నారాయణ గుప్తాకు సన్మానం
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: చెన్నై టీటీడీ సమాచార కేంద్రం, సలహా మండలి సభ్యులుగా నియమితులైన ఎం.వి.నారాయణగుప్తాకు తెలుగు ప్రముఖల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నారాయణగుప్తా సేవలు ప్రశంసనీయమైనవని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు కితాబిచ్చారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఎం.వి.నారాయణగుప్తాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు కలసి సన్మానం చేశారు. సభ కన్వీనర్, జయరాజ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ టి.రాజశేఖర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో నారాయణగుప్తా దంపతులను నిలువెత్తు పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా చెన్నై టీటీడీ సమాచారకేంద్రం ఏఈవో పి ప్రభాకర రెడ్డి, గౌరవ అతిథులుగా వివేక్ అధినేత బిఏ చంద్ర, శేఖర్ శెట్టి, గోపురం పసుపు అధినేత వై.వి.హరికృష్ణ, అజంతా శంకరరావు, అఖిల భారత తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ సిఎంకె రెడ్డి, తెలుగు తెర అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ హాజరయ్యారు.
పి.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ కార్యదీక్ష, సమయపాలన, సేవాతృష్ణ కలిగిన నారాయణగుప్తా సలహా మండలి సభ్యులుగా నియమితులు కావటం సంతోషంగా ఉందన్నారు. జనవరిలో 24 మందితో కొత్త కమిటీ ఏర్పడిందని అందులో ఎం.వి.నారాయణగుప్తా సభ్యులు కావటం అభినందనీయమన్నారు. ఆయన సలహాలు విలువైన సూచనలు టీటీడీకి ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పాండిచ్చేరి, కన్యాకుమారిలో వెంకన్న దేవస్థానం ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నాయని అన్నారు. చెన్నై నగరంలోని భక్తులకు వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మార్చి 16న ముప్పెరం విళా
అనంతరం గౌరవ అతిథి సిఎంకె రెడ్డి మాట్లాడుతూ మార్చి 16న ముప్పెరం విళా పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని దానికి తెలుగు వారందరూ హాజరు కావాలని కోరారు. తెలుగువారి సంఖ్యను పాలక ప్రజలకు తెలిపేలా తెలుగు వారి సమస్యలను పరిష్కరించుకునేలా ముప్పెరం విళాకు హాజరు కావాలని కోరారు. అజంతా శంకరరావు, వై.వి.హరికృష్ణ, టంగుటూరి రామకృష్ణ, బిఎ చంద్రశేఖర్ శెట్టిలు మాట్లాడుతూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతోనే ఎం.వి.నారాయణ గుప్తా సలహా మండలిలో సభ్యులయ్యారని అన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సేవా కార్యక్రమంలో కృషి చేస్తున్న ఎం.వి.నారాయణగుప్తా మరిన్ని పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు, ఆర్య వైశ్య సంఘాల ప్రముఖులు హాజరై ఎం.వి.నారాయణగుప్తా దంపతులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.