TSR Foundation
-
కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా థాపర్ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు. -
యశ్ చోప్రా అవార్డు అందుకున్న ఆశా
లెజండరీ సింగర్ ఆశా భోంస్లేకు ప్రతిష్టాత్మక యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ శుక్రవారం ముంబైలో ప్రదానం చేసింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆశా భోంస్లే 20 భాషల్లో దాదాపుగా 11వేల పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆమెకు యశ్ చోప్రా అవార్డు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు టీయస్సార్. ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, నటి జయప్రద, బాలీవుడ్ నటి రేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా భోంస్లేకు రేఖ అభినందనలు తెలిపి, పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2012లో చనిపోయిన యశ్ చోప్రా జ్ఙాపకార్థం టి. సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్లు నెలకొల్పిన ఈ అవార్డును ఇదివరకు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా అందజేస్తారు. -
ప్రియాంకా చోప్రాకు సుబ్బిరామిరెడ్డి సత్కారం
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ శ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాను కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీలోని తాజ్‌మహల్ హోటల్లో సత్కరించారు. టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి, నటుడు మోహన్ బాబు ప్రియాంకకు బంగారు గాజులు తొడిగి సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. భారత సినీ రంగంలోనే కాక ఆమెరికా టెలివిజన్ స్టార్‌గా ప్రియాంకా చోప్రా మన్ననలు పొందారని కొనియాడారు. కార్యక్రమానికి బ్రిటిష్ హైకమిషనర్ సర్ డోమ్నిక్, బాలీవుడ్ నటుడు శతృ ఘ్న సిన్హా, వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, దౌత్యాధికారులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.