Turakapalem
-
తురకపాలెం గ్రామం ప్రత్యేకత ఇదే..
భారతీయ సంస్కృతిలో భాగమైన భిన్నత్వంలో ఏకత్వ భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం గ్రామం. గ్రామంలోని ముస్లిం శిల్పకళాకారులు తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు. తాము చేసే పనిలో దైవాన్ని చూస్తామంటున్నారు. తురకపాలెం గ్రామంలో అందరూ ముస్లింలే. ఇతర మతస్తులెవరూ లేరు. ఈ గ్రామానికి ఉత్తరం వైపున ప్రభుత్వ పోరంబోకు భూములు ఉన్నాయి. సదరు భూముల్లో లభించే బండరాతితో హిందువులు పవిత్రంగా భావించి దేవాలయాల్లో ప్రతిష్ఠించే ధ్వజస్తంభాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో, మాచవరం వంద కుటుంబాలకు ఇదే వృత్తి.. సుమారు వందేళ్ల క్రితం తురకపాలెం గ్రామానికి చెందిన కరీమ్ సాహెబ్ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి. కరీమ్ సాహెబ్ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామంలో వందకుపైగా కుటుంబాలు ఈ కళనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. రూపుదిద్దుకున్న ధ్వజస్తంభం రాయిని శిల్పంగా మార్చి.. ధ్వజస్తంభం తయారు చేయాలంటే 10 మంది నుంచి 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడి 30 నుంచి 40 రోజుల వరకు పని చేయాల్సి ఉంటుంది. మొదటగా రాయిని గ్రామంలోని కొంత మంది కార్మికులు కలిసి ఎన్నుకుంటారు. 20 అడుగుల నుంచి 50 అడుగుల ధ్వజస్తంభం తయారు చేయటానికి 800 నుంచి 1,200 పనిదినాలు కూలీలు పనిచేయాల్సి ఉంటుంది. ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. రాయిని శిల్పంగా మార్చి పవిత్రమైన ధ్వజస్తంభం తయారు చేసే సమయంలో వీరు ఎంతో నిష్టగా ఉంటారు. ధ్వజస్తంభం పూర్తయిన తర్వాత జాగ్రత్తగా లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత కూడా వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజస్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. ఎంతో ఓపిక, నైపుణ్యంతో కష్టపడే వీరికి రోజుకు రూ.400 నుంచి రూ.600 మాత్రమే కూలి గిట్టుబాటు అవుతోంది. 30 ఏళ్లుగా ఇదే వృత్తి.. 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. అయితే ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. మిషన్లు రావటం వల్ల చేతితో తయారు చేసేవారికి అంతగా గుర్తింపు లేకుండా పోతోంది. – షేక్ షరీఫ్,ధ్వజస్తంభ తయారీదారుడు మా కళను గుర్తిస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు ధ్వజస్తంభం ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. – జాన్ వలీ, ధ్వజస్తంభ తయారీదారుడు ప్రభుత్వం సామాగ్రి అందిస్తే బాగుంటుంది.. ధ్వజస్తంభాలు తయారు చేసేందుకు ఉలి, సుత్తి, శ్రావణం, మలాట్, గడ్డపార లాంటి సామాగ్రి ఎంతో అవసరం. వీటిని కొనుగోలు చేయాల్సి వస్తే చాలా ఖర్చుతో కూడిన పని. మిగతా వృత్తుల వారికి ఏ విధంగా ప్రభుత్వం సామాగ్రి కోసం నగదు లేదా సామాగ్రిని అందిస్తోందో అదేవిధంగా మాకు కూడా సామాగ్రిని అందిస్తే బాగుంటుంది. – ఎగ్జాం వలి, ధ్వజస్తంభ తయారీదారుడు -
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి
గుంటూరు రూరల్ : గుంటూరులో దారుణం జరిగింది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు కుంటలో మునిగి మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పదేళ్ల లోపు నలుగురు చిన్నారులు ఈత కొట్టడానికి గ్రామ శివారులోని కుంటకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు అందులో మునిగి మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నలుగురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పెను విషాదం...
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో శనివారం పెనువిషాదం చోటుచేసుకుంది. గ్రామంలో పాడుపడిన క్వారీ గుంత వద్ద దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి మృతిచెందారు. తొలుత ముగ్గురు అక్కచెల్లెళ్లలో అందరికన్నా చిన్నమ్మాయి నీటిలో పడగా, ఆమెను కాపాడడానికి ప్రయత్నించి ఇద్దరు అక్కలూ కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలో పడిపోయారు. తమను కాపాడండంటూ ఆ చిన్నారులు పెడుతున్న ఆర్తనాదాలు విని పరిసరాల్లో ఉన్న వారు అక్కడకు వచ్చి వారిని వెలికితీసేటప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలిలా ఉన్నాయి. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన మేరకు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన చల్లా శ్రీనివాసరావు, చల్లా జ్యోతి దంపతులు పొట్టకూటి కోసం పదేళ్ల కిందట గుంటూరు శివారు ప్రాంతంలోని తురకపాలెంకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు శిరీష(11) నీలిమ(8)మల్లేశ్వరి(5) ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు చినపలకలూరు క్వారీలోను, తల్లి జ్యోతి రాఘవరావు క్వారీలోనూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే భార్యాభర్తలిద్దరూ ఉదయం పనులకు వెళ్లారు. పిల్లలు ముగ్గురూ తమ దుస్తులు ఉతుక్కుని స్నానం చేసివచ్చేందుకు పాడుపడిన క్వారీ గుంట వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికి నీటిలో దిగుదామనుకునే లోపే వారిలో చిన్నమ్మాయి అయిన మల్లేశ్వరి(5) కాలు జారి గుంతలో పడింది. చెల్లిని కాపాడుకునేందుకు మల్లేశ్వరి చెయ్యి పట్టుకునే ప్రయత్నంలో రెండో అమ్మాయి నీలిమ(8) కూడా కాలు జారి నీళ్లలో పడిపోయింది. కళ్లముందు నీటిలో పడిపోయిన ఇద్దరు చెల్లెళ్లను ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దక్క శిరీష(11) కూడా నీటిలో దిగింది. అయితే ముగ్గురూ చిన్నపిల్లలే కావడం, వారికి ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ కాపాడండని ఆర్తనాదాలు చేశారు. వారి కేకలు విని అక్కడే దుస్తులు ఉతుకుతున్న ముక్కంటి ఈశ్వర్ కుమార్తె బత్తుల దుర్గా భవాని చూసి పక్క క్వారీలో పనిచేస్తున్న కార్మికులను పిలుచుకువచ్చింది. వారు వచ్చి గుంతలో నుంచి చిన్నారులను బయటకు తీశారు. అయితే అప్పటికే శిరీష, నీలిమ చనిపోయారు. చిన్నమ్మాయి మల్లేశ్వరి కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించడానికి రోడ్డుపైకి తీసుకువెళ్లేటప్పటికి ఆ చిన్నారి ప్రాణాలు కూడా ఆవిరైపోయాయి.ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు ఉరుకులు పరుగులపై ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు, తహశీల్దార్ కె.చెన్నయ్య సిబ్బందితో అక్కడకు చేరుకుని ఘటన జరిగిన క్వారీ గుంటను పరిశీలించారు. ఈ క్వారీ గత నాలుగేళ్లుగా వినియోగంలో లేదని స్థానికులు చెప్పారు. గతంలో ఈ క్వారీ పసుపులేటి సంజీవరావు ఆధ్వర్యంలో ఉండేదని వారు తెలిపారు. క్వారీ గుంట నిండా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు, ఈ గుంటలో నీటి ఊట కూడా వస్తుందని, చాలా లోతుగా ఉంటుందని చెప్పారు. ఎక్కువగా ట్రాక్టర్ డ్రైవర్లు ఈ క్వారీలో తమ ట్రాక్టర్లు శుభ్ర పరుచుకునేందుకు వినియోగిస్తుంటారన్నారు. పోలీసులు క్వారీ యజమానిపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. దేవుడు అన్యాయం చేశాడయ్యా... అల్లారు ముద్దుగా పెంచుకునే తమ ముగ్గురు మహలక్ష్ముల్లాంటి చిన్నారులను ఒక్కసారిగా తమకు లేకుండా చేసి దేవుడు అన్యాయం చేశాడంటూ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మేమెవరి కోసం బతకాలంటూ పెద్దపెట్టున రోదించారు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు, చుట్టుపక్కల వారు సైతం కంటతడిపెట్టుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు... క్వారీలు నడుపుతూ పాడుపడిపోయిన నీటి గుంట వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్వారీ యజమానిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వై.శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. క్వారీల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా ఉన్నతాధికారులకు నివేదిక సిద్ధం చేసి చట్టపర మైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల కుటుంబానికి ఎమ్మెల్యే రావెల పరామర్శ ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటిపర్యంతం అవుతున్న చిన్నారుల తల్లి, దండ్రులను ఓదార్చారు. క్వారీలో పాడుపడిన నీటి గుంట ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. ప్రభుత్వం నుంచి మృతిచెందిన చిన్నారుల కుటుంబానికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చిన్నారుల అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి 20 వేల రూపాయలను అందజేశారు.