రాములు హత్యకేసులో ఆరుగురు నిందితుల రిమాండ్
నల్లగొండ లీగల్, న్యూస్‌లైన్ :టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొనపురి రాములు హత్య కేసులో ఆరుగురు నిందితులను మంగళవారం జిల్లాకోర్టులో రిమాండ్ చేశారు. నిందితుల్లో ఏ3గా సురేష్, ఏ12గా కుమారస్వామి, ఏ13గా ఉమేష్, ఏ14గా యల్లేష్, ఏ15గా రవి, ఏ16గా సోమయ్య ఉన్నారు. వీరిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకోగా నల్లగొండ టుటౌన్ పోలీసులు పీటీ వారెంట్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం రైలులో భారీ బందోబస్తు నడము తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చారు. వెంటనే పోలీసులు ఆ నిందితులను విచారిం చేందుకు తమకు అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారించిన మేజిస్ట్రేట్ (మద్య నిషేధ న్యాయస్థాన న్యాయమూర్తి) సత్యనారాయణ షరతులతో అంగీకరించారు. నిందితులను విచారించే ముందు వారితో వారి న్యాయవాదిని, డాక్టర్‌ను వెంట ఉంచాలని, విచారణ పగటి వేళనే జరపాలనే షరతులు విధించారు. ఈ పిటిషన్‌పై సదరు నిందితులను 10రోజులపాటు పోలీసులు తమ అధీనంలో ఉంచుకుని విచారణ పూర్తిచేసి తిరిగి కోర్టుకు అప్పగించాలని తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదించారు. సదరు ముద్దాయిలపై సెక్షన్ 147, 148, 332, 115, 157, 158, 302, 120(బి) రెడ్‌విత్ 149 ఐపీసీ, 25,27 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద నేరం మోపి రిమాండ్‌కు పంపారు.