ఇక మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు అస్సలు పగలవ్!
లండన్: మొబైల్ చేతిలో ఉన్నంత సేపు చాలా సరదాగా ఉంటుంది. అది కాస్త జారి కిందపడిందో గుండె బేజారి పోతుంది. ఎందుకంటే మనం ఎంతో ఇష్టపడే హ్యాండ్ సెట్ స్క్రీన్ పగిలిపోతుంది. ఫలితంగా జేబుకు చిల్లుపడుతోంది. పోని కొత్త టచ్ స్క్రీన్ వేయించుకుందామంటే ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ ల ధరలు ఆ ఫోన్ లో కనీసం పదో వంతు ఉంటాయి. దీంతో అసలు పగిలిపోయిన సెల్ ఫోన్ కు టచ్ స్క్రీన్ లు వేయించకుండానే ఉపయోగించుకునే వారు ఎంతో మంది. ఈ క్రమంలో వృధా అయ్యే సొమ్ముకూడా చాలా ఎక్కువంట. అయితే, ఇలాంటి ఆందోళనకు, భయానికి చెక్ పెట్టే తరుణం వచ్చేసింది.
బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఎట్టకేలకు మొబైల్ కిందపడిపోయినా పగలని స్క్రీన్ గార్డులను తయారుచేశారు. వీటిని 2018లో అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం లభిస్తున్న వాటికన్నా చౌకగా ఇవి లభించనున్నాయి. ఒక్క మొబైల్ ఫోన్లకే కాకుండా టీవీలకు, ట్యాబ్‌లకు, ల్యాప్‌టాప్‌లకు ఈ టచ్ స్క్రీన్ లు, గార్డులను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న టచ్ స్క్రీన్లన్నీ కూడా ఇడియం టిన్ ఆక్సైడ్(ఐటీవో) ద్వారా తయారు చేస్తున్నారు.. ఇవి బాగా ధర ఎక్కువ కూడా.
ఐటీవో ద్వారా తయారుచేసినవి కూడా పగిలిపోతుండటంతో ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఎం సాల్వ్ మైక్రో ఎలక్ట్రానిక్ సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు కొత్త పదార్థం కోసం వేట మొదలుపెట్టి విజయం సాధించారు. సిల్వర్ నానో వైర్స్ అండ్ గ్రాఫిన్ తో కొత్త హైబ్రిడ్ ఎలక్ట్రోడ్స్ను రూపొందిచి టచ్ స్క్రీన్లుగా మలచనున్నారు. ఈ నానో వైర్స్ ఒకటి ఓ వెంట్రుకలో పదివేలవంతు ఉంటుందట. సో.. 2018 తర్వాత ఏ స్మార్ట్ ఫోన్ కూడా పగిలిపోదని నిశ్చింతగా ఉండొచ్చన్న మాట.