ఢిల్లీకి వచ్చిన మరో 'మోదీ'..!
న్యూ ఢిల్లీః లండన్ లోని మేడమ్ తుస్సాడ్ మ్యూజియంలో పెట్టేందుకు తయారు చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. నిర్మాణం పూర్తయి మ్యూజియంలో కొలువుదీరేందుకు సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని ప్రధాని మోదీకి చూపించేందుకు తుస్సాడ్ మ్యూజియం కళాకారుల బృందం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆయన లండన్ వెళ్ళి చూసే అవకాశం లేకపోవడంతో ఢిల్లీలోనే స్వయంగా తిలకించేందుకు వీలు కల్పించారు.
త్వరలో ప్రపంచ ప్రఖ్యాత తుస్సాడ్ మ్యూజియంలో కొలువుదీరనున్న తన విగ్రహాన్ని చూసిన మోదీ.. కళాకారులపై ప్రశంసల జల్లు కురిపించారు. వారిని అపర బ్రహ్మలుగా కీర్తించారు. ఆయన మైనపు విగ్రహాన్ని ప్రజలందరూ కూడ సందర్శించేందుకు వీలుగా ఏప్రిల్ 28న ఢిల్లీలో ప్రదర్శనకు ఉంచుతారు.
ముఖ్యంగా లండన్ లోనే కాక సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాగ్ లోని టుస్సాడ్ సంగ్రహాలయాల్లో కూడ మోదీ మైనపు విగ్రహాన్ని ఉంచేందుకు నిర్ణయించారు. ప్రపంచ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ప్రధాని మోదీ విగ్రహాన్ని రూపొందించేందుకు ఈ సంవత్సరం ప్రారంభంలో మ్యూజియం కళాకారులు, నిపుణులు ఢిల్లీలో భారత ప్రధాని మోదీని ఆయన ఇంట్లో కలుసుకున్నారు.