trujet flight Services
-
బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమాన సేవల్లో ఉన్న హైదరాబాద్ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ తాజాగా తన నెట్‌వర్క్‌లోకి బీదర్‌ను చేర్చింది. ఉడాన్ సర్వీసుల్లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు మధ్య ఫ్లయిట్‌ను ప్రతిరోజూ నడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి విమానంలో బీదర్ ప్రయాణించారు. బస్సులో 12 గంటల సమయం పడుతుందని, విమానంలో గంట 40 నిమిషాల్లోనే చేరుకున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీదర్ చేరికతో ట్రూజెట్ నెట్‌వర్క్‌లో డెస్టినేషన్ల సంఖ్య 24కు చేరుకుందని టర్బో మేఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈ స్థాయికి చేరుకున్నామని కంపెనీ సీఈవో కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాగా, స్ప్రింగ్ సర్ప్రైజ్ పేరుతో నాలుగు రోజుల సేల్‌లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు రూట్లో బేస్ ఫేర్ రూ.699కే అందిస్తోంది. సర్వీసు ప్రారంభిస్తున్న కర్ణాటక సీఎం, తదితరులు -
బెంగళూరు నుంచి బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
బెంగళూరు: ఉడాన్ నెట్వర్క్ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్ టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. బీదర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య శుక్రవారం నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇవాళ బెంగళూరు విమానాశ్రయంలో ఈ సర్వీసు ప్రారంభించారు. బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీదర్ వరకు ప్రయాణించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందన్నారు. ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు ఇక ట్రూజెట్ నెట్‌వర్క్‌లో బీదర్ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)- ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్సీఎస్ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్. ఈ సందర్భంగా టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ‘మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్‌లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడమే కాకుండా ఉపాధి కల్పనకు సహకరిస్తుంది’ అని అన్నారు. సీఈఓ కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మా నెట్‌వర్క్‌ను 24స్టేషన్లకు విస్తరించగలిగాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించామన్నారు. కాగా బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ట్రూజెట్ నాలుగు రోజుల పాటు టికెట్ బేస్ ధరను రూ.699 గా అందిస్తోంది. -
లాభాల్లోకి ట్రూజెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ కంపెనీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో... తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ మాత్రం తొలిసారి లాభాల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2018 అక్టోబరు నుంచి నష్టాలు లేవని, నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.85 కోట్ల నష్టాలొచ్చాయి. ఈ ఏడాది ఫలితాలింకా ఆడిట్ కాలేదని, కాకపోతే తాము లాభాల్లోకి మాత్రం ప్రవేశిస్తున్నామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె.జి.విశ్వనాథ్ చెప్పారు. దాదాపు 23% ఎబిటా మార్జిన్లు సాధిస్తున్నామని, ఇది ఈ రంగంలోని అన్ని కంపెనీలకన్నా ఎక్కువని కంపెనీ సీసీవో సుధీర్ రాఘవన్ వెల్లడించారు. సంస్థకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారమిక్కడ వారితో పాటు సీఈఓ మూర్తి, ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా(ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ విలేకరులతో మాట్లాడారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించారు. చేతికి కొత్త విమానాలు.. 2015లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ట్రూజెట్.. రెండు విమానాలతో మొదలై ప్రస్తుతం 5 విమానాలకు చేరుకుంది. గతేడాది జెట్ ఎయిర్వేస్ నుంచి సిబ్బందితో సహా 5 విమానాలను లీజుకు తీసుకుని సంఖ్యను 10కి చేర్చాలని లకి‡్ష్యంచినా... జెట్ సంక్షోభం కారణంగా కుదరలేదు. ‘‘నవంబరు–డిసెంబరు మా విమానాల సంఖ్య 10కి చేరుతుంది. 2020లో మరో 5–8 జతకూడనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రూట్లకు సంబంధించి గతేడాదే ఉడాన్ బిడ్లు సాధించాం. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాం’’ అని ప్రదీప్ వివరించారు. స్వయంగా ఎదగటానికే ప్రయత్నిస్తామని, ఇతర సంస్థల్ని కొనేందుకు సరైన అవకాశం వస్తే మాత్రం పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ప్రస్తుతం కంపెనీలో మేఘా ఇంజినీరింగ్‌కు 90 శాతం వాటా ఉందని, నిధుల కోసం దీన్ని పబ్లిక్ ఇష్యూకు తెచ్చి, వాటాలు విక్రయించే యోచనేదీ ప్రస్తుతమైతే లేదని స్పష్టంచేశారు. ‘‘మేం గణనీయమైన స్థాయికి చేరాలి. అందుకు కనీసం మూడేళ్లు పడుతుందని నా అంచనా. ఆ స్థాయికి చేరిన తరవాత మాత్రం పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఆలోచన తప్పకుండా చేస్తాం’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆదాయానికి మూడు మార్గాలు! ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు లాభాల్లోకి ప్రవేశించడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు విశ్వనాథ్ చెప్పారు. ‘‘ప్రయాణికు లకు యాడ్ ఆన్ సేవలందించడం, ఇతర విమానయాన కంపెనీలకు థర్డ్‌పార్టీ సర్వీసులివ్వటం, విమానాల్లో ప్రకటనలు వంటి మార్గాలన్నీ అన్వేషిస్తున్నాం. అందుకే వేగంగా నష్టాల నుంచి బయటపడ్డాం. విమానయాన రంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో కూడా చక్కని వృద్ధిరేటుతో మేం లాభాల్లోకి మళ్లగలిగాం’’ అని ఆయన వివరించారు. అందుకే ఒక సీట్ కిలోమీటర్‌కు (అంటే ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు ఒక సీటు ఆర్జించే ఆదాయం) తాము ఆర్జిస్తున్న ఆదాయం పోటీ కంపెనీలకన్నా 40% ఎక్కువగా ఉందని చెప్పారు. ‘‘2019లో మరో 6 కొత్త గమ్యాలకు విమానాలు నడుపుతాం. 2020 నాటికి ఈ సంఖ్య రెట్టింపవుతుంది. ప్రస్తుతం నెలకు 1,200 సర్వీసులు నడుస్తున్నాయి. కొత్త విమానాల చేరికతో ఇది 2,500లకు చేరుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 700 మంది ఉద్యోగులున్నారని, ఇటీవలే జెట్ ఎయిర్వేస్ నుంచి 100 మందిని తీసుకున్నామని, కార్యకలాపాలు విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే 6 నెలల్లో మరో 300 మందిని నియమించుకుంటామని వివరించారాయన. ప్రయాణికులు 6 శాతమే... కడప, బళ్ళారి (విజయనగర్) సహా వేరెవ్వరూ నడపని పలు ప్రాంతాలకు తాము విమానాలు నడుపుతున్నామని, దీనివల్ల పలు గ్రామీణ ప్రాంతాలను విమానరంగ కనెక్టివిటీకి చేరువ చేశామని సంస్థ సీఈఓ, రిటైర్డ్ కల్నల్ ఎల్.ఎస్.ఎన్.మూర్తి చెప్పారు. ‘‘దేశంలో విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య 6 శాతమే. అదే చైనాలో తీసుకుంటే 22 శాతం. ఈ సంఖ్య పెరగటం వల్ల ఎయిర్వేస్ సంస్థలే కాదు. విమానాశ్రయాలు నిర్వహించే కంపెనీలు, ప్రయాణికులు... ఇలా ఈ రంగంతో సంబంధం ఉన్నవారంతా లబ్ధి పొందుతారు. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్ - తిరుపతి మధ్య ప్రారంభమైన 'ట్రూజెట్' సర్వీసులు
హైదరాబాద్: ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం హైదరాబాద్ - తిరుపతి మధ్య తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రారంభించారు. టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తేజ ట్రూజెట్‌లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా కంపెనీ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ట్రూజెట్ హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న విషయం విదితమే.