TV Mohandas Pai
-
ఎన్ఎస్ఈ ’యోగి’ వివాదంపై ట్విట్టర్ వార్..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణని గుర్తుతెలియని హిమాలయా యోగి ప్రభావితం చేసిన అంశం.. సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. పరిశ్రమ దిగ్గజాల మధ్య వాగ్యుద్ధానికి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా మారింది. ఎన్ఎస్ఈ బోర్డు మాజీ సభ్యుడు టీవీ మోహన్‌దాస్ పాయ్, ఫార్మా దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా మధ్య ట్వీట్ల యుద్ధం నడించింది. ఎన్ఎస్ఈలో అవకతవకలకు సంబంధించి, యోగి ప్రభావంతో చిత్రా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ సెబీ ఇచ్చిన ఆదేశాల వార్తాకథనాన్ని ట్విట్టర్లో కిరణ్ ప్రస్తావించారు. దాని లింక్‌ను షేర్ చేసిన మజుందార్–షా, నియంత్రణ సంస్థను ప్రస్తావిస్తూ ‘భారత్‌లో టాప్ స్టాక్ ఎక్సే్చంజీని ఒక యోగి తోలుబొమ్మలాట ఆడించారు. ప్రపంచ స్థాయి స్టాక్ ఎక్సే్చంజీగా చెప్పుకునే ఎన్ఎస్ఈలో గవర్నెన్స్ లోపాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. అసలు తనిఖీలు, పర్యవేక్షణే లేకుండా పోయిందా‘ అని ఫిబ్రవరి 13న వ్యాఖ్యానించారు. పాయ్ కౌంటర్..: అయితే, ఎక్సే్చంజీని ఏ యోగీ నడిపించలేదని, దుష్ప్రచారాలు చేయొద్దని 14న పాయ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఎన్ఎస్ఈని ఏ యోగీ నడిపించలేదు! దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపండి! ఎంతో అధునాతనమైన టెక్నాలజీతో పని చేసే స్టాక్ ఎక్సే్చంజీలో ఇలా జరిగిందని మీరు నిజంగానే నమ్ముతున్నారా? ఎక్సే్చంజీ కోసం ఇరవై నాలుగు గంటలూ పనిచేసే అద్భుతమైన ఉద్యోగులను మీరు అవమానిస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మరుసటి రోజున పాయ్ వ్యాఖ్యలపై మజుందార్–షా మళ్లీ స్పందించారు. -
టెకీలకు షాక్ : 40,000 ఉద్యోగాల కోత..
బెంగళూర్ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది 30,000 నుంచి 40,000 మంది మధ్యశ్రేణి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ ప్రముఖులు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలో మార్పుల పరంగా ప్రతి ఐదేళ్లలో ఒకసారి ఇలాంటివి సాధారణమేనని చెప్పుకొచ్చారు. పరిశ్రమ ఎదుగుతున్న క్రమంలో మధ్యశ్రేణి ఉద్యోగులు తమ వేతనానికి తగిన స్ధాయిలో కంపెనీకి విలువను జోడించలేరని వ్యాఖ్యానించారు. కంపెనీలు వేగంగా ఎదుగుతుంటే ప్రమోషన్లు వస్తాయని, స్లోడౌన్ వంటి ప్రతికూల పరిస్ధితుల్లో కంపెనీలు సహజంగానే అధిక వేతనాలు అందుకునే ఉద్యోగులపైనే తొలుత దృష్టిసారిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. మెరుగైన సామర్థ్యం కనబరిచేవరకే ఎవరైనా అధిక వేతనం పొందేందుకు అర్హులని, తీసుకునే వేతనానికి సమాన స్ధాయిలో కంపెనీకి విలువ జోడించాలని పాయ్ స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమలో ఈ ఏడాది భారత్‌లో 30,000 నుంచి 40,000 మంది మధ్యస్ధాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆయన అంచనా వేశారు. వీరిలో 80 శాతం మందికి తగిన నైపుణ్యాలు ఉంటే ఇతర పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. -
2025 నాటికి లక్ష స్టార్టప్‌లు: పాయ్
న్యూఢిల్లీ: భారత్‌లో 2025 నాటికి లక్ష స్టార్టప్‌లు ఉంటాయని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీవీ మోహన్‌దాస్ పాయ్ చెప్పారు. 2030 నాటికి స్టార్టప్ వ్యవస్థ దేశంలో 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించే అవకాశం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం మన దేశంలో 32,000 స్టార్టప్‌లు ఉన్నాయి. ఏటా 7,000 స్టార్టప్‌లు ఆరంభమవుతున్నాయి. 2025 నాటికి ఈ స్టార్టప్‌ల సంఖ్య లక్షకు చేరుతుంది. 32.5 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించగలదు’’ అని స్టార్టప్‌లపై ఎన్ఎస్ఈ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాయ్ చెప్పారు. .మోహన్‌దాస్ పాయ్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా పలు స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ కూడా చేశారు. కొత్త తరహా టెక్నాలజీ లతో వచ్చే స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూలకు వెళ్లడం ద్వారా బ్రాండ్ విలువను సృష్టించుకోవాలని ఆయన సూచించారు. అమెరికా, చైనా తర్వాత స్టార్టప్‌లకు భారత్ అతిపెద్ద దేశమన్నారు. స్టార్టప్‌లు ఓ స్థాయికి చేరుకోగానే పబ్లిక్ ఇష్యూలకు వెళ్లాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఈ చైర్మన్ విక్రం లిమాయే కూడా సూచిం చారు. స్టార్టప్‌లు ఎదిగేందుకు, సమర్థవంతంగా కొనసాగేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఎన్ఎస్ఈ కట్టుబడి ఉందన్నారు. -
అదొక చెత్త స్టడీ: మండిపడ్డ ఐటీ నిపుణుడు
భారత టెక్కీల సత్తాను తక్కువ చేస్తూ వచ్చిన అధ్యయనంపై ఐటీ ఇండస్ట్రి ప్రముఖుడు, మాజీ ఇన్ఫోసిస్ టాప్ బాస్ టీవీ మోహన్ దాస్ పాయ్ మండిపడ్డారు. 95 శాతం మంది భారత ఇంజనీర్లు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారంటూ వెల్లడించిన యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనాన్ని ఆయన ఖండించారు. అదొక్క చెత్త అధ్యయనమని అభివర్ణించారు.భారత టెక్కీల సామర్థ్యాలకు పాయ్ తన మద్దతు పలికారు. యాస్పైరింగ్ మైండ్స్ విడుదల చేసిన సర్వేలో 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారని, కేవలం 4.77 శాతం మంది మాత్రమే ఒక ప్రోగ్రామ్‌కు సరైన కోడ్ రాయగలుగుతున్నారని పేర్కొంది. ఈ అధ్యయనంపై పాయ్ ట్విట్టర్ ద్వారా తన అభ్యంతరాన్ని తెలిపారు. టీవీ మోహన్ దాస్ పాయ్ అభిప్రాయానికి తాను కూడా మద్దతు పలుకుతున్నానని మరో బిజినెస్ లీడర్ కిరణ్ మజుందర్ షా కూడా తెలిపారు.వారు ఎక్కడి నుంచి ఇంజనీర్ల సామర్థ్యాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారో తెలియదన్నారు. బ్లూ కాలర్ వర్కర్లు కూడా భవిష్యత్తు కోడర్స్ అని ఆమె పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో కూడా చాలా మంది ఇంజనీర్లకు ట్రైనింగ్ లేదనే విషయాన్ని కూడా పాయ్ ఖండించారు. దేశీయ ఐటీ నిపుణుల సామర్థ్యాలపై ఆయన విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. 60-65 శాతం మందికి ట్రైనింగ్ లేదనేది చాలా తప్పు అని చెప్పారు. అది చాలా తప్పుడు ప్రకటనన్నారు. -
ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి
గెస్ట్ కాలమ్ దేశంలో ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు దిగజారడానికి విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి లేకపోవడమే ప్రధాన కారణం. ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, సరిపడా నిధులు అందిం చడం ద్వారా నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచవచ్చు. ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులు కాలేజీల ఎంపికలో జాగ్రత్తగా ఉండటంతోపాటు ఆన్‌లైన్‌లోనూ పాఠాలు నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల్లో ఎదగాలనే కాంక్ష బలంగా ఉండాలంటున్న ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టి.వి.మోహన్ దాస్ పాయ్‌తో గెస్ట్‌కాలం.. కళాశాల ఎంపిక: దేశంలోని విద్యా వ్యవస్థ చాలా పెద్దది. దీని నాణ్యతలో ఎన్నో వ్యత్యాసాలున్నాయి. 15 శాతం పాఠశాలలు మినహా, ప్రాథమిక విద్యలో నాణ్యత దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఉన్నత విద్య విషయానికి వస్తే.. భారత్‌లో 21శాతం మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరి సంఖ్య ప్రతిఏటా 7శాతం చొప్పున పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే. దక్షిణ భారత దేశంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య 25 శాతం. అయితే, ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులు కళాశాలను ఎంచుకునేటప్పుడు కళాశాలలో మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణతా శాతం, బోధనా సిబ్బంది నైపుణ్యం, ప్లేస్మెంట్ అవకాశాలు, కరిక్యులం.. మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. నాణ్యమైన విద్య: విద్యా వ్యవస్థలో ప్రమాణాలు మెరుగుపడ కపోవడానికి మితిమీరిన కేంద్రీకృత వ్యవస్థ ప్రధాన కారణం. ప్రభుత్వ నియంత్రణ దేశంలో ఉన్నత విద్యా సంస్థలను దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యా సంస్థలకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వాలి. అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయి, ప్రతిభావంతులైన విద్యార్థులను అందిస్తాయి. స్వయం ప్రతిపత్తి కల్పించడం, సరిపడా నిధులు అందించడం.. ఈ రెండే ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల సమస్యకు పరిష్కారం. అలాగే, నాణ్యమైన విద్య పొందాలని కోరుకొనే విద్యార్థులకు నేర్చుకోవాలనే ఆసక్తి, భిన్నమైన అంశాలను అధ్యయనం చేసే అలవాటు, సంభాషణా నైపుణ్యాలు ఉండాలి. మూక్స్ కోర్సులు, ఆన్‌లైన్‌లోనూ పాఠాలను నేర్చుకోవచ్చు. సాంకేతిక విద్య-ప్రమాణాలు: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కేంద్రీకరణ, విద్యా సంస్థల నియంత్రణ కోసం పనిచేస్తోంది. ఈ సంస్థపై కొన్నిసార్లు రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. ఫలితంగా సాంకేతిక విద్యలో ప్రమాణాలు పెరగడం లేదు. వృత్తి విద్యలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి, ఉన్నత విద్యా సంస్థలపై ఎలాంటి నియంత్రణ విధించకుండా, వాటికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నైపుణ్యాలు: నేటి జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. ఎంచుకున్న కెరీర్లో ఉన్నతంగా ఎదగాలనే కాంక్ష విద్యార్థుల మనస్సుల్లో బలీయంగా ఉండాలి. దాంతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస, సమస్యలను పరిష్కరించగల దృక్పథం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, విస్తృతంగా చదివే అలవాటు, తమకు పనికొచ్చే ఇతర అంశాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా కంపెనీలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఉన్నాయా, లేవా అని పరిశీలిస్తున్నాయి. తర్కబద్ధంగా ఆలోచించే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సంస్థలు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పరిశ్రమలు-కళాశాలలు: పరిశ్రమ అవసరాలు- విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించాలంటే.. దేశంలోని విశ్వవిద్యాలయాలకు యూజీసీ, ఏఐసీటీఈ నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ప్రపంచంలో మొదటి అత్యుత్తమ 500 యూనివర్సిటీలు మన దేశంలోకి స్వేచ్ఛగా అడుగుపెట్టేందుకు అనుమతించాలి. ప్రస్తుత వ్యవస్థలో పరిశ్రమలు, విద్యా సంస్థలకు మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు తగిన మార్గాలను గుర్తించాలి. జాబ్ మార్కెట్: దేశంలో 8 శాతం వార్షిక వృద్ధి నమోదైతే కొత్త ఉద్యోగాలకు ఢోకా ఉండదు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉండనుంది. ముఖ్యంగా ఈ ఏడాది దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మరింత వృద్ధి చెందనున్నాయి. కాబట్టి ఈ రంగాల్లో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరోవైపు కొత్త ఉద్యోగాల సృష్టి విరివిగా జరగాలంటే.. భారత పారిశ్రామిక రంగంలో పలు మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరింత ఓపెన్ ఎకానమీ వ్యవస్థ రావాలి. దీనివల్ల వేగవంతమైన ప్రగతికి మార్గం ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్-మేధోవలసలు: బ్రాంచ్ ఏదైనప్పటికీ ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకోవడం ప్రొఫెషన్‌కు ద్రోహం చేయడమే అనడం సరైంది కాదు. తమకు ఇష్టమైన, ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొనే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. అది వారి హక్కు కూడా. అలాగే విద్యార్థులు భారత్‌లో విజ్ఞానాన్ని ఆర్జించి, విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఈ మేధో వలసలతో నష్టమేనన్న వాదనలో కూడా నిజం లేదు. భారత్‌లో మేధావులకు కొదవలేదు. నా సలహా: కష్టపడి పని చేయండి, చేసే పనిని ప్రేమించండి. సానుకూల దృక్పథాన్ని, మంచి ఆలోచనా ధోరణిని అలవర్చుకోండి. సవాళ్లను ఎదుర్కోండి. బృందాన్ని ముందుండి నడిపించే సామర్థ్యాలను పెంపొందించుకోండి. అలా చేస్తే.. కెరీర్‌పరంగా మీకు ఎదురే ఉండదు!!