విముఖత
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్: అటవీశాఖ అధికారులకు తునికాకు సేకరణ లక్ష్యం గుదిబండగా మారింది. ఆకు సేకరణకు కాంట్రాక్టర్లు విముఖత చూపుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతేడాది టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు తునికాకు అమ్ముడు పోకపోవడంతో గోదాముల్లో నిలువ ఉంచారు. నష్టాలు రావడంతో టెండర్లకు ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు టెండర్ల కోసం పోటీపడే వారు ఇప్పుడు తక్కువ కోట్ చేస్తూ మొక్కుబడిగా పాల్గొంటున్నారు. దీంతో టెండర్ల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. తునికాకు సేకరణ మార్చిలో చేపట్టాలి. సమయం దగ్గర పడుతుండటం, టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో అటవీశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
1.20 లక్షల స్టాండర్డ్ బ్యాగ్(ఎస్బీ)ల తునికాకు లక్ష్యం
జిల్లాలో ఆరు అటవీశాఖ డివిజన్లు ఉన్నాయి. 88 యూనిట్లు ఉండగా 1,20,900 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా అటవీశాఖ నిర్ధేశించింది. గతేడాది 1,25,050 లక్ష్యాన్ని దశలవారీగా పూర్తి చేశారు. అయితే గతేడాది కాంట్రాక్టర్ల నిరాసక్తతో అటవీశాఖ అధికారులు ఈసారి 4 వేల స్టాండర్డ్ బ్యాగుల సంఖ్యను కుదించింది. ఇదిలాఉంటే ఒకప్పుడు తునికాకు సేకరణ కాంట్రాక్టర్లకు కాసుల పంట పండించింది. అప్పుడు బీడీలు తాగే వారి సంఖ్య అధికంగా ఉండేది. మన రాష్ట్రంలోని కోరుట్ల, సిరిసిల్లలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో బీడీ పరిశ్రమలు ఓ వెలుగు వెలిగాయి. బీడీలు తాగడం వల క్యాన్సర్ వ్యాధి వస్తుందని ప్రభుత్వం ప్రచారం హోరెత్తించడంతో బీడీలు తాగే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో బీడీ ఆకు వ్యాపారం మసకబారింది.
80 నుంచి 90 శాతం తక్కువ కోట్
తునికాకు సేకరణ వేలం పాట ఇప్పటికీ రెండుసార్లు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవనంలో యూనిట్లకు టెండర్లు జరుపుతున్నారు. సీల్డ్ కవర్ల ద్వారా టెండర్లను నిర్వహిస్తుండగా నిర్మల్ డివిజన్‌కు మాత్రం ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ ఆహ్వానించారు. గత డిసెంబర్ 28వ తేదీన టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు 80 నుంచి 90 శాతం వరకు టెండర్ కోట్ చేశారు. అత్యధిక శాతం తక్కువ టెండర్లను ఆమోదంచ లేదు. తిరిగి జనవరి 10నటెండర్లను ఆహ్వానించారు. మళ్లీ స్పందన రాకపోవడంతో టెండర్లను వాయిదా వేశారు. ఈనెల 24 మూడో సారి హైదరాబాద్‌లో టెండర్లను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.