tukaram gate police station
-
హైదరాబాద్: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి..
సాక్షి, అడ్డగుట్ట: తను చూసిన ఒక సినిమా తరహాలో కారును దొంగిలించి తన ఫ్రెండ్స్‌తో జల్సాలు చేస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన మేరకు.. ఈస్ట్‌మారేడుపల్లిలోని సెయింట్ జాన్స్ చర్చి వెనుకవైపు ఉన్న ఓ అపార్ట్మెంట్లో పార్క్ చేసి ఉన్న కారును ఈ నెల 9న అమీర్‌పేట్‌కు చెందిన రిత్విక్(25) అనే బిటెక్ విద్యార్థి దొంగిలించాడు. యజమాని డాక్టర్ పద్మావతి తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, వెహికిల్ చెకింగ్‌లో భాగంగా శుక్రవారం మహేంద్రాహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారులో వెళ్తున్న రిత్విక్‌ను పోలీసులు పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిత్విక్‌ను స్టేషన్‌కు తరలించి విచారించారు. అయితే ‘గాన్ ఇన్ సిక్స్టీ సెకన్స్’ సినిమా చూసి అందులో చేసిన విధంగా కారు దొంగిలించి స్నేహితులతో జల్సాలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
సిగరెట్ వివాదం.. పోలీసుల దాడి..!
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓ యువకుడిని చితకబాదారు. పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లి ఓ యువకుడిపై దాడి చేసి గాయపర్చారు. వివరాలు.. తుకారాంగేట్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు అక్కడను చేరుకుని యువకుల్ని స్టేషన్‌కు తరలించారు. సాయిగౌడ్ అనే యువకుడిని చితకబాదారు. దీంతో అతని నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడే ఉన్న ఉన్న యువకుడి స్నేహితులు ఇదంతా వీడియోలో చిత్రీకరించడంతో.. పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అకారణంగా తనను ఎస్ఐ రామ్‌లాల్, కానిస్టేబుల్ నాయక్ కొట్టారని, తాను కనీసం మద్యం కూడా తాగలేదని సాయి వాపోయాడు. ఇదిలాఉండగా.. ఓ సిగరెట్ వివాదంలో సదరు యువకుడు పోలీసులతో అతిగా స్పందించినట్టు తెలిసింది. -
ఆటో ప్రయాణికులే ఆరుగురి టార్గెట్!
అడ్డగుట్ట: ఆటో ప్రయాణికులే ఆరుగురి దొంగల టార్గెట్. పథకం ప్రకారం ప్రయాణికులకు ఆటోలో ఎక్కించుకోవడం.. ప్రయాణికుల సెల్ఫోన్లు, పర్సులు కొట్టేయడంలో వీరు ఘనాపాఠీలు. వారాసిగూడ, పాతబస్తీలకు చెందిన ఈ ఆరుగురు యువకులు చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వారాసిగూడకు చెందిన ఖాజా పాషా(23) అనే ఆటో డ్రైవర్, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్(24), ఫర్వేజ్(22), మహ్మద్ ఖాధీర్(21), మహ్మద్ శవాజ్ (22)లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. ఖాజా పాషా ఆటోలో వీరు ప్రయాణిస్తూ ఆటోలో ఎక్కిన ప్రయాణికుల సెల్ఫోన్లను మాయం చేస్తుంటారు. దొంగిలించిన సెల్ఫోన్లను జగదీశ్ మార్కెట్లోని మరో స్నేహితుడు ఫయాజ్(23)కు అమ్ముతుంటారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని సంతోష్ సొసైటీ వద్ద డబ్బులు పంచుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తుకారాంగేట్ పోలీసులు ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మహ్మద్ ఫర్వేజ్ పై హత్య కేస్, రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ ఉందని, మిగిలిన వారు అంతా చిన్న దొంగలు. వారి వద్ద నుంచి 53 సెల్ఫోన్లు, 4 తల్వార్లు, రూ.15వేలు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
‘నా చావుకు ఎవరూ కారణం కాదు’
నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య అడ్డగుట్ట: నా చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట ఏ సెక్షన్‌కు చెందిన కిషన్ ప్రైవేటు ఉద్యోగి. ఇతని కూతురు శివాణి(20) బీటెక్‌లో ఒక సబ్జెక్టు తప్పడంతో ఇంటి వద్దే ఉంటూ పరీక్షకు సిద్ధమవుతోంది. కాగా, బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో శివాణి తన ఇంట్లోని రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప రాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న శివాణి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి వచ్చి విగతజీవిగా పడివున్న కూతుర్ని చూసి గొల్లుమన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. ఓ పుస్తకంలో శివాణి రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.