పోరుబాట మారాలి.. మన జెండా ఎగరాలి
* నేడు పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం
* రాష్ట్రం సాధించగానే సరిపోదు.. కొత్త రాష్ట్రాన్ని నిర్మించే సత్తా ఉందని చాటాలి
* ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పోరాట వ్యూహాన్ని మార్చుకోవాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఒక్క తెలంగాణ సాధన అంశంపైనే ఆధారపడితే సరిపోదనే అంచనాకు వచ్చింది. అందుకే ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టి అడుగులు వేయాలని, గెలుపుపై అప్రమత్తంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ద్వారా వారి మనసులను గెలవాలని టీఆర్‌ఎస్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, మొదటిసారి పోటీచేస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. తమ విజయానికి తెలంగాణ సాధనే ప్రధాన ఆయుధం అనే అభిప్రాయం 90 శాతం మంది అభ్యర్థుల్లో ఉంది. అయితే ఈ భావనతోనే ఎన్నికల్లోకి వెళితే ఇబ్బందులు తప్పవని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.
కాంగ్రె స్ బీజేపీలు కూడా తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. బీజేపీ వారికి మోడీ ఆసరా కూడా ఉంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే.. తెలంగాణ అంశంతో పాటు ప్రజల ప్రతి సమస్యను ప్రస్తావించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీకే ఇంత ధీమా ఉంటే.. ఇచ్చిన పార్టీకి, మద్దతు ఇచ్చిన వారికి మరెంత అవకాశం ఉండాలి? అనే విషయాన్ని విశ్లేషించారు. ఆందుకే పార్టీ ప్రచార శైలిని, ప్రజల్లోకి వెళ్లే పద్ధతులను మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందుకే శనివారం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు ప్రచారంలో పాల్గొనే ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి ప్రచారవ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యాంశాలు..
* ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సాధన అంశాన్ని ఒక భాగంగా చూడాలి తప్ప, మొత్తం దానిమీదనే ఆధారపడవద్దు.
* ప్రజా సమస్యలను పరిష్కరించే, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉందని చాటడం. ఇతర పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టడం, రాజకీయ అవినీతి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం.
* గత ఎన్నికల్లో తెలంగాణ అంశంపైనే ప్రజల్లోకి వెళ్లాం. కానీ ఇప్పుడు కొత్త పంథాలో ఆలోచించడం. కొత్త రాష్ట్రానికి ఏం చేస్తాం. ఎలా చేస్తాం. వంటి విషయాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించడం.