మూడు దశాబ్దాల దేశ రక్షణకు సెలవు
- నేవీ యుద్ధ విమానం లాస్ట్ ల్యాండింగ్
- విశాఖ తీరంలో మ్యూజియంగా టీయూ–142
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లాంఛనంగా అప్పగింత
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణలో 29 ఏళ్ల పాటు అప్రతిహతంగా సేవలందించిన టీయూ– 142ఎం ఎయిర్‌క్రాఫ్ట్ ఆఖరిసారిగా శనివారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయంలో దిగింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన ఈ లాంగ్ రేంజి మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ 1988 మార్చి 30న నేవీలోకి ప్రవేశించింది. అనంతరం తమిళనాడు అరక్కోణంలోని ఐఎన్ఎస్ రజాలి ఎయిర్‌బేస్ కేంద్రంగా సేవలందిస్తోంది. మార్చి 29న నేవీ సేవల నుంచి నిష్క్రమించిన ఈ యుద్ధ విమానాన్ని విశాఖ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థనకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది. దీంతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అరక్కోణం నుంచి విశాఖలోని నేవీ ఎయిర్ బేస్‌కు తీసుకువచ్చారు. ఉదయం 10.55 గంటలకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ చిట్టచివరిసారిగా డేగా రన్‌వేపై వాలింది.
వెనువెంటనే సంప్రదాయ బద్ధంగా మూడు చేతక్, రెండు కమోవ్, డోర్నియర్ విమానాలు, ఒక అత్యాధునిక పీ–8ఐ యుద్ధవిమానం ఫ్లైఫాస్ట్‌ను నిర్వహించాయి. ఆ తర్వాత అగ్నిమాపక శకటాలు రన్‌వే నుంచి వస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్– టీయూ 142పై ఇరువైపుల నుంచి వాటర్‌గన్స్ ద్వారా నీటిని వెదజల్లాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు, తూర్పు నావికాదళ ప్రధానాధికారి హెచ్‌సీఎస్ బిస్త్ తదితరులు ఈ యుద్ధ విమానానికి స్వాగతం పలికారు. ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి దిగిన పైలట్ కమాండర్ యోగేష్ మయర్ నేతృత్వంలోని తొమ్మిది మంది సిబ్బందిని వీరు అభినందించారు. అనంతరం ఈ యుద్ధ విమానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రపంచ నేవీ చరిత్రలోనే ప్రథమం
జలాంతర్గామి, యుద్ధ విమానం మ్యూజియాలు ఒకేచోట ఏర్పాటు కావడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. టీయూ–142 యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం ఐఎన్ఎస్ డేగాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నావికాదళంతో కలసి రాష్ట్రంలో టూరిజం వెంచర్, వాటర్ స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ దాదాపు మూడు దశాబ్దాల పాటు ఒక్క ప్రమాదం కూడా లేకుండా భారత నేవీకి విశేష సేవలందిం చిందని తూర్పు నావికాదళ ప్రధానాధికారి హెచ్‌సీఎస్ బిస్త్ అన్నారు. మాల్దీవుల్లో ఆపరేషన్ కాక్టస్, 1998లో ఆపరేషన్ విజయ్, 2003లో ఆపరేషన్ పరాక్రమ్‌తో పాటు యాంటీ పైరసీ ఆపరేషన్లలోనూ పాల్గొని ఎన్నో విజయాలు చేçకూర్చిందని కొనియాడారు.
సాగరతీరంలో మ్యూజియంగా..
ఈ యుద్ధ విమానాన్ని విశాఖ సాగరతీరంలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. ఆర్కే బీచ్‌కు ఆనుకుని ఉన్న కురుసుర జలాంతర్గామికి ఎదురుగా ఉన్న స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. డేగా ఎయిర్ బేస్‌లోనే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడగొట్టి రోడ్డు మార్గం ద్వారా ట్రాలర్లపై సాగరతీరానికి తరలిస్తారు. అక్కడ మళ్లీ య«థాతథంగా యుద్ధ విమానాన్ని అమరుస్తారు. దీనికి సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా.