పగ తీర్చుకున్నారు
► ప్రతీకారంతోనే గుంటి రాజేష్ హత్య
► ఐదుగురు నిందితుల రిమాండ్
► వివరాలు వెల్లడించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్
గచ్చిబౌలి: తుర్క యాంజాల్‌లో జరిగిన గుంటి రాజేశ్ హత్యకు ప్రతీకారమే కారణమని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 27న తుర్కయాంజల్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కారు దిగుతుండగా ఐదుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్డుతో రాజేష్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయనపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆదిబట్ల సీఐ గోవింద్ రెడ్డి, ఏసీపీ మల్లారెడ్డి మృతుడు గుంటి రాజేష్‌గా గుర్తించారు. అతని శత్రువులపై ఆరా తీయగా శ్యాంసుందర్ రెడ్డిపై రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు.
కుమార్తె మృతికి కారణమైనందుకు
శ్యాంసుందర్ రెడ్డి తన భార్యకు కిడ్నీ దానం చేసినందుకు గాను పని మనిషికి ప్లాట్ కానుకగా ఇచ్చాడు. అయితే ఈ ప్లాట్ తన పూర్వీకులదైనందున తనకే అమ్మాలని రాజేష్ పట్టుబట్టాడు. దీంతో ఆమె రూ.3లక్షలకే ఆ స్థలాన్ని రాజేష్‌కు అమ్మింది. ఈ క్రమంలో 2015 ఫిబ్రవరి 27న ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసేందుకు పని మనిషి వెంట తన కూతురు అనుషాను తోడుగా పంపగా, రాజేష్ అదేరోజు అనుషాను తీసుకొని పారిపోయాడు. కొద్ది రోజులకు తీరిగి వచ్చిన అతను అనూషకు చెందిన అసభ్యకరమైన ఫొటోలు తన వద్ద ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో రాజేష్‌పై చైతన పురి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే మార్చి 17న అనూష నాగార్జునసాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా తన కూతురు మృతికి కారణమైన రాజేష్‌ను హత్య చేస్తానని శ్యాంసుందర్ రెడ్డి ప్రతిన పూనినట్లు ప్రచారం జరిగింది. రాజేష్‌పై హయత్‌నగర్ పీఎస్‌లో 18, చైతన్య పురి పీఎస్‌లో ఒక కేసు ఉంది. పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన అతను 3 నెలల క్రితం బయటకు వచ్చాడు. తన కూతురు కిడ్నాప్‌నకు గురైన రోజే శ్యాంసుందర్ రెడ్డి పక్కా ప్రణాళికతో ఫిబ్రవరి 27న హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.
పకడ్బందీగా స్కెచ్
తన కూతురు చావుకు కారణమైన రాజేష్‌ను అంతమొందించేందుకును రెండేళ్లుగా కొత్తపేట గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన శ్యాంసుందర్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన రాజేష్‌పై నిఘా ఏర్పాటు చేశాడు. అందుకు 20 రోజుల క్రితం రియల్ ఎస్టేట్ పార్ట్నర్, స్నేహితుడైన షేక్ మహ్మద్ కలీమొద్ధీన్(46) సహాయం కోరాడు. ఇందుకు అతను తన స్నేహితులైన అనంతపురం జిల్లా నాగప్పగారి పల్లికి చెందిన కుంచెపు రమణ, చిత్తూరు జిల్లా మేళ్లచెరువు,కు చెందిన డ్రైవర్ పొగరి దయాకర్, నల్గొండ జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీర్ చింత శ్యాంసుందర్ రావు సహకారం తీసుకున్నాడు. గత ఫిబ్రవరి 27న ఉదయం నుంచి రాజేష్ కదలికలపై నిఘా పెట్టిన శ్యాంసుందర్ రావు రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రాజేష్ సాగర్ రింగ్ రోడ్డు వైపు వన్నట్లు మిగతా వారికి సమాచారం అందించాడు.
సాగర్ రింగ్ రోడ్డులో మాటు వేసి ఉన్న శ్యాసుందర్ రెడ్డి, కలీమొద్ధీన్, రమణ, దయాకర్ కారులో అతడిని వెంబడించారు. తుర్కయంజాల్‌లోని ఓ బార్ వద్ద కారు నుంచి దిగుతుండగా కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులో మూడో నిందితుడైన కుంచెపు రమణపై ఇప్పటికే మూడు హత్య కేసులు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. కేసును చేదించిన పోలీసులకు రివార్డులు అందజేస్తామన్నారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, ఆదిబట్ల సీఐ గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు.