తులాపూర్ త్రివేణి సంగమంలో అస్థికల నిమజ్జ్జనంపై నిషేధం.
పింప్రి, న్యూస్‌లైన్: తులాపూర్ పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమంలో అస్థికల నిమజ్జనంపై నిషేధం విధించారు. భీమా, భామా, ఇంద్రాయణీ నదుల త్రివేణి సంగమం కావడంతో మృతిచెందినవారి అస్థికలను ఇక్కడి నదీ జలాల్లో కలుపుతారు. దీనివల్ల మరణించినవారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తారు. పుణేతోపాటు ప్రింపి-చించ్వాడ్ నుంచి రోజుకు పదుల సంఖ్యలో అస్థికల నిమజ్జనం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
కేవలం అస్థికలను మాత్రమే వేస్తే సమస్య లేదని వాటితోపాటు మరణించిన వ్యక్తిని దహనం చేసిన తర్వాత మిగిలిన బూడిదనంతా కూడా ఇక్కడికే తీసుకువచ్చి కలుపుతున్నారని, అంతేకాక మరణించిన వ్యక్తి తాలూకు దుస్తులు, పరుపులు, దుప్పట్లు, బెడ్షీట్లు వంటివి కూడా నదిలోనే వేసేస్తున్నారని, దీంతో త్రివేణి సంగమ పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. నదీ జలాలు కూడా పూర్తిగా కలుషితమవుతున్నాయి.
పైగా తులాపూర్ గ్రామ ప్రజలు ఈ నదీ జలాలనే నిత్యావసరాలకు ఉపయోగిస్తుండడంతో వారు రోగాలబారిన పడాల్సి వస్తోంది. నీరు కలుషితం కావడంవల్ల రోగాలబారిన పడుతున్నవారి సంఖ్య ఇక్కడ బాగా పెరిగిందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే నీరు కలుషితం కాకుండా చూడడమొక్కటే మార్గమని గ్రామ పంచాయతీ తీర్మానించింది. దీంతో ఇక్కడి త్రివేణి సంగమంలో అస్థికలను నిమజ్జనం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ జయశ్రీ జ్ఞానేశ్వర్ శివలే, ఉప సర్పంచ్ గణేష్ పూజారి తెలిపారు.