త్రిశంకుస్వర్గంలో తుమ్మపాల
నేడు హైదరాబాద్‌లో డెరైక్టర్ ఆఫ్ సుగర్స్తోఎమ్డీల సమావేశం
భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం
అనకాపల్లి: జిల్లాలో తుమ్మపాల చక్కెరమిల్లు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కష్టకాలంలో రుణాలివ్వాల్సిన ఆప్కాబ్ మొండికేయడం, షూరిటీ విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం వంటి పరిణామాలతో దీని పరిస్థితి త్రిశంకుస్వర్గమైంది. వందలాది మంది కార్మికులు, వేలాది మంది రైతులకు చేదును పంచే పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులకు జీతాలు, చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులు యాజమాన్యం చేపట్టలేకపోవడంతో ఇప్పటికే పరపతి దెబ్బతింది.
గానుగాటకు ముహూర్తం ముంచుకొస్తున్నా స్పష్టత లేని దుస్థితి. డోలాయమానంలో ఉన్న ఈ కర్మాగారంపై గురువారం స్పష్టత రానుందని అంతా భావిస్తున్నారు. డెరైక్టర్ ఆఫ్ సుగర్స్ గురువారం హైదరాబాద్‌లో సహకార చక్కెర మిల్లుల ఎమ్‌డీలతో సమావేశమవుతున్నారు. ఈ సీజన్లో క్రషింగ్‌పై సమీక్షించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాలు ఇప్పటికే గానుగాటకు సిద్ధమయ్యాయి. తుమ్మపాలకు ఇప్పటికీ క్లియరెన్స్ రాలేదు. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో క్రషింగ్‌పై ఆచితూచి వ్యవహరించాలని ఎమ్‌డీకి జిల్లా అధికారులు సూచించడంతో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. మిల్లును మూసేస్తారంటూ ఇటీవల సుగర్కేన్ కమిషనర్ నుంచి వచ్చిన లేఖ కర్మాగార వర్గాల్లో అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే.
మిల్లు పరిస్థితిపై అంతా గోప్యం : మిల్లు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మూలకు చేరిన యంత్రాలతోపాటు అమూల్యమైన స్థలాలతో కలిపి కర్మాగార ఆస్తులను లెక్కిస్తే ప్రభుత్వ గణాంకాల మేరకు రూ.40 కోట్లుపైబడి ఉంటుందని అంచనా. అప్పులు, బకాయిలు రూ.15కోట్లు ఉంటాయి. మిల్లుకు సంబంధించిన డాక్యూమెంట్లన్నింటినీ తనాఖా కింద ఒక సహకార బ్యాంకు తనవద్దే ఉంచుకుందని సమాచారం. వేలాదిమంది రైతుల షేర్ధనంతో ఊపిరి పోసుకున్న మిల్లు ఆర్థికస్థితిగతులపై సహకారరంగ అధికారులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. వాస్తవాలు బయటపెట్టకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాకు చెందిన ఒక మంత్రి చేసిన వ్యాఖ్యల మేరకు కర్మాగారాన్ని మాక్స్ చట్టం కింద ఒక సహకార వ్యవస్థ అధినేతకు అప్పగిస్తారన్న వాదన వ్యక్తమైంది. ఇప్పుడున్న పరిస్థితిలో స్వయంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని ఫ్యాక్టరీకి భారీస్థాయిలో నిధులు కేటాయిస్తే తప్ప ఉపశమనం కలగదు.
ఇప్పటికే మిల్లు పరిధిలోని చెరకును పొరుగు జిల్లాలోని కర్మాగారానికి తరలించుకుపోతున్నారు. గతేడాది బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు బెల్లం తయారీకే మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రషింగ్‌కు అవసరమైన చెరకు లేనందున గానుగాట చేపట్టి నిధులు వృథా చేయెద్దని జిల్లాకు చెందిన అధికారి ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు తమకు జీతం బకాయిలు, ఫీఎఫ్ చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించే పనిలో పడ్డారు. ఈపరిణామాల నేపథ్యంలో గురువారంనాటి సమావేశంలో ఎమ్డీ రూపొందించిన నివేదికను చక్కెరశాఖ డెరైక్టర్ పరిశీలించి తుమ్మపాల గానుగాటపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.