్రతి సమస్యను ప్రస్తావించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీకే ఇంత ధీమా ఉంటే.. ఇచ్చిన పార్టీకి, మద్దతు ఇచ్చిన వారికి మరెంత అవకాశం ఉండాలి? అనే విషయాన్ని విశ్లేషించారు. ఆందుకే పార్టీ ప్రచార శైలిని, ప్రజల్లోకి వెళ్లే పద్ధతులను మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందుకే శనివారం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు ప్రచారంలో పాల్గొనే ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి ప్రచారవ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యాంశాలు.. * ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సాధన అంశాన్ని ఒక భాగంగా చూడాలి తప్ప, మొత్తం దానిమీదనే ఆధారపడవద్దు. * ప్రజా సమస్యలను పరిష్కరించే, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉందని చాటడం. ఇతర పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టడం, రాజకీయ అవినీతి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం. * గత ఎన్నికల్లో తెలంగాణ అంశంపైనే ప్రజల్లోకి వెళ్లాం. కానీ ఇప్పుడు కొత్త పంథాలో ఆలోచించడం. కొత్త రాష్ట్రానికి ఏం చేస్తాం. ఎలా చేస్తాం. వంటి విషయాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించడం.