ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్
ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్
Published Fri, May 12 2017 9:12 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM
బెంగళూరు : ఉద్యోగాల కోతపై తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోత భయాందోళనలను కొంత తగ్గించి, వేతనాల పెంపును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.. వేతనాల పెంపును జూలై వరకు వాయిదా వేస్తున్నట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. జూలై వరకు వేతనాల పెంపుకు ఆగాల్సిందేనని, సీనియర్ ఉద్యోగులకు మరింత ఆలస్యమయ్యే అవకాశముందుని తెలిపారు. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రవీణ్ రావు వివరించారు.
అయితే ఇన్ఫోసిస్ లో ఎలాంటి ఉద్యోగాల కోతకు తాము ప్లాన్ చేయడం లేదని యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. లేఆఫ్స్ ప్లాన్స్ పై టెక్కీల్లో నెలకొన్న ఊహాగానాలకు తాను స్వస్తి చెప్పుతున్నట్టు పేర్కొన్నారు. కానీ గతంలో మాదిరిగా కొంత ఫర్ఫార్మెన్స్ ఆధారితంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. వరుసగా కొంతకాలంపాటు మంచి పనితీరు కనబరచనివారిపై చర్యలు తీసుకోనున్నాం. ఇందులో భాగంగా కొందరు వైదొలగాల్సిన అవకాశముందని ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు.
ఎనిమిదేళ్ల కంటే తక్కువ అనుభవమున్న జాబ్ లెవల్ 5 ర్యాంక్ ఉద్యోగుల పరిహారాల సమీక్ష జూలై నుంచి ప్రారంభమవుతుందని ప్రవీణ్ రావు తమ ఉద్యోగులకు బుధవారం ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు పరిహారాల సమీక్ష తర్వాతి క్వార్టర్లలో ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నారు. వేతనాల పెంపు ఆలస్యం ఒకటి లేదా రెండు క్వార్టర్ల మార్జిన్లను కాపాడుకునేందుకు తాత్కాలిక మార్గమేనని అనాలిస్టులు చెబుతున్నారు. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక, టెక్ మహింద్రా సైతం వేతనాల పెంపును వాయిదా వేస్తుందని తెలిసింది.
కానీ సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు ఆలస్యమనేది, వారు ఇతర ఉద్యోగాలు చూసుకునే స్థాయికి దారితీస్తుందని ముంబై బ్రోకరేజ్ కు చెందిన ఓ అనాలిస్టు చెప్పారు. ఉద్యోగంలో అభద్రతా వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. ఇటీవల టెక్ కంపెనీల్లో భారీగా లేఆఫ్స్ తో ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సైతం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుందని తెలుస్తోంది. కానీ ఉద్యోగాల కోతకు తాము ఎలాంటి ప్లాన్ చేయడం లేదని, రెగ్యులర్ ఫర్ ఫార్మెన్స్ ఆధారితంగానే కొందరు వైదొలగాల్సి వస్తుందని కంపెనీ చెబుతోంది.
Advertisement