టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ బదిలీ
తిరుమల: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వి.దేవేంద్రరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా)లో ఎండోమెంట్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ జనవరి 31, 2013లో టీటీడీకి వచ్చారు. దేవస్థానం రెవెన్యూ, పంచాయతీ విభాగాలను సమర్థంగా నడిపారు. దేవస్థానం పరిధిలో పేరుకుపోయిన రెవెన్యూ బకాయిలనువసూలు చేయించగలిగారు. ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టు విషయంలో ఆశావహుల జాబితా పెరిగింది.
అప్పట్లో ఈయన బదిలీపై ఊహాగానాలు వచ్చాయి. ఆయన పదవీ కాలాన్ని జనవరి 2016 వరకు పెంచుతూ రెండు నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో టీటీడీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తిరుపతిలో ఉండే స్థలాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది వివాదాస్పదమైంది. ఈ తరుణంలో ఎస్టేట్ ఆఫీసర్ వి.దేవేంద్రరెడ్డి బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. చడీచప్పుడు లేకుండా ఎస్టేట్ ఆఫీసర్ బదిలీ కావడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టును తమ వారికి ఇప్పించేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు బడా నేతలు రంగంలో దిగి తీవ్రస్థాయిలో పోటీపడుతున్నట్టు సమాచారం.