ఇక్కడ...2020 తలలు మార్చబడును!
ఏనుగు తల.. మనిషి శరీరంతో బొజ్జ గణపయ్య..
సింహం తల.. మనిషి దేహంతో ఉగ్ర నారసింహుడు..
పురాణాల నిండా ఇంకా ఎందరో.. ఎన్నో విచిత్ర రూపాలు..
ఎవరు ఎలా ఉన్నా... వారంతా దేవుళ్లు. సో... నో కొశ్చన్స్!!
మరి మన మనుషుల సంగతి?
కళ్లు మార్చుకోవడం చూశాం. కాళ్లు మార్చుకోవడం చూశాం. కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చివరికి గుండెలు మార్చుకోవడం కూడా చూశాం. కానీ.. ఏకంగా తల కూడా మార్చుకోవచ్చా..? ఒకరి తలను ఇంకొకరి మొండానికి అతికించవచ్చా? అతికించినా అవి మామూలుగా పనిచేయడం జరిగే పనేనా..? మదిలో పుట్టెడు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయా? ఏం ఫర్వాలేదు... అన్నీ సాధ్యమే అంటున్నారు ఇటలీలోని ‘టురిన్ అడ్వాన్స్డ్ న్యూరో మాడ్యులేషన్ గ్రూప్’ వైద్యుడు సెర్గియో క్యానవెరో! అంతేకాదు... ఇది ఎలా సాధ్యమో విడమర్చి మరీ చెప్పారాయన. తాను ఈ విషయం రెండేళ్ల క్రితమే చెప్పినప్పటికీ జూన్‌లో ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరలాజికల్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ సదస్సు’లో ప్రాజెక్టు ప్రణాళికను వివరంగా ప్రకటిస్తానని సెర్గియో ఇటీవల వెల్లడించారు.
రెండు తలల కుక్కలు.. తల మార్పిడి కోతులు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమాజ పురాణగాథల్లోనూ నర, జంతువులు కలగలిసిపోయిన రూపాలు అనేకం ఉన్నాయి. అనేక తలలు, విచిత్ర ఆకారాలు, లక్షణాలతో కూడిన వింత జంతువులూ లెక్కలేనన్ని. కానీ.. రెండు తలల కుక్కలు.. ఎలుకలు.. ఇటీవలి నిజం! వేరే కోతి తలతో బతికిన కోతి దేహం వాస్తవం! అవును.. మాయలు, మంత్రాలు, మహిమలు ఏమీ లేవు. కేవలం సైన్స్ సాధించిన అద్భుతమిది. ఇదే తల మార్పిడి ప్రక్రియ! అవయవాల మార్పిడి మాదిరిగా తల, దేహం మార్పిడిని సాధ్యం చేసే దిశగా ఆధునిక సైన్స్ సాగిస్తున్న ప్రస్థానమిది. పురాణగాథల్ని.. చరిత్ర మరుగున పడిపోయి వెలుగుచూడని సంగతులను పక్కన పెడితే.. ఆధునిక కాలంలో తొలిసారిగా 1954లో తల మార్పిడి జరిగింది. సోవియెట్ వైద్యుడు వ్లాదిమిర్ దెమికోవ్ కుక్కకు తల మార్పిడి చేశారు. మొక్కకు అంటుకట్టినట్టుగా ఒక పెద్ద కుక్కకు చిన్న కుక్కపిల్ల తలను ముందరి కాళ్లతో సహా అమర్చారు! ఈయన ప్రయోగాల్లో కుక్కలన్నీ రెండు నుంచి ఆరు రోజుల్లో చనిపోయాయి. అయితే, తొలిసారిగా 1970లలో అమెరికాలోని ఓహియోకు చెందిన రాబర్ట్ వైట్ బృందం తల మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఆ కోతి కృత్రిమ శ్వాస పరికరంతో శ్వాసించింది.
తన కొత్త దేహాన్ని కదిలించలేకపోయింది. ఎందుకంటే అప్పటికి వెన్నుపామును కలిపే టెక్నాలజీ లేదు. చివరికి రోగనిరోధక వ్యవస్థను నియంత్రించలేకపోవడంతో కొత్త దేహం కొత్త తలను పూర్తిగా తిరస్కరించింది. దీంతో ఆ కోతి తొమ్మిది రోజుల తర్వాత కన్నుమూసింది. తర్వాత వైట్ మరిన్ని కోతులకు తల మార్పిడులు చేశారు. ఈ ప్రయోగాల్లో కూడా ఆ కోతులు బతికాయి. పరిసరాలను చూశాయి. శబ్దాలు విన్నాయి. ఆహారాన్ని వాసన, రుచి చూశాయి. కానీ కొన్ని రోజులకే చనిపోయాయి. అయితే, వేలాది మెదడు శస్త్రచికిత్సలు చేసిన రాబర్ట్ వైట్ కనిపెట్టిన శీతలీకరణ టెక్నిక్ వైద్యశాస్త్రంలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శీతలీకరించడం ద్వారా కొంతకాలం రక్తం ప్రవహించకున్నా మెదడును సజీవంగా ఉంచేందుకు సాధ్యమైంది. ఈ ప్రక్రియే ఇప్పుడు తల మార్పిడికి మార్గం చూపింది.
ఇప్పుడెలా చేస్తారు?
తొలుత స్వీకర్త తలను, దాత శరీరాన్ని బాగా శీతలీకరిస్తారు. ఎంతగా అంటే.. ఆక్సిజన్ సైతం లేకుండా శరీర కణాలు మనుగడ సాగించే స్థితి దాకా. తర్వాత రెండు శరీరాలకూ మెడ చుట్టూ కణజాలాన్ని తొలగిస్తారు. ప్రధాన రక్తనాళాలను చిన్న ట్యూబులతో కలుపుతారు. అనంతరం రెండు శరీరాల వెన్నుపాము (వెన్నెముక మధ్యలో నాడీ కణాలు, కణజాలంతో దారపు బంతిలా ఉంటుంది)లను కచ్చితత్వంతో కట్ చేస్తారు. ఆ తర్వాత స్వీకర్త తలను దాత శరీరంపైకి చేర్చి.. రెండు వెన్నుపాములను కలుపుతారు. వెన్నుపాములను కలిపేందుకు జిగురులాంటి పాలీ ఎథిలీన్ గై ్లకాల్ (పాలిమర్ జెల్) రసాయనం ఉపయోగిస్తారు. ఈ జెల్‌ను కొన్ని గంటల పాటు ఇంజక్షన్ల రూపంలో ఇస్తారు. దీనివల్ల వెన్నుపాము కణాల పొరల్లో ఉండే కొవ్వు పరస్పరం అతుక్కుని వలలా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మెడ కండరాలను కలిపి కుట్టేస్తారు. చివరగా రక్తనాళాలను అతికిస్తారు.
దీంతో ఆపరేషన్ పూర్తవుతుంది. అయితే, కదలకుండా ఉంచేందుకోసం రోగిని నాలుగు వారాల వరకూ కోమాలోనే ఉంచుతారు. కోమా నుంచి మేలుకోగానే రోగులు కదలగలుగుతారు. తమ కొత్త దేహాన్ని అనుభూతి చెందగలుగుతారు. పాత గొంతుతోనే మాట్లాడతారు. కానీ లేచి నడవలేరు. అప్పుడు వెన్నెముక వద్ద ఎలక్ట్రోడ్లను అమర్చి.. వెన్నుపాముకు క్రమబద్ధంగా విద్యుత్ ప్రేరణలు అందిస్తారు. ఈ ప్రేరణల వల్ల నాడీ కనె క్షన్లు బలోపేతం అవుతాయి. తర్వాత క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయడం వల్ల రోగి క్రమంగా ఏడాదిలోపు నడవగలుగుతాడు.
ఏమిటి ఉపయోగం..?
ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తెలుసు కదా. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా వీల్‌చైర్‌కే పరిమితమైనా అంతరిక్ష మూలాలు శోధించిన ఘనుడాయన. అలాంటి మహా శాస్త్రవేత్త మన కళ్ల ముందుకు నడుచుకుంటూ వస్తే.. ఎలా ఉంటుంది? హాకింగ్ తలకు మరో దేహాన్ని తెచ్చి మార్పిడి చేస్తే.. ఇది నిజం అవుతుంది. అలాగే కండరాలు, నాడులు క్షీణించిన లేదా కీలక అవయవాలు కేన్సర్ వల్ల కుళ్లిపోయినవారు ఇక తనువు చాలించాల్సిందేనా? అవసరం లేదు. బ్రెయిన్ డెడ్ అయిన దాతల నుంచి శరీరాలు దొరికితే చాలు.. తెచ్చి కొత్త శరీరాలు అతికించుకుని ఎంచక్కా తిరిగేయొచ్చు. ప్రమాదం వల్లో ఇంకే కారణంతోనో దేహంలో కీలక అవయవాలు దెబ్బతిన్నవారికీ ఈ పద్ధతి అక్కరకొస్తుంది.
సైన్స్‌కు మలుపా..? పిచ్చి ప్రయోగమా..?
మనిషి జీవితాన్ని మరో జీవితకాలం పొడిగించే ఈ మహత్తర ఆలోచన సైన్స్ చరిత్రకు గొప్ప మలుపు అవుతుందా? లేక పిచ్చి ప్రయోగంగా మిగిలిపోతుందా? అంటే.. నిపుణులు మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. తల మార్పిడితో కొత్త దేహంలో కదలికలు వస్తాయన్నదానికి ఆధారాల్లేవని ఇండియానాలోని పుర్దూ యూనివర్సిటీకి చెందిన రిచర్డ్ బోర్గెన్స్ అంటున్నారు. ఇది ఎప్పటికైనా సాధ్యమవుతుందని తాను అనుకోవడం లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ హ్యారీ గోల్డ్‌స్మిత్ పెదవి విరుస్తున్నారు. ఇందులో ఎన్నో సమస్యలున్నాయని, అయినా, ఒక వ్యక్తిని నాలుగు వారాల పాటు కోమాలో ఆరోగ్యంగా ఉంచడం అనేది అసంభవమని ఆయన చెబుతున్నారు. అయితే, 2000లో రెండు గినీ పందుల వెన్నుపాములు కట్ చేసి అతికించిన ప్రయోగంలో 90 శాతం నాడీ వ్యవస్థ పునరుద్ధరణ జరిగిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ సాధ్యమైనా.. ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పని మాత్రం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నట్టూ.. ఒక తల మార్పిడి ఆపరేషన్‌కు ఎంత ఖర్చవుతుందో చెప్పలేదు కదూ. జస్ట్.. రూ. 81 కోట్లే!
- హన్మిరెడ్డి యెద్దుల
రెండేళ్లలో ఆపరేషన్‌కు రెడీ..!
తల మార్పిడికి తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే.. 2017 నాటికి సర్జరీ చేసి చూపిస్తా. వెన్నుపాములను అతికించేందుకు జెల్ పనిచేయకపోతే ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. మూలకణాలను లేదా ముక్కు, మెదడు మధ్యలో ఉండే ఘ్రాణశక్తి కణాలను వెన్నుపాములోకి ఇంజెక్ట్ చేయడం, కడుపు చర్మంలోని పొరలతో వెన్నుపాముల మధ్య ఖాళీ మీదుగా బ్రిడ్జిని నిర్మించడం వంటివి అమలు చేయొచ్చు. వెన్నుపాము గాయాలతో పక్షవాతానికి గురైన రోగుల్లో ఈ బ్రిడ్జి ప్రక్రియ ఇదివరకే విజయవంతం అయింది. అయితే వీటన్నింటిలో రసాయన చికిత్సే సులభం. సురక్షితం. ఒకప్పుడు కోతి తలను ఇంకో కోతి దేహం తిరస్కరించింది. కానీ ఇప్పుడిది పెద్ద సమస్య కాదు. కొత్త తలను అంగీకరించేలా రోగ నిరోధక వ్యవస్థను మందులతో నియంత్రించవచ్చు. కానీ సంస్కృతులు, మత విశ్వాసాల కారణంగా నైతిక సందేహాలు తలెత్తి సమాజం అంగీకరించకపోతే గనక నేనేమీ చేయలేను. అమెరికా, ఐరోపా ప్రజలు తిరస్కరించినా, ప్రపంచమంతా తిరస్కరించినట్లు కాదు. ఎక్కడ అనుమతి దొరికినా సరే ఆపరేషన్‌కు నేను సిద్ధం.
- సెర్గీయో క్యానవెరో