హింసాత్మకంగా మారిన కాపుల ఆందోళన
తుని: కాపుల ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారులు తుని రూరల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిప్పు పెట్టారు. పలు వాహనాలు దగ్ధమవుతుండడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారంది.
అంతకుముందు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో ఐదు బోగీలకు మంటలు వ్యాపించాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ, గోదావరి, వోకా ఎక్స్ ప్రెస్ రైళ్లు విశాఖపట్నంలోనే ఆపేశారు. విశాఖ-విజయవాడ మధ్యలో పలు రైళ్లు నిలిపివేశారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కొవ్వూరులో నిలిచిపోయింది. విశాఖ నుంచి వెళ్లాల్సిన రాజమండ్రి, కాకినాడ ప్యాసింజర్లు రద్దు చేశారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి ఆందోళనకారులు జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. యలమంచిలి, కొక్కరాపల్లి వద్ద హైవేపై లారీలను పోలీసులు నిలిపివేశారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులను ఆపేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.