బెంగళూర్ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది 30,000 నుంచి 40,000 మంది మధ్యశ్రేణి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ ప్రముఖులు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలో మార్పుల పరంగా ప్రతి ఐదేళ్లలో ఒకసారి ఇలాంటివి సాధారణమేనని చెప్పుకొచ్చారు. పరిశ్రమ ఎదుగుతున్న క్రమంలో మధ్యశ్రేణి ఉద్యోగులు తమ వేతనానికి తగిన స్ధాయిలో కంపెనీకి విలువను జోడించలేరని వ్యాఖ్యానించారు.
కంపెనీలు వేగంగా ఎదుగుతుంటే ప్రమోషన్లు వస్తాయని, స్లోడౌన్ వంటి ప్రతికూల పరిస్ధితుల్లో కంపెనీలు సహజంగానే అధిక వేతనాలు అందుకునే ఉద్యోగులపైనే తొలుత దృష్టిసారిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. మెరుగైన సామర్థ్యం కనబరిచేవరకే ఎవరైనా అధిక వేతనం పొందేందుకు అర్హులని, తీసుకునే వేతనానికి సమాన స్ధాయిలో కంపెనీకి విలువ జోడించాలని పాయ్ స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమలో ఈ ఏడాది భారత్‌లో 30,000 నుంచి 40,000 మంది మధ్యస్ధాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆయన అంచనా వేశారు. వీరిలో 80 శాతం మందికి తగిన నైపుణ్యాలు ఉంటే ఇతర పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment