TV prices
-
టీవీ రేట్లకు మళ్లీ రెక్కలు!
న్యూఢిల్లీ: టీవీల రేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి. టెలివిజన్ స్క్రీన్ల తయారీలో కీలకమైన ఓపెన్–సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కేంద్రం భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. దీన్ని వచ్చే మూడేళ్లలో క్రమంగా 10–12 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని అమల్లోకి తేవచ్చని.. ఫలితంగా అక్టోబర్ నాటికి టీవీల రేట్లు 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొన్నాయి. ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతవుతున్నాయి. దేశీయంగా భారీ బ్రాండ్లలో శాంసంగ్, ఎల్జీ, సోనీ, థామ్సన్, కొడక్, వ్యూ, మి, వన్‌ప్లస్ వంటివి ఉన్నాయి. ఇలాంటి బ్రాండ్లన్నీ కూడా చైనా వంటి మార్కెట్ల నుంచి ఓపెన్–సెల్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ‘గత రెండేళ్లుగా (2020, 2021) భారత టీవీ పరిశ్రమకు గడ్డుకాలంగానే ఉంది. కోవిడ్–19 పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి వచ్చే దాకానైనా కాస్తంత ఊరట ఉండాలి‘ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జీఎస్టీ రేటును తక్షణం తగ్గించడం లేదా వచ్చే రెండేళ్ల పాటు ఓపెన్–సెల్ ప్యానెళ్లపై సుంకాలను రద్దు చేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒక చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ఏడాది ఇది మూడోసారి.. టీవీ రేట్లు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కానుంది. ప్యానెళ్ల రేట్లు పెరుగుతాయనే కారణంతో జనవరి, ఏప్రిల్‌లో టీవీల ధరలను కంపెనీలు పెంచాయి. చైనాకు చెందిన ప్యానెళ్ల తయారీ సంస్థలు ధరలను పెంచడం కూడా ఇందుకు కొంత కారణం. కస్టమ్స్ డ్యూటీతో పాటు టీవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా వర్తిస్తోంది. 32 అంగుళాల దాకా టీవీలపై 18%, అంతకు మించిన వాటిపై గరిష్టంగా 28% మేర జీఎస్టీ ఉంటోంది. 2019 నుంచి మల్లగుల్లాలు.. వాస్తవానికి మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా పెంచాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో టీవీల తయారీ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా వాటి తయారీ సామర్థ్యాలను పెంచుకుంటే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ విధించబోమంటూ 2019 సెప్టెంబర్‌లో పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. కానీ టీవీల తయారీ సంస్థలు ఇప్పటిదాకా దేశీయంగా ప్యానెళ్ల తయారీకి ఏర్పాట్లు చేసుకోలేకపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి, తదుపరి లాక్డౌన్ తదితర పరిణామాలతో వాటి ప్రణాళికలకు అంతరాయం ఏర్పడింది. ప్రతీ మూణ్నెల్లకోసారి పెరుగుదల కరోనా వైరస్ మహమ్మారి తెరపైకి వచ్చినప్పట్నుంచీ టీవీల ధరలు దాదాపు ప్రతీ త్రైమాసికానికోసారి పెరుగుతూనే ఉన్నాయి. తొలుత చైనాలో తయారీ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల రేట్లు పెరిగాయి. కానీ ఆ తర్వాత డిమాండ్–సరఫరా పరిస్థితి స్థిరపడిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. 2019 డిసెంబర్ ఆఖరు వారంలో చైనాలో కోవిడ్ కేసులు బైటపడినప్పుడు టీవీ తయారీ సంస్థల్లో ఆందోళన నెలకొంది. టీవీల తయారీకి కీలకమైన ప్యానెళ్లను ఎక్కువగా చైనానే సరఫరా చేస్తున్నందున .. అక్కడ కార్యకలాపాలు కుంటుపడితే ముడి వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనని కంపెనీలు భయపడ్డాయి. ఆ భయాలన్నీ తర్వాత నెలలోనే నిజమయ్యాయి. 2020 జనవరిలో .. చైనాలోని తయారీ హబ్‌లలో ఉత్పత్తి నిల్చిపోయింది. దీంతో ప్యానెళ్లు సహా ఇతరత్రా కీలక విడిభాగాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా 2020 ఫిబ్రవరి నుంచే రేట్లు 10% పెరిగాయి. అటుపైన మార్చి వచ్చేసరికి భారత్‌లో దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఒకవైపు విడిభాగాలు, మరోవైపు టీవీ సెట్లకు కూడా కొరత ఏర్పడింది. జూన్ నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో .. అన్ని సైజుల్లోని కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) జూలై ఆఖరున నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా 80 అంగుళాలు ఆ పైన పరిమాణమున్న హై–ఎండ్ టీవీ సెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. ఇక ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో వివాదం రాజుకోవడంతో భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంటు ఎగిసింది. అప్పట్నుంచి చైనా నుంచి వచ్చే విడిభాగాలు, ఫినిష్డ్ గూడ్స్‌పై నిఘా కొనసాగుతుండటం.. భారత్‌లో ఉత్పత్తి జాప్యానికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా సరిగ్గా దీపావళి పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్‌లో ప్యానెళ్ల రేట్లు పెరగడంతో టీవీల ధరలు దాదాపు 25 శాతం దాకా ఎగిశాయి. ఆ వెంటనే అక్టోబర్ 1 నుంచి ఓపెన్–సెల్స్‌పై 5% కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి విధించింది. -
రేపటి నుంచి టీవీల ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఆరోగ్య బీమా వరకూ అక్టోబర్ 1 నుంచి పలు నూతన నిబంధనలు అమలవనున్నాయి. పలు వస్తువులపై పన్ను భారాలతో పాటు కొన్ని వెసులుబాట్లూ అందుబాటులోకి రానున్నాయి. టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు పొందడం సులభతరం కానుంది. గురువారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఈ చలాన్‌ను ఆన్లైన్ పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయని, హార్డ్ కాపీని అధికారులు అడగరని తెలిపింది. అనర్హతకు గురైన డ్రైవింగ్ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను ఈ పోర్టల్‌లో రికార్డు చేస్తూ ఎప్పటికప్పుడు తాజాపరుస్తారు. ఇక ఆరోగ్య బీమా రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు బీమా నియంతరణ సంస్థ ఐఆర్డీఏ వెల్లడించింది. బీమా కంపెనీలు వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్‌కూ బీమా కవరేజ్‌ను వర్తింపచేస్తాయి. బీమా క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సులభంగా పరిష్కరించనున్నాయి. పెరగనున్న టీవీల ధరలు మరోవైపు అక్టోబర్ 1 నుంచి టీవీల ధరలు భారం కానున్నాయి. టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్ సుంకాలను ప్రభుత్వం విధించనుంది. తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి. చదవండి : బడ్జెట్ ధరల్లో శాంసంగ్ స్మార్ట్ టీవీలు విదేశాలకు పంపే నగదుపై మరింత పన్ను విదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం మూలం వద్ద పన్ను (టీసీఎస్) విధిస్తారు. ఆర్బీఐ రెమిటెన్స్ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్ చెల్లించాలని ఫైనాన్స్ చట్టం, 2020 పేర్కొంది. -
రూ.10,000 వరకు పెరగనున్న టీవీల ధరలు
న్యూఢిల్లీ: టెలివిజన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎల్ఈడీ ల్యాంపులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై గత వారం కేంద్రం సుంకం పెంచడంతో వీటి కొనుగోలుకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్లపై సుంకం 20 శాతానికి, స్మార్ట్ఫోన్లపై సుంకం 15 శాతానికి పెరిగింది. ఎల్ఈడీ ల్యాంపులు, మైక్రోవేవ్ ఓవెన్లపైనా దిగుమతి సుంకం 20 శాతానికి చేరింది. ఎల్ఈడీ టీవీల ధరలు సగటున రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వాటి సైజుల ఆధారంగా పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల స్థానిక తయారీదారులు లాభపడతారని, దేశీయ తయారీని పెంచడమే కాకుండా ‘భారత్‌లోనే తయారీ’కి డిమాండ్ ఏర్పడుతుందన్నారు. ఓవెన్లపై రూ.400-500 వరకు పెంపు ఉంటుందని గోద్రేజ్ అప్లియన్సెస్ బిజినెస్ హెచ్ కమల్‌నంది తెలిపారు. డ్యూటీ పెంపు తర్వాత యాపిల్ ఐఫోన్ల ధరలను రూ.3,720 వరకు పెంచిన విషయం విదితమే. -
టీవీల ధరలు పెంచుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ : ఇన్నిరోజులు డిస్కౌంట్ల వర్షం కురిపించిన డ్యూరబుల్స్ కంపెనీలు ఇక ధరల పెంపుకు రంగంలోకి దిగాయి. టెలివిజన్లు, అప్లియన్స్‌పై కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి రావడంతో టెలివిజన్ రేట్లను పెంచుతున్నట్టు ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ప్రకటించేసింది. ఈ ధరల పెంపును ప్రకటించిన తొలి కంపెనీ కూడా ఎల్జీనే. ఎల్జీ ఎల్ఈడీ టెలివిజిన్లు నుంచి ఎల్జీ స్మార్ట్ ఎల్ఈడీ సెట్లు, ఎల్జీ యూహెచ్డీ ఎల్ఈడీ సెట్ల వరకు ధరల పెంపును ఎల్జీ చేపడుతోంది. దీంతో పశ్చిమ ప్రాంతంలో డీలర్ ధరలు 1.3 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పెరిగాయి. ఇక ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో స్వల్పంగా 2 శాతం పెంపుదల కనిపిస్తోంది. ఎల్జీ అనుకున్న మాదిరిగానే ధరల పెంపును చేపట్టిందని విజయ్ సేల్స్ మేనేజింగ్ పార్టనర్ నైలేష్ గుప్తా ధృవీకరించారు. మరో ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్ కూడా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ వంటి వైట్ గూడ్స్ ధరలను త్వరలోనే పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ వారం చివరి కల్లా ఎంత పెంచాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పానాసోనిక్ సేల్స్ అండ్ సర్వీసు డైరెక్టర్ అజయ్ సేథ్ తెలిపారు. అయితే ప్రస్తుతమున్న రిటైల్ ధరలపై 3-4 శాతం మధ్యలో ప్రభావం పడే అవకాశం కనిపిస్తోందని సంబంధితవర్గాలు చెప్పాయి. అయితే శాంసంగ్ ఇప్పుడే ధరల పెంపును చేపట్టదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టి ప్రకటించడానికి ముందే వైట్ గూడ్స్‌పై 1-2 శాతం వరకు శాంసంగ్ ధరల పెంపు చేపట్టిందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. సోని సైతం తమ టీవీలపై రేట్లను పెంచే ప్లాన్స్ ఏమీ లేవని అధికారికంగా ప్రకటించింది. ఇప్పట్లో టీవీల ధరలు సమీక్షించే ఉద్దేశ్యమేమీ లేదని సోని ఇండియా సేల్స్ హెడ్ సతీష్ పద్మనాభన్ తెలిపారు. అయితే హెచ్‌పీ, మిగతా కంపెనీలు ధరల పెంపు దిశగా కదులుతున్నాయి. జీఎస్టీకి ముందు పాత స్టాక్‌ను విక్రయించడానికి ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ డిస్కౌంట్ల పర్వంతో విక్రయాలు కూడా జోరుగా కొనసాగించాయి. కొత్త పన్ను విధానం ఇక అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా కంపెనీలు రేట్ల పెంపును చేపడుతున్నాయి. ప్రస్తుతం కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌పై జీఎస్టీ రేటు 28శాతంగా ఉంది. ఇది ముందస్తు పన్ను రేటు కంటే ఎక్కువ.