టీటీడీలో మరో దర్శనం టిక్కెట్ల కుంభకోణం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టిక్కెట్లకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ద్ చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రొటేషన్ చేస్తూ సీసీ కెమెరా ఆపరేటర్ చైతన్యకుమార్ అడ్డంగా దొరికిపోయాడు.ఈ కుంభకోణం గత పదిరోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు ...చైతన్యకుమార్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.వారి వద్ద నుంచి 46 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక అందించిన తర్వాత చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరిలో వెలుగు చూసిన దర్శన టిక్కెట్లు కుంభకోణం విషయంలో నలుగురు బ్యాంక్ సిబ్బందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.