
ఉగ్ర దాడి కలకలం: భారీ తొక్కిసలాట
ట్యురిన్: ఇటలీలోని ట్యురిన్‌లో శనివారం భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. చాంపియన్స్ లీగ్ ఫైనల్‌ను వీక్షించడానికి పెద్ద ఎత్తున ఫుట్‌బాల్ ప్రేమికులు స్టేడియం వద్దకు తరలివచ్చారు. ఈలోగా స్టేడియంలో బాంబు పేలిందనే వార్తతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
దీంతో ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అంతే వందల మంది కింద పడిపోయారు. ఒకరిని ఒకరు తొక్కుకుంటూ వెళ్లడంతో దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడ్డారని, అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ హాని జరగలేదని స్ధానిక పోలీసులు తెలిపారు.
స్ధానిక మీడియా సంస్ధల కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి మ్యాచ్ మరో పది నిమిషాల్లో పూర్తవుతుందనగా.. టపాసులు పేలాయి. అవి బాంబు పేలుడు శబ్దాలని కొందరు ప్రేక్షకులు పెద్దగా అరవడంతో మిగిలిన వారు కంగరూపడిపోయి పరిగెత్తడం మొదలుపెట్టారు.
ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ తీసిన ఫోటో వందల కొద్ది షూస్ కిందపడిపోయి కనిపించాయి.