22న ‘ఛలో కల్టెరేట్’
గజ్వేల్: అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ తెలిపారు. గురువారం గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు గడిచినా... ఆరోగ్య బీమా కార్డులు, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూం పథకం, అక్రిడిటేషన్ కార్డుల జారీ తదితర సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.
22న ఉదయం 11గంటలకు కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. సంగారెడ్డిలోనూ ఇదే సమయానికి ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ‘ఛలో కలెక్టరేట్’ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రంగాచారి, జిల్లా నాయకులు ఫైసల్ అహ్మద్, రవిచంద్ర, దుర్గారెడ్డి పాల్గొన్నారు.