భూ కుంభకోణం ఆరోపణలపై కేకే వివరణ
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఖండించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 38 ఎకరాల భూమి విషయంలో తన కూతురు, కోడలుపై వచ్చిన ఆరోపణలపై ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ భూముల వ్యవహారంపై ఏ అధికారిని సస్పెండ్ చేయలేదని అన్నారు.
2013లో అగ్రిమెంట్ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్ చేసుకుని దండు మైలారంలో భూములు కొన్నామని, అయితే తాము వివాదంలో ఉన్న భూములు కొనలేదని తెలిపారు. భూముల కొనుగోలు పూర్తిగా చట్టప్రకారమే జరిగిందన్నారు. తమ కుటుంబం 50 ఎకరాలు కొన్న మాట వాస్తవమేనని, రెవెన్యూ పత్రాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆ భూములు కొన్నట్లు కేకే తెలిపారు. చట్టప్రకారమే భూములు కొన్నానని, తాను దొంగను కాదని అన్నారు.
ఆ భూములు ప్రభుత్వ భూములు కావని హైకోర్టు ఆర్డర్ కూడా ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టడం సరికాదని అన్నారు. ఎవరి దగ్గర భూములు కొన్నానో తనకు తెలుసునని కేకే తెలిపారు. తాను పార్లమెంట్ సభ్యుడినని, చట్టాలు చేసేది తామేనని, వాటిపై గౌరవం ఉందని అన్నారు. కాగా సర్వే నెంబర్ 36లో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు మీద కొన్న 50 ఎకరాల్లో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. గోల్డ్ స్టోన్ కంపెనీ ఈ భూములను కేకే కుమార్తెకు అమ్మినట్లు సమాచారం. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అధికారి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.