సర్వే అడ్డగింత
- ఇరువర్గాల వాదనలతో కొద్దిసేపు ఉద్రిక్తత
- వెనుదిరిగిన అధికారులు, టి.సిరసపల్లి గ్రామస్థులు
- నేడు పోలీసుల సమక్షంలో మళ్లీ సర్వే
మునగపాక : టి.సిరసపల్లి గ్రామ శివారు రామారాయుడుపేట కొండ వద్ద బుధవారం మధ్యాహ్నం భయానక వాతావరణం కనిపించింది. రెండు ప్రాంతాల రైతులు వాదోపవాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేసేది లేక సిరసపల్లి గ్రామానికి చెందిన రైతులు వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే... సిరసపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 138, 139లలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో సిరసపల్లికి చెందిన రైతులు 1994 నుంచి మొక్కలు పెంచుతున్నారు.
అయితే ఈ ప్రాంతంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పార్కు ఏర్పాటుకు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో సాగులో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారాలు అందించాల్సి ఉండగా కొంతమంది తప్పుడు పేర్లను జాబితాల్లో చేర్చారంటూ, దీంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని రీ సర్వే చేపట్టాలని కోరుతూ వారం రోజులుగా స్థానిక రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత భూములను రీ సర్వే చేస్తున్నామని, రైతులు రావాలని వీఆర్ఓ బిభీషణ, సర్వేయర్ ఉపేంద్ర కోరడంతో బుధవారం సాయంత్రం సుమారు 65మంది రైతులు సంబంధిత ప్రాంతానికి చేరుకున్నారు.
ఈ విషయం ముందే తెలుసుకున్న సమీప రామారాయుడుపేట గ్రామస్థులు కూడా 138 సర్వే నెంబర్కు చెందిన కొండ తమ ప్రాంతంలో ఉందని ఇక్కడకు రావడానికి మీకు హక్కులేదని చెప్పడంతో కొంతసేపు వాతావరణం వేడెక్కింది. రామారాయుడుపేట నుంచి పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున కర్రలు, ఆయుధాలతో తరలివచ్చి అధికారులతో గొడవకు దిగారు. చేసేది లేక అధికారులు, సిరసపల్లి గ్రామ రైతులు వెనుతిరిగి రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని జరిగిన విషయాన్ని డీటీ గురునాథరావు దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన గురువారం పోలీసుల సమక్షంలో సర్వే చేయించేందుకు నిర్ణయించారు.
పరిశ్రమల పార్కుకు సంబంధించి చేపట్టనున్న భూసేకరణ రెండు గ్రామాల మధ్య వివాదానికి దారి తీస్తుందనడంలో సందేహం లేదు.