నిరోష మృతికి సంతాపం
Published Wed, Aug 31 2016 11:28 PM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీలో ఎంఏ (ఎకనామిక్స్) రెండో సంవత్సరం చదువుతున్న కె.నిరోష తన స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరిగాయలపల్లిలో పాటుకాటుతో మృతి చెందింది. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విష సర్పం కాటు వేయడంతో విద్యార్థిని మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఈ విషయం తెలియగానే యూనివర్సిటీలో విషాదం నెలకొంది. వర్సిటీ కళాశాల భవనం ఎదుట ఏర్పాటు చేసిన సంతాప సభలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరోష చిత్రపటం వద్ద వీసీతో సహా అధ్యాపకులు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. విద్యార్థిని కుటుంబానికి వర్సిటీ తరఫున ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనకయ్య, వైస్ ప్రిన్సిపాల్ జాన్సన్, ప్రవీణాబాయి, సీవోఈ పాతనాగరాజు, చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement