ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి
గెస్ట్ కాలమ్
దేశంలో ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు దిగజారడానికి విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి లేకపోవడమే ప్రధాన కారణం. ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, సరిపడా నిధులు అందిం చడం ద్వారా నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచవచ్చు. ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులు కాలేజీల ఎంపికలో జాగ్రత్తగా ఉండటంతోపాటు ఆన్‌లైన్‌లోనూ పాఠాలు నేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల్లో ఎదగాలనే కాంక్ష బలంగా ఉండాలంటున్న ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టి.వి.మోహన్ దాస్ పాయ్‌తో గెస్ట్‌కాలం..
కళాశాల ఎంపిక:
దేశంలోని విద్యా వ్యవస్థ చాలా పెద్దది. దీని నాణ్యతలో ఎన్నో వ్యత్యాసాలున్నాయి. 15 శాతం పాఠశాలలు మినహా, ప్రాథమిక విద్యలో నాణ్యత దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఉన్నత విద్య విషయానికి వస్తే.. భారత్‌లో 21శాతం మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. వీరి సంఖ్య ప్రతిఏటా 7శాతం చొప్పున పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే. దక్షిణ భారత దేశంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య 25 శాతం. అయితే, ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులు కళాశాలను ఎంచుకునేటప్పుడు కళాశాలలో మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణతా శాతం, బోధనా సిబ్బంది నైపుణ్యం, ప్లేస్‌మెంట్ అవకాశాలు, కరిక్యులం.. మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
నాణ్యమైన విద్య:
విద్యా వ్యవస్థలో ప్రమాణాలు మెరుగుపడ కపోవడానికి మితిమీరిన కేంద్రీకృత వ్యవస్థ ప్రధాన కారణం. ప్రభుత్వ నియంత్రణ దేశంలో ఉన్నత విద్యా సంస్థలను దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యా సంస్థలకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వాలి. అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయి, ప్రతిభావంతులైన విద్యార్థులను అందిస్తాయి. స్వయం ప్రతిపత్తి కల్పించడం, సరిపడా నిధులు అందించడం.. ఈ రెండే ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల సమస్యకు పరిష్కారం. అలాగే, నాణ్యమైన విద్య పొందాలని కోరుకొనే విద్యార్థులకు నేర్చుకోవాలనే ఆసక్తి, భిన్నమైన అంశాలను అధ్యయనం చేసే అలవాటు, సంభాషణా నైపుణ్యాలు ఉండాలి. మూక్స్ కోర్సులు, ఆన్‌లైన్‌లోనూ పాఠాలను నేర్చుకోవచ్చు.
సాంకేతిక విద్య-ప్రమాణాలు:
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కేంద్రీకరణ, విద్యా సంస్థల నియంత్రణ కోసం పనిచేస్తోంది. ఈ సంస్థపై కొన్నిసార్లు రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. ఫలితంగా సాంకేతిక విద్యలో ప్రమాణాలు పెరగడం లేదు. వృత్తి విద్యలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి, ఉన్నత విద్యా సంస్థలపై ఎలాంటి నియంత్రణ విధించకుండా, వాటికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.
నైపుణ్యాలు:
నేటి జాబ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే.. ఎంచుకున్న కెరీర్‌లో ఉన్నతంగా ఎదగాలనే కాంక్ష విద్యార్థుల మనస్సుల్లో బలీయంగా ఉండాలి. దాంతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస, సమస్యలను పరిష్కరించగల దృక్పథం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, విస్తృతంగా చదివే అలవాటు, తమకు పనికొచ్చే ఇతర అంశాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా కంపెనీలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు ఉన్నాయా, లేవా అని పరిశీలిస్తున్నాయి. తర్కబద్ధంగా ఆలోచించే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు సంస్థలు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
పరిశ్రమలు-కళాశాలలు:
పరిశ్రమ అవసరాలు- విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించాలంటే.. దేశంలోని విశ్వవిద్యాలయాలకు యూజీసీ, ఏఐసీటీఈ నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ప్రపంచంలో మొదటి అత్యుత్తమ 500 యూనివర్సిటీలు మన దేశంలోకి స్వేచ్ఛగా అడుగుపెట్టేందుకు అనుమతించాలి. ప్రస్తుత వ్యవస్థలో పరిశ్రమలు, విద్యా సంస్థలకు మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు తగిన మార్గాలను గుర్తించాలి.
జాబ్ మార్కెట్:
దేశంలో 8 శాతం వార్షిక వృద్ధి నమోదైతే కొత్త ఉద్యోగాలకు ఢోకా ఉండదు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఆశాజనకంగానే ఉండనుంది. ముఖ్యంగా ఈ ఏడాది దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మరింత వృద్ధి చెందనున్నాయి. కాబట్టి ఈ రంగాల్లో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరోవైపు కొత్త ఉద్యోగాల సృష్టి విరివిగా జరగాలంటే.. భారత పారిశ్రామిక రంగంలో పలు మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరింత ఓపెన్ ఎకానమీ వ్యవస్థ రావాలి. దీనివల్ల వేగవంతమైన ప్రగతికి మార్గం ఏర్పడుతుంది.
సాఫ్ట్‌వేర్-మేధోవలసలు:
బ్రాంచ్ ఏదైనప్పటికీ ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ రంగాన్నే ఎంచుకోవడం ప్రొఫెషన్‌కు ద్రోహం చేయడమే అనడం సరైంది కాదు. తమకు ఇష్టమైన, ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొనే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. అది వారి హక్కు కూడా. అలాగే విద్యార్థులు భారత్‌లో విజ్ఞానాన్ని ఆర్జించి, విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఈ మేధో వలసలతో నష్టమేనన్న వాదనలో కూడా నిజం లేదు. భారత్‌లో మేధావులకు కొదవలేదు.
నా సలహా:
కష్టపడి పని చేయండి, చేసే పనిని ప్రేమించండి. సానుకూల దృక్పథాన్ని, మంచి ఆలోచనా ధోరణిని అలవర్చుకోండి. సవాళ్లను ఎదుర్కోండి. బృందాన్ని ముందుండి నడిపించే సామర్థ్యాలను పెంపొందించుకోండి. అలా చేస్తే.. కెరీర్‌పరంగా మీకు ఎదురే ఉండదు!!