Tu
-
తెయూ పీఆర్వోగా
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ కె.రాజారాం మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్న రాజారాం.. గతంలోనూ కాశీరాం, అక్బర్ అలీఖాన్ వీసీలుగా ఉన్నప్పుడు పీఆర్వోగా పని చేశారు. మరోసారి పీఆర్వో రాజారాంను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
నిరోష మృతికి సంతాపం
తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో ఎంఏ (ఎకనామిక్స్) రెండో సంవత్సరం చదువుతున్న కె.నిరోష తన స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరిగాయలపల్లిలో పాటుకాటుతో మృతి చెందింది. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విష సర్పం కాటు వేయడంతో విద్యార్థిని మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఈ విషయం తెలియగానే యూనివర్సిటీలో విషాదం నెలకొంది. వర్సిటీ కళాశాల భవనం ఎదుట ఏర్పాటు చేసిన సంతాప సభలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరోష చిత్రపటం వద్ద వీసీతో సహా అధ్యాపకులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. విద్యార్థిని కుటుంబానికి వర్సిటీ తరఫున ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనకయ్య, వైస్ ప్రిన్సిపాల్ జాన్సన్, ప్రవీణాబాయి, సీవోఈ పాతనాగరాజు, చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరం
తెయూ(డిచ్పల్లి): విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాల్సిన అవసరముందని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో మరింత జవాబుదారీతనం అవసరమని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా, నిజాయతీ, నిబద్ధతతో పని చేసినప్పుడే ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం పెరుగుతుందన్నారు. మంగళవారం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల బీఈడీ కోర్సు సిలబస్‌పై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విద్యావ్యవస్థపై ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలపై ప్రజల నమ్మకాన్ని పొందాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యావ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని, అన్ని స్థాయిలలో నిబద్ధత అత్యంత అవశ్యకమని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ విద్యాలయాలవైపు ఆకర్షించి, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలంగాణ వర్సిటీకి అన్ని విధాల సహకరించారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే వర్సిటీలో బీఈడీ కోర్సు, ఎంఈడీ కోర్సులు ప్రవేశపెట్టామని చెప్పారు. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపల్స్, వర్సిటీ ప్రిన్సిపల్ కనకయ్య, డాక్టర్ కరుణాకర్ తదితరులు ప్రసంగించారు.