ఆశల ఉగాది
విజయవాడ : నూతన రాజధాని తుళ్లూరు మండలం అనంతవరంలో శనివారం ఉగాది వేడుకలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం రూ.5కోట్ల నిధులు మంజూరుచేసింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని కనకదుర్గమ్మ ఆశీస్సులతో తయారుచేసే షడ్రుచుల ఉగాది పచ్చడితో ఈ కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే, కేవలం రాజధాని అని ప్రకటించడమే కాదు.. ఉత్సవాలు నిర్వహించడమే కాదు.. రాజధాని ప్రాంత ప్రజల జీవనం షడ్రుచుల సమ్మేళనంగా సాగేందుకు, వారి ఆశల్లో ఉగాది ఉషస్సు కనిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఆశల ఉపాధి అందివ్వాలి..
నవ్యాంధ్రప్రదేశ్‌కు సరికొత్త రాజధాని తుళ్లూరేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ భవిష్యత్తు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్నారు. రాజధాని నేపథ్యంలోనే విద్య, వైద్యం, కమ్యూనికేషన్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా రానున్నాయి. ఇందులో భాగంగా సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి మేధావులు నగరాన్ని సందర్శిస్తున్నారు. వీటి ద్వారా అయినా యువతకు ఉపాధి కల్పించాలి. వారి బంగారు భవితకు పూలబాట వేయాలి.
పర్యాటకంగా పరిఢవిల్లాలి..
జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలి. కృష్ణాతీర ప్రాంతంతో పాటు కొల్లేరు సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాజధానికి మంచి పేరు లభిస్తుంది.
రాజధాని రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి కుటుంబాల్లో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి పరిహారం పెంపుతో పాటు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించాలి.